https://oktelugu.com/

YS Sharmila – YS Viveka : హత్యకు ముందు షర్మిళతో వివేకా ఏం చెప్పారు?

గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమికి భాస్కరరెడ్డి, అవినాష్ రెడ్డిలే కారణం. బయటకు కుటుంబమంతా కలిసే ఉన్నట్టు భావించినా.. లోపల కోల్డ్ వార్ కొనసాగేదని షర్మిళ సీబీఐకి కీలక సమాచారమిచ్చారు.

Written By:
  • Dharma
  • , Updated On : July 21, 2023 5:43 pm
    Follow us on

    YS Sharmila – YS Viveka : వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక మలుపు. మొదటిసారిగా ఏపీ సీఎం జగన్ సోదరి, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ పేరు ప్రస్తావన వచ్చింది. వివేకా హత్య కేసుకు సంబంధించి ఆమె కీలక సమాచారం ఇచ్చినట్టు వెల్లడైంది. వివేకా హత్య పక్కా రాజకీయ కోణంలో జరిగిందని షర్మిళ ఆరోపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై పోరాడుతున్న వివేకా కుమార్తె సునీతకు షర్మిళ అండదండలు అందిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఎంపీ అవినాష్ రెడ్డి అండ్ కోను జగన్ వెనుకేసుకొస్తుండగా.. షర్మిళ మాత్రం వారిని వ్యతిరేకిస్తూ సునీతకు న్యాయం జరగాలని ఆకాంక్షించేవారు. చాలాసార్లు బాహటంగానే ప్రకటించారు.

    అయితే ఇప్పుడు ఈ కేసులో షర్మిళ కీలక వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల కోర్టులో విచారణకు సంబంధించి తుది చార్జిషీట్ ను సీబీఐ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 148 పేజీల్లో ఈ చార్జిషీట్ ఉంది. అందులో ఏ7గా వైఎస్ భాస్కరరెడ్డి, ఏ8గా వైఎస్ అవినాష్ రెడ్డిని చేర్చింది. వైఎస్ షర్మిళను 259వ సాక్షిగా పేర్కొంది. ఆమె గత ఏడాది అక్టోబరు 7న ఢిల్లీ సీబీఐ కార్యాలయానికి వెళ్లి వాంగ్మూలం ఇచ్చారు. వివేకా హత్యకు రాజకీయ కారణాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. అందుకు సంబంధించి ఆధారాలు లేకపోయినా.. కొన్నిరకాల అంశాలను సీబీఐ ముందు ఉంచారు. ఇందులో కుటుంబానికి సంబంధించి ఆర్థికపరమైన ఏ ఇతరత్రా కారణాలేవీ లేవని చెప్పినట్టు సీబీఐ తన చార్జిషీట్ లో ప్రస్తావించారు.

    మరికొన్ని అంశాలను సీఐబీ ఎదుట షర్మిళ బయటపెట్టారు. ఆమె మాటల్లోనే ‘వివేకా హత్యకు మూడు నెలల ముందు వివేకానందరెడ్డి తన వద్దకు వచ్చారు. కడప ఎంపీ సీటుకు పోటీచేయాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లో అవినాష్ రెడ్డిని కాకుండా తననే బరిలో దింపాలని ఆకాంక్షించారు. తాను అయితే జగన్ ఒప్పుకోరు కాబట్టే నన్ను ఒప్పించే ప్రయత్నం చేసినట్టు ఆయన మాటలబట్టి తెలిసింది. తొలుత ఒప్పుకోలేదు. కానీ బాబాయ్ పదేపదే ఒప్పించేసరికి సరేనన్నాను’ అంటూ షర్మిళ వాంగ్మూలం ఇచ్చారు.

    అయితే ఇదే విషయమై షర్మిళను సీబీఐ అధికారులు క్రాస్ చెక్ చేశారు. అవినాష్ రెడ్డిని ఎందుకు వివేకా వ్యతిరేకిస్తున్నారని అడిగారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమికి భాస్కరరెడ్డి, అవినాష్ రెడ్డిలే కారణం. బయటకు కుటుంబమంతా కలిసే ఉన్నట్టు భావించినా.. లోపల కోల్డ్ వార్ కొనసాగేదని షర్మిళ సీబీఐకి కీలక సమాచారమిచ్చారు. ఈ కేసులో షర్మిళ వాంగ్మూలం కూడా కీలకం కావచ్చని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.