https://oktelugu.com/

Viveka Case : వివేకా హత్య కేసులో ఏం తేలినట్టు.. నేటితో పూర్తయిన సుప్రీం గడువు

సీబీఐ మధ్యంతర చార్జిషీట్, ఇటు అవినాష్ మధ్యంతర బెయిల్ పిటీషన్లు దాదాపు ఒకేసారి న్యాయస్థానం ముంగిటకు రానుండడం కీలకాంశాలు. ఇప్పటికే కేసు విచారణలో జాప్యంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం ఇచ్చిన గడువు సైతం పూర్తికావడంతో సీబీఐ దానిపై ఇచ్చే సంజాయిషి, కోర్టు వ్యాఖ్యలు వంటి వాటిపై ఆసక్తి నెలకొంది.

Written By:
  • Dharma
  • , Updated On : June 30, 2023 / 06:12 PM IST
    Follow us on

    Viveka Case : వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు సంబంధించి సీబీఐకి సుప్రీం కోర్టు ఇచ్చిన గడువు నేటితో ముగుస్తోంది. జూన్ 30లోగా కేసు విచారణ పూర్తిచేయాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ఉన్న విచారణ అధికారులను సైతం మార్చి ప్రత్యేక సిట్ ను ఏర్పాటుచేసి మరీ విచారణను ప్రారంభించారు. కానీ కేసు మాత్రం కొలిక్కి రాలేదు. తుది విచారణ పూర్తికాలేదు. దీనిపై సీబీఐ మధ్యంతర చార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇప్పటివరకూ జరిపిన దర్యాప్తు వివరాలన్నింటీని చార్జిషీట్లో ప్రస్తావించనుంది. కుట్ర కోణాన్ని మరింత వెలుగులోకి తెచ్చేందుకు సమయం కావాలని కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

    ఆది నుంచి వివేకా హత్య కేసు మలుపులు తిరుగుతూ వస్తోంది. తన తండ్రి హత్యపై కుమార్తె సునీత గట్టిగానే పోరాడుతున్నారు. నిందితులకు శిక్ష పడాలని బలంగా కోరుకుంటున్నారు. అందుకే ఎన్ని ఇబ్బందులు వచ్చినా అధిగమించి న్యాయస్థానంలో కేసులపై కేసులు వేస్తూనే ఉన్నారు.  అయితే ఈ కేసులో బలమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి శనివారం ఆయన సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరవుతున్నారు. గత కొద్దిరోజులుగా సీబీఐ చర్యలు సైతం సైలెంట్ గా ఉండడం గమనార్హం.

    సీబీఐ సుప్రీం కోర్టులో దాఖలు చేసే మధ్యంతర చార్జిషీట్లలో ప్రస్తావించే అంశాలపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు జూలై 3న సుప్రీం కోర్టులో అవినాష్ మధ్యంతర బెయిల్ రద్దు పిటీషన్ విచారణకు రానుంది. దీంతో కేసు పూర్వపరాలు పరిశీలనకు వచ్చే అవకాశముంది. అటు సీబీఐ మధ్యంతర చార్జిషీట్, ఇటు అవినాష్ మధ్యంతర బెయిల్ పిటీషన్లు దాదాపు ఒకేసారి న్యాయస్థానం ముంగిటకు రానుండడం కీలకాంశాలు. ఇప్పటికే కేసు విచారణలో జాప్యంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం ఇచ్చిన గడువు సైతం పూర్తికావడంతో సీబీఐ దానిపై ఇచ్చే సంజాయిషి, కోర్టు వ్యాఖ్యలు వంటి వాటిపై ఆసక్తి నెలకొంది.