Chandrababu: యనమలకు అలా.. అశోక్ గజపతికి ఇలా.. చంద్రబాబు సమతూకం

యనమల రామకృష్ణుడు ఈ ఎన్నికల్లో తప్పుకున్నారు. కుమార్తె దివ్య ను తుని నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేయించారు. ఆమె విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు.

Written By: Dharma, Updated On : June 30, 2024 10:44 am

Chandrababu

Follow us on

Chandrababu: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న నేతలు చాలామంది ఉన్నారు. టిడిపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే వారికి మంత్రి పదవులు కూడా ఖాయం. కానీ ఈసారి మాత్రం వారి పేర్లు వినిపించలేదు. కనీసం ఎన్నికల్లో పోటీ చేయలేదు కూడా. తాము తప్పుకొని వారసులకు అవకాశం ఇచ్చారు. అయితే వారి సేవలను వేరే విధంగా ఉపయోగించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందులో ఒకరికి గవర్నర్ పదవి, ఇంకొకరికి టీటీడీ అధ్యక్ష పదవి కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ వారు ఎవరో తెలుసా.. పూసపాటి అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇద్దరు నేతలు పనిచేస్తున్నారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇద్దరూ క్యాబినెట్లో కొనసాగడం ఖాయం. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు ఈ ఇద్దరూ కీలక పోర్టు పోలియోలు దక్కించుకునేవారు. ముఖ్యంగా యనమల రామకృష్ణుడు అయితే సుదీర్ఘకాలం ఆర్థిక శాఖ నే దక్కించుకునేవారు. ఒకసారి మాత్రం స్పీకర్ గా పదవీ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది.

యనమల రామకృష్ణుడు ఈ ఎన్నికల్లో తప్పుకున్నారు. కుమార్తె దివ్య ను తుని నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేయించారు. ఆమె విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అయితే యనమల రామకృష్ణుడును క్యాబినెట్ లోకి తీసుకుంటారని అంతా భావించారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అప్పట్లో ఎమ్మెల్సీగా ఉన్న యనమల రామకృష్ణుడు మంత్రివర్గంలోకి తీసుకున్నారు చంద్రబాబు. ఆర్థిక శాఖను కేటాయించారు. ఈసారి కూడా అలానే తీసుకుంటారని భావించారు. కానీ అలా జరగలేదు. యనమల రామకృష్ణుడును గవర్నర్ గా పంపిస్తారని తెలుస్తోంది. ఎన్డీఏలో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీకి ఒక గవర్నర్ పోస్ట్ కేటాయించనున్నట్లు సమాచారం. అయితే ఆ పోస్ట్ కు యనమల రామకృష్ణుడు అయితే సరిపోతారని చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.ఇప్పటికే యనమల రామకృష్ణుడు పేరు ఖరారు చేస్తూ చంద్రబాబు ప్రతిపాదించినట్లు సమాచారం.

మరోవైపు అశోక్ గజపతిరాజు పేరును టీటీడీ అధ్యక్ష పదవికి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 1983 నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తూ వచ్చారు అశోక్. ఈసారి మాత్రం ప్రత్యక్ష ఎన్నికల నుంచి తప్పుకున్నారు. కుమార్తె అదితి గజపతిరాజును విజయనగరం అసెంబ్లీ నుంచి పోటీ చేయించి గెలిపించుకున్నారు. వృద్ధాప్యంలో ఉన్న అశోక్ కు టీటీడీ అధ్యక్ష పదవి కేటాయిస్తే సముచితంగా ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఆయనకు ఆ పదవి కేటాయించి గౌరవప్రదమైన రిటైర్మెంట్ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే విజయనగరం నుంచి యువ ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇచ్చారు. పూసపాటి కుటుంబానికి కాదని వేరొకరిని క్యాబినెట్ లోకి తీసుకున్నారు. అందుకే టీటీడీ అధ్యక్ష పదవి ఇచ్చి ఆ లోటును భర్తీ చేయాలని భావిస్తున్నారు.