AP Government: సచివాలయ సిబ్బంది విషయంలో ఏపీ ప్రభుత్వం ( AP government )కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో సచివాలయ వ్యవస్థ ప్రారంభించిన సంగతి తెలిసిందే. జనాభా ప్రాతిపదికన ప్రతి సచివాలయంలో 11 శాఖలకు సంబంధించి సహాయకులను అప్పట్లో నియమించారు. పౌర సేవలతో పాటు సంక్షేమ పథకాల అమలు బాధ్యతలను వారికి అప్పగించారు. అయితే కొన్ని సచివాలయాల్లో అవసరానికి మించి సిబ్బంది ఉన్నట్లు తాజాగా ప్రభుత్వానికి నివేదికలు అందాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల అవసరం మేరకు మాత్రమే వినియోగించుకోవాలని భావిస్తోంది. జనాభాను ఆధారంగా చేసుకుని వారి సేవలను పొందాలని చూస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే సిబ్బందిని క్రమబద్ధీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే కొన్ని సచివాలయాల్లో సిబ్బంది తగ్గడం ఖాయం. మరి కొన్ని చోట్ల సచివాలయం కుదింపు కూడా ఉంటుందని ప్రచారం నడుస్తోంది.
* సీఎం చంద్రబాబు సమీక్ష
తాజాగా సచివాలయాల పై సీఎం చంద్రబాబు( CM Chandrababu) సమీక్షించారు. ముఖ్యంగా సిబ్బంది హేతుబద్దీకరణ పై చర్చ జరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 11,162 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. 3842 వార్డు సచివాలయాలు కొనసాగుతున్నాయి. వాటిలో 1,27,175 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రతి సచివాలయంలో 11 మంది పనిచేసేలా అప్పట్లో డిజైన్ చేశారు. అయితే కొన్ని చోట్ల తక్కువగాను.. మరికొన్ని చోట్ల ఎక్కువగాను ఉన్నారు. అందుకే ప్రజల అవసరానికి తగ్గట్టు కుదించాలన్నది తాజాగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అయితే ఒక్కో సచివాలయానికి ఉండాల్సిన కనీస సిబ్బందిని ఖరారు చేసే పనిలో పడింది ప్రభుత్వం. సిబ్బందిని క్రమబద్ధీకరించాలని.. సచివాలయాలను కుదించాలని కూడా భావిస్తోంది. అదనపు సిబ్బందిని ఇతర శాఖలకు బదలాయించాలని చూస్తోంది.
* నిర్దిష్ట ప్రామాణికం
అయితే ఈ సిబ్బంది విభజనకు గాను ఒక ప్రామాణికం తీసుకోనుంది. బహుళ ప్రయోజనాలకు పెద్ద పేట వేయనుంది. 2500 మంది లోపు జనాభా కు ఇద్దరు మల్టీపర్పస్( multipurpose ), నలుగురు టెక్నికల్ సిబ్బంది కలిపి ఆరుగురు గరిష్టంగా ఉంచాలని నిర్ణయించింది. జనాభా ఆధారంగా వీరి పోస్టుల సంఖ్యను కూడా ఖరారు చేయనున్నారు. రాష్ట్రంలో 2500 లోపు జనాభాతో ప్రస్తుతం 3,562 సచివాలయాలు ఉన్నాయి. 2500 నుంచి 3,500 వరకు జనాభాతో 538 సచివాలయాలు ఉన్నాయి. అంతకు పై జనాభాతో 6,053 సచివాలయాలు ఉన్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. అయితే సిబ్బందిని సర్దుబాటు చేయడం కోసం అధికారుల ప్రతిపాదనకు సీఎం( chief minister) గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై ఈనెల 17న క్యాబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.
* సాంకేతిక శిక్షణ
సచివాలయ సిబ్బందిని సాంకేతిక సేవల కోసం కూడా వినియోగించుకోవడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రాన్ని డ్రోన్ హబ్ గా( drones hub ) మార్చాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే అన్ని రకాల ప్రభుత్వ సేవల్లో సైతం డ్రోన్ల ఎంట్రీ ఉంటుంది. మరోవైపు సచివాలయ సిబ్బందికి గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థతో సాంకేతిక శిక్షణ అందించాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇంకోవైపు గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో అత్యున్నత ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్యాండ్ విడ్త్ తో వైఫై ని అందించాలని సైతం సీఎం చంద్రబాబు నిర్దేశించారు. ప్రతి ఇంటికి జియో టాకింగ్ కూడా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికైతే సచివాలయ వ్యవస్థ పై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టినట్లు అర్థమవుతుంది.