Andhra Pradesh: ఏపీ ప్రజలు సంక్షేమానికి ఓటు వేశారా? అభివృద్ధికి జై కొట్టారా? అన్నది మరికొద్ది గంటల్లో తెలిసిపోనుంది. రేపు ఉదయం 7:30 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ ను ప్రారంభించనున్నారు. దీంతో అన్ని పార్టీల అభ్యర్థుల్లో ఒక రకమైన టెన్షన్ కనిపిస్తోంది. అయితే ఈసారి ప్రజలు ఎటువైపు మొగ్గుతారా? అన్నది హాట్ టాపిక్ గా మారింది. 2014 రాష్ట్ర విభజనతో ఏపీ ప్రజలు ఒక స్ట్రాంగ్ నిర్ణయానికి వచ్చారు. నవ్యాంధ్రప్రదేశ్ కు ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు కావాలని భావించారు. అప్పుడే చంద్రబాబు(Chandrababu) తెరపైకి వచ్చారు. అప్పటికే వరుస రెండు ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. సీనియర్ నేతగా గుర్తింపు ఒకవైపు, రెండుసార్లు ఓడిపోయారని సానుభూతి మరోవైపు బాగా వర్కౌట్ అయ్యింది. చంద్రబాబు అధికారంలోకి రాగలిగారు. కానీ 2019 ఎన్నికలకు వచ్చేసరికి ఏపీ ప్రజలు సంక్షేమానికి జై కొట్టారు. ఉచిత పథకాలకు ఓటు వేశారు. జగన్ ను(Jagan) అంతులేని మెజారిటీతో గెలిపించారు. ఈ ఎన్నికల్లో ఎటువైపు నిలబడ్డారు అన్నది ప్రశ్న.
Also Read: Komatireddy Venkat Reddy: జగన్ భజనలో కేసీఆర్ కేటీఆర్.. కొత్తగా కోమటిరెడ్డి
ఏపీలో ఇప్పుడు ఎవరు అధికారంలోకి వచ్చినా సంక్షేమం తప్పనిసరి. అదే సమయంలో అభివృద్ధి కావాలి. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ సంక్షేమాన్ని అమలు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉచిత పథకాలను ప్రజలకు అందించగలిగారు. అయితే ఆ సంక్షేమాన్ని ప్రజలు ఎంతవరకు విశ్వసించారు అన్నది చూడాలి. అయితే అభివృద్ధి అనేది కనిపించలేదు. అమరావతి రాజధాని(Amaravati Capital) నిర్వీర్యం అయ్యింది. మూడు రాజధానులు పురుడు పోసుకోలేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. సరిహద్దు దాటి ఏపీలోకి పరిశ్రమలు రాలేదు. ఈ పరిణామాలన్నీ జగన్ కు ఇబ్బందికరమే. అయితే అప్పటివరకు అభివృద్ధి మంత్రాన్ని పఠించిన చంద్రబాబు సైతం.. నవరత్నాలకు దీటుగా సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు. సంపద సృష్టించి.. అభివృద్ధి చేసి.. పథకాలను అమలు చేస్తానని హామీ ఇచ్చారు. అదే సమయంలో నవరత్నాలకు కొద్దిపాటి పెంపు చేసి మేనిఫెస్టోను జగన్ ప్రకటించారు. అయితే ఈ ఇద్దరిలో ప్రజల విశ్వాసం అందుకున్నది ఎవరు అన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది.
Also Read: Andhra Pradesh: ఏపీలో మిగిలేదెవరు?
ఈ పరిణామాల క్రమంలో ఏపీ ప్రజలు ఎటువైపు మొగ్గు చూపారు? అన్నది సస్పెన్స్ గా మారింది. అయితే మెజారిటీ ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలు మాత్రం టిడిపి కూటమి అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పాయి. అయితే ప్రజలకు విరివిగా సంక్షేమ పథకాలు అందించామని.. ప్రజల విశ్వాసం తమకు ఉందని.. తమకంటూ ప్రత్యేక ఓటర్లు ఉన్నారని వైసీపీ విశ్వసిస్తోంది. అదే సమయంలో ప్రభుత్వం పై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉద్యోగ ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేశారు. ఓటింగ్ శాతం 82 గా నమోదయింది. పెరిగిన ఓటింగ్ ప్రభుత్వ వ్యతిరేకతకు సూచికమని.. అందుకే తాము అధికారంలోకి వస్తామని టిడిపి కూటమి చెబుతోంది. గెలుపు పై ఎవరి ధీమా వారిదే. కానీ ప్రజలు ఎవరిని నమ్మారో? ఎవరిని నమ్మలేదో? మరికొద్ది గంటల్లో తెలియనుంది.