Pune Porsche Accident: తండ్రి స్థిరాస్తి వ్యాపారి. ఇబ్బడి ముబ్బడిగా డబ్బుంది. ఏం చేసినా అడిగే వారు లేరు. ఎంత అడిగినా ఎందుకు అని ప్రశ్నించేవారు లేరు. పైగా అతడిది నూనూగు మీసాల వయసు.. ఉద్రేకం, ఉద్వేగం తారస్థాయిలో ఉండే వయసు.. పైగా చుట్టూ స్నేహితులు.. ఇంకేముంది ఎలాంటి అవ లక్షణాలు ఉండకూడదో.. అవన్నీ ఒంట పట్టించుకున్నాడు. తాగుడు, ఊగుడు.. ఇంకా చాలా కళలు ఉన్నాయి అతడికి.. ఇలా ఒకరోజు స్నేహితులతో ఫుల్లుగా తాగాడు.. ఆ తాగిన మైకంలో కారు డ్రైవింగ్ చేశాడు. రాష్ డ్రైవింగ్ చేసి ఇద్దరు ప్రాణాలు పోయేందుకు కారణమయ్యాడు.. పూణే ప్రాంతంలో ఇటీవల జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసును విచారించిన జడ్జి నిందితుడికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం మరింత చర్చకు దారి తీసింది.. ఈ విషయం సామాజిక మాధ్యమాలలో విపరీతంగా ట్రోల్ కావడంతో.. వివిధ వ్యవస్థలు మేలుకోవడం.. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించడంతో.. ఆ నిందితుడు జైలుకు వెళ్లక తప్పలేదు..
Also Read: Heart Surgery: శునకం గుండెకు శస్త్రచికిత్స.. ఆసియాలో ఫస్ట్.. అరుదైన ఆపరేషన్ చేసి ఢిల్లీ డాక్టర్లు!
ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ ప్రమాదంపై అధికారులు దర్యాప్తు తీవ్రతరం చేశారు. ప్రధాన నిందితుడిని విచారిస్తున్నారు. అయితే ఆ ప్రమాదం జరిగిన రోజు రాత్రి అసలు ఏమైందో ఆ నిందితుడికి గుర్తుకు లేదట. పైగా ఆ విషయాన్ని అతడు పూర్తిగా మర్చిపోయాడట. మద్యం తాగలేదని ముందుగా బుకాయించిన ఆ మైనర్.. తర్వాత తాను మద్యం మత్తులో ఉన్నానని అని చెప్పడం విశేషం. పోలీసులను విచారణలో ఆ యువకుడు ముందుగా తన స్నేహితులతో కలిసి రెండు బార్లకు వెళ్లినట్టు తెలుస్తోంది. కేవలం 90 నిమిషాల్లోనే 48,000 ఖర్చు చేసినట్టు తేలింది. అక్కడినుంచి మరో బార్ కు వెళ్లి.. అక్కడ కూడా పీకల దాకా మద్యం తాగినట్టు తెలిసింది. మద్యం తాగిన మత్తులో ఇంటికి వెళ్తుండగా.. ఆ టీనేజర్ ఓ బైక్ ను తీవ్రంగా ఢీకొట్టాడు. దీంతో ఆ ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు ఐటీ ఉద్యోగులు మృతి చెందారు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడు తనకు బదులుగా తన తల్లి రక్త నమూనాలు ఇచ్చాడు. కేసు విచారణ పక్కదారి పట్టించేందుకు ఆ టీనేజర్ తాత రకరకాల ఎత్తులు వేశాడు. ఆ టీనేజర్ తండ్రి పేరుపొందిన స్థిరాస్తి వ్యాపారి కావడంతో.. చాలావరకు దర్యాప్తును తన డబ్బుతో ప్రభావితం చేశాడు. ఇది కూడా పోలీసుల విచారణలో బయటపడటంతో.. ఆ టీనేజర్ తాత, తండ్రి, తల్లిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ ప్రమాదానికి సంబంధించి మూడు కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర ప్రభుత్వం 100 మంది సిబ్బందిని నియమించి.. కేసును దర్యాప్తు చేయిస్తోంది.