https://oktelugu.com/

Posani Krishna Murali: అలీ సరే.. పోసాని కృష్ణ మురళి పరిస్థితి ఏంటి?

చంద్రబాబుతో పాటు పవన్ ను తిట్టడంలో ముందు వరుసలో ఉండేవారు పోసాని కృష్ణ మురళి. అందుకే ఆయనకు జగన్ ఏపీ స్టేట్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు జగన్.

Written By:
  • Dharma
  • , Updated On : June 30, 2024 / 11:02 AM IST

    Posani Krishna Murali

    Follow us on

    Posani Krishna Murali: వైసీపీకి సినీ పరిశ్రమ నుంచి మద్దతు అంతంత మాత్రమే. 2019 ఎన్నికల్లో అయిష్టంగానే సినీ పరిశ్రమ వైసిపికి మద్దతు తెలిపింది. తెలంగాణలో కెసిఆర్ అధికారంలో ఉండడంతో.. ఆయన ఒత్తిడి మేరకు సినీ పరిశ్రమ పరోక్షంగా జగన్ కు మద్దతు తెలిపింది. అయితే మోహన్ బాబు, పోసాని కృష్ణ మురళి, అలీ, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి, భానుచందర్, విజయ్ చందర్ లాంటి వాళ్లు బాహటంగానే మద్దతు తెలిపారు. ఎన్నికల్లో ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు ఒక్క పోసాని కృష్ణ మురళి తప్ప.. వైసీపీకి అందరూ దూరం జరిగి పోయారు.ఇప్పుడు వైసీపీకి ఓటమి ఎదురు కావడంతో అలీ రాజీనామా చేశారు. ఒక్క కృష్ణ మురళి సంగతి మాత్రం తెలియడం లేదు.

    చంద్రబాబుతో పాటు పవన్ ను తిట్టడంలో ముందు వరుసలో ఉండేవారు పోసాని కృష్ణ మురళి. అందుకే ఆయనకు జగన్ ఏపీ స్టేట్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు జగన్. పేరుకే పదవి కానీ సినీ పరిశ్రమ అభివృద్ధి గురించి ఒక్కరోజు కూడా పోసాని మాట్లాడలేదు. ఫక్తు వైసిపి కార్యకర్తగానే మాట్లాడారు. ఆ పదవి మాటున రాజకీయ విమర్శలు చేసేవారు.అనుచిత వ్యాఖ్యలు చేయడానికి కూడా వెనుకడుగు వేసే వారు కాదు. వ్యక్తిగత దుర్భాషలాడేవారు. శాపనార్ధాలు పెట్టేవారు. అయితే ఇప్పుడు ఏపీలో అధికారం మారడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కనీసం తన నామినేటెడ్ పదవికి రాజీనామా కూడా చేయలేదు.

    ఇటీవల అలీ వైసీపీకి రాజీనామా చేశారు. ప్రత్యేక వీడియో విడుదల చేశారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదన్నారు. 1999లో దగ్గుపాటి రామానాయుడు టిడిపి నుంచి పోటీ చేయడంతో ఆ పార్టీ సానుభూతిపరుడుగా వ్యవహరించానని గుర్తు చేశారు. వైసీపీలో పని చేసినా ఎవరిపై వ్యక్తిగత దూషణలు చేయలేదని చెప్పుకొచ్చారు అలీ. దీంతో అందరి దృష్టి పోసాని కృష్ణ మురళి పై పడింది. వ్యక్తిగత దూషణలు చేస్తూ ఇన్ని రోజులు సమయం గడిపారు పోసాని. అలీ మాత్రం ఈజీగా తేలిపోయారు. కానీ పోసాని కృష్ణమురళి మాత్రం ఇంతవరకు బయట ప్రపంచానికి రాలేదు. కనీసం మీడియాతో మాట్లాడేందుకు కూడా సాహసించడం లేదు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు స్వేచ్ఛగా బయటకు వచ్చి మాట్లాడేవారు. బరితెగించి కామెంట్స్ చేసేవారు. ఇప్పుడు అధికారం మారడంతో పోసాని అజ్ఞాతాన్ని వీడడం లేదు. పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చగా మారింది.