Pawan Kalyan: ఏపీలో అందరి దృష్టి ఇప్పుడు పిఠాపురం పై పడింది. అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండడమే కారణం. పులివెందుల నుంచి జగన్, కుప్పం నుంచి చంద్రబాబు, హిందూపురం నుంచి బాలకృష్ణ, మంగళగిరి నుంచి లోకేష్ పోటీ చేస్తున్నా.. పెద్ద టెన్షన్ లేదు. కానీ పవన్ పోటీ చేస్తున్న పిఠాపురంలో మాత్రం హైటెన్షన్ నెలకొంది. పవన్ ఈసారి ఓడించి రాజకీయ సమాధి చేయాలని వైసిపి కంకణం కట్టుకుంది. వంగా గీతను పోటీ చేయిస్తోంది. జనసేన నుంచి భారీగా చేరికలకు ప్రోత్సహిస్తోంది. అటు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పవన్ ను ఓడించాలన్న కృత నిశ్చయంతో పనిచేస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారాన్ని పవన్ ప్రారంభిస్తున్నారు.
పవన్ పిఠాపురం నియోజకవర్గంలో అడుగుపెట్టారు. ఆయనకు మూడు పార్టీల నేతల నుంచి ఘనస్వాగతం లభించింది. అయితే పవన్ నేరుగా టిడిపి నేత వర్మ నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఆయన ఆతిధ్యాన్ని స్వీకరించారు. నియోజకవర్గం తాజా పరిస్థితులపై చర్చించారు. వైసీపీ రాజకీయ వ్యూహాల పైన చర్చలు జరిపారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.పవన్ ముందుగా గొల్లప్రోలు చేరుకున్నారు.జనసేన నేతలు భారీగా స్వాగతం పలికారు. ఇప్పుడు పిఠాపురంలో పవన్ గెలుపునకు వర్మ కీలకంగా మారారు. అందుకే ముందుగా దొంతమూరులోని వర్మ నివాసానికి పవన్ చేరుకోవడం విశేషం.
పొత్తులో భాగంగా పిఠాపురం జనసేనకు కేటాయించారు. అక్కడి నుంచి తానే పోటీ చేస్తున్నట్లు పవన్ స్వయంగా ప్రకటించారు. దీంతో వర్మ మద్దతు దారులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని వర్మపై ఒత్తిడి తెచ్చారు. తరువాత చంద్రబాబు పిలిచి వర్మతో మాట్లాడారు. ఆయన మెత్తబడ్డారు. పవన్ గెలుపునకు సహకరిస్తానని ప్రకటించారు. ఈసారి పిఠాపురం నుండి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని పవన్ గట్టిగా నిర్ణయించుకున్నారు. అందుకు టిడిపి నేత వర్మ సహకారం చాలా అవసరం.అందుకే పవన్ వర్మ కు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. నియోజకవర్గంలో అడుగుపెట్టిన తరువాత వర్మ ఇంటికి వెళ్లి కలిశారు.
మరోవైపు వైసీపీ దూకుడు మీద ఉంది. ఆ పార్టీ అభ్యర్థి వంగా గీత ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరోవైపు ముద్రగడ పద్మనాభం సైతం తనవంతు ప్రయత్నాలు ప్రారంభించారు. నియోజకవర్గంలోని కాపు ప్రముఖులపై గురి పెట్టారు. వారిని ఎలాగైనా వైసీపీలోకి చేర్చేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలో పిఠాపురంలో ఎలా ముందుకెళ్లాలి? ఎన్నికల ప్రచార సభలో ఏయే విషయాలను ప్రస్తావించాలి? అపరిస్కృత సమస్యలు ఏమిటి? ప్రజలకు ఏ హామీలు ఇవ్వాలి? అన్న వాటిపై వర్మతో చర్చలు జరిపారు. ఈ సాయంత్రం చేబ్రోలు రామాలయం సెంటర్లో భారీ బహిరంగ సభలో పవన్ ప్రసంగించనున్నారు. మొత్తానికి అయితే జనసేన అధినేత పవన్ పిఠాపురంలో మూడు రోజులపాటు సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. అక్కడి నుంచి జనసేన అభ్యర్థులు పోటీ చేయబోయే నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. ఇందుకు సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారైంది.