BJP – AP : మోదీ, షా ద్వయం యుద్ధానికి సిద్ధపడుతోంది. హ్యాట్రిక్ తో బీజేపీని విజయతీరాలకు చేర్చాలని భావిస్తోంది. కాషాయ దళాన్ని మొహరిస్తోంది. అటు విపక్షాలన్నీ ఏకమై దండయాత్ర ప్రారంభించగా..తిప్పికొట్టాలని బలమైన వ్యూహరచన చేస్తోంది. ముందుగా ఈ ఏడాది చివర్లో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలను సెమీ ఫైనల్ గా భావిస్తోంది. అందుకే ఆయా రాష్ట్రాల్లో భారీ రాజకీయ వ్యూహాలకు తెరతీస్తోంది. అందులో భాగంగా కేంద్ర కేబినెట్ లో ఆయా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని చూస్తోంది. పనిలో పనిగా తెలుగు రాష్ట్రాల్లో సైతం నాయకత్వాల మార్పునకు ఆలోచిస్తోంది. కేబినెట్ లో బెర్తులకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది.
అయితే ఇప్పుడు ఏపీ విషయంలో ఏంచేస్తుంది? అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేంద్ర కేబినెట్ లో ఏపీకి కనీస ప్రాతినిధ్యం లేదు. కనీసం సహాయ మంత్రి పదవైనా లేదు. అటు రాజ్యసభ పదవుల్లో సైతం పెద్దగా ప్రాధాన్యత లేదు. గత ఎన్నికల్లో లోక్ సభ స్థానాల్లో ఆ పార్టీ గెలవకపోవడమే అందుకు కారణం. అయితే ఎన్నికల తరువాత టీడీపీ నుంచి సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్ ఆ పార్టీలో చేరారు. యూపి నుంచి రాజ్యసభకు ఎన్నికైన జీవీఎల్ నరసింహరావు ఉన్నారు. ప్రస్తుతం సీఎం రమేష్, జీవీఎల్ మాత్రమే ఎంపీలుగా ఉన్నారు. వీరిలో ఒకరికి కేబినెట్ బెర్తు ఇస్తారా? అంటే మాత్రం స్పష్టత లేదు. ఒకరు టీడీపీ నుంచి రాగా.. మరొకరు యూపీ నుంచి భర్తీ కావడమే అందుకు కారణం.
పదవుల విషయంలో ఏపీపై నిరాదణ కొనసాగుతోంది. దక్షిణాదిలో అన్ని రాష్ట్రాలకు కేంద్ర కేబినెట్ లో ప్రాతినిధ్యం ఉంది. అటు ఈశాన్య రాష్ట్రాలకు సైతం చోటిచ్చారు. కానీ ఏపీ విషయంలో మాత్రం మొండి చేయి చూపారు. గత నాలుగేళ్లుగా ఈ వివక్ష కొనసాగుతోంది. ఇప్పుడు సైతం పరిగణలోకి తీసుకుంటారని గ్యారెంటీ లేదు. కానీ ఏపీ కంటే తెలంగాణకే ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అక్కడ ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి వరించింది. మిగతా ముగ్గురు ఎంపీల్లో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ధర్మపురి అరవింద్ ఫస్ట్ టైమ్ గెలిచారు. అందుకే లక్ష్మణ్ కు కేంద్ర కేబినెట్ లో తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. దీనిపై సోమవారం క్లారిటీ వచ్చే అవకాశమున్నట్టు టాక్ నడుస్తోంది. చూడాలి ఏం జరుగుతుందో?