Kadiyam Srihari: కావ్య లేఖ రాస్తే.. కడియం శ్రీహరి తేనె తుట్టె కదిపాడు

తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి పని అయిపోయిందని కడియం శ్రీహరి ప్రకటించారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కరువైందని.. చేసిన అక్రమాలు పార్టీని వెంటాడుతున్నాయని.. ఇక ప్రజలు ఆ పార్టీని ఆదరించే పరిస్థితి లేదని కడియం శ్రీహరి చెప్పుకొచ్చారు.

Written By: Anabothula Bhaskar, Updated On : March 30, 2024 6:11 pm

Kadiyam Srihari

Follow us on

Kadiyam Srihari: భారత రాష్ట్ర సమితిని కడియం శ్రీహరి కుటుంబం ఏకీపారేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ.. తాను పోటీ చేయబోనని ప్రకటించిన కావ్య.. సంచలన లేఖ రాసి భారత రాష్ట్ర సమితిలో పరిస్థితులను బయటపెట్టారు. ఏకంగా కేసీఆర్ ను సంబోధిస్తూ పార్టీ పరిస్థితిని తూర్పార పట్టారు. కావ్య ఎఫెక్ట్ వల్ల ఇప్పటివరకు వరంగల్ పార్లమెంటు స్థానానికి కేసీఆర్ మరో అభ్యర్థిని ప్రకటించలేకపోయారు. ఇప్పటికీ అభ్యర్థి ఎంపిక విషయంలో చర్చలు జరుగుతున్నాయని భారత రాష్ట్ర సమితి అనుకూల మీడియా చెబుతున్నప్పటికీ.. కావ్య రాసిన లేఖ వల్ల ఇంతవరకూ మరో అభ్యర్థి పోటీ చేసేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. కావ్య రాసిన లేఖ కల్లోలం చల్లారకముందే.. కావ్య తండ్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరో సంచలన విషయాన్ని బయటపెట్టారు. భారత రాష్ట్ర సమితిలో తేనె తుట్టె కదిపారు.

తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి పని అయిపోయిందని కడియం శ్రీహరి ప్రకటించారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కరువైందని.. చేసిన అక్రమాలు పార్టీని వెంటాడుతున్నాయని.. ఇక ప్రజలు ఆ పార్టీని ఆదరించే పరిస్థితి లేదని కడియం శ్రీహరి చెప్పుకొచ్చారు. ప్రజల్లో ఆదరణ లేకపోవడం వల్లే తాము పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్టు కడియం వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని నన్ను తెలంగాణ ఇన్ ఛార్జ్ దీపా దాస్ మున్షి ఆహ్వానించారు. “నా కూతురు కావ్య కూడా రాజకీయ ప్రయాణంపై తుది నిర్ణయం తీసుకుంటుంది. సహచరులు, కార్యకర్తలతో చర్చిస్తామని” శ్రీహరి ప్రకటించారు. తాను ఇంకా కాంగ్రెస్ పార్టీలో చేరలేదన్నారు.

ఇక కడియం శ్రీహరి శుక్రవారం ఢిల్లీలో తన కూతురితో కలిసి కాంగ్రెస్ అగ్ర నేతలతో సమావేశమయ్యారు. సుదీర్ఘ భేటీలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. “నా రాకపట్ల వారు చాలా ఉత్సాహంతో ఉన్నారు. ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి అనేక కేసులతో ఇబ్బందులపాలైంది. పార్టీలో ఎవరు ముఖ్య నాయకులు ఉండే పరిస్థితి లేదు. చాలామంది నాయకులు బయటకు వచ్చేస్తున్నారని” కడియం శ్రీహరి కాంగ్రెస్ నేతలతో భేటీ అనంతరం ఢిల్లీ విలేకరులతో అన్నారు.

మరోవైపు కడియం కావ్య కు వరంగల్ పార్లమెంట్ టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ రావడంతోనే కడియం శ్రీహరి భారత రాష్ట్ర సమితి నుంచి బయటికి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక కెసిఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండే కేశవరావు, ఆయన కుమార్తె , గ్రేటర్ హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, పలువురు కీలక నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు ఇలా కీలక నాయకులు వెళ్లిపోతుండడంతో భారత రాష్ట్ర సమితిలో గందరగోళ పరిస్థితి నెలకొంది.