TTD: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. రోజురోజుకు భక్తుల రద్దీ పెరుగుతోంది. ఒక్క శనివారం నాడే 80,404 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 35,825 మంది తలనీలాలను సమర్పించుకున్నారు. మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.83 కోట్ల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి సమకూరింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి దాదాపు 20 గంటల సమయం పట్టింది.
ఇటీవల టీటీడీలో అనేక అవకతవకలు బయటపడుతున్న సంగతి తెలిసిందే. దీంతో వాటిని నియంత్రించేందుకు టీటీడీ నడుము బిగించింది. ముఖ్యంగా దళారుల వ్యవస్థను రూపుమాపడం పై దృష్టి పెట్టింది. శ్రీవారి దర్శనం టికెట్లు డూప్లికేషన్, నకిలీ వెబ్సైట్లు పుట్టుక రావడం, ఆన్ లైన్ దరఖాస్తులను పక్కదారి పట్టించడం వంటి సమస్యలపై దృష్టి పెట్టింది టీటీడీ.ఇటువంటి వాటిని నియంత్రించడానికి.. ఆన్ లైన్ సేవలకు ఆధార్ అనుసంధానించడమే ఉత్తమమని ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చింది. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశించారు. ఆన్ లైన్ సేవలను ఆధార్ కార్డుతో లింక్ చేయడం ద్వారా దళారీ వ్యవస్థకు చెప్పవచ్చని భావిస్తున్నారు.
ప్రస్తుతం టీటీడీ దర్శనం టికెట్ల జారీ, వసతి గదుల కేటాయింపు, ఆర్జిత సేవలు వంటివి ఆన్ లైన్ లోనే జారీ అవుతున్నాయి. అయినప్పటికీ దళారుల బెడద తప్పడం లేదు. ఎక్కడికక్కడే అవకతవకలు, కుంభకోణాలు బయటపడుతున్నాయి. వాటిని నియంత్రించకుంటే మున్ముందు ఈ తరహా మోసాలు పెరుగుతాయని టీటీడీ భావిస్తోంది. అందుకే ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఆధార్ కార్డు లింక్ ఉత్తమమని భావిస్తోంది. ఆధార్ ద్వారా భక్తులను గుర్తించడం, బయోమెట్రిక్ వెరిఫికేషన్ వంటి అంశాలు సులభతరం అవుతాయని అంచనా వేస్తోంది. అయితే ఆధార్ లింక్ సాధ్యమా? సాధ్యం కాదా? అన్నది తెలియాల్సి ఉంది.