Rushikonda palace :విశాఖలో రుషికొండ నిర్మాణాలను ప్రభుత్వం ఎలా వినియోగించుకోనుంది? వైసీపీ ప్రభుత్వం వందల కోట్ల రూపాయలతో భారీ నిర్మాణాలు చేపట్టిన సంగతి తెలిసిందే. అప్పట్లో పర్యావరణ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వం అక్కడ భారీ నిర్మాణాలు చేపట్టింది. న్యాయస్థానాలు తప్పు పట్టినా, పర్యావరణ ఆంక్షలు అధిగమిస్తూ అక్కడ నిర్మాణాలు కొనసాగించింది. టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అక్కడ టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బృందం సందర్శనతో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో రుషి కొండపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రుషికొండ భవనం లోపల సౌకర్యాలు, స్నానపు గదులు.. ఇలా ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అత్యాధునిక సౌకర్యాలతో, అత్యంత ఖరీదైన వస్తువులతో నిర్మించిన రుషికొండ భవనం అప్పట్లో టాక్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్ గా నిలిచింది. అయితే దీనిపై కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని చర్చ నడిచింది. అయితే ఈరోజు విశాఖలో పర్యటించిన మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రుషికొండ నిర్మాణాల విషయంలో చంద్రబాబు సీరియస్ గా ఆలోచిస్తున్నారని.. ఆ నిర్మాణాలు దేనికోసం వినియోగించుకోవాలో అధ్యయనం చేస్తున్నారని చెప్పారు. దీంతో రుషికొండ భవనాలు మరోసారి చర్చకు దారి తీశాయి.
* విపక్షంలో ఉన్నప్పుడు టిడిపి అభ్యంతరం
విపక్షంలో ఉన్నప్పుడు రుషికొండ నిర్మాణాలపై టిడిపి గట్టిగానే మాట్లాడింది. అక్కడ పర్యావరణ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణాలు చేపట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. వైసిపి ప్రభుత్వం ఈ విమర్శలను పట్టించుకోలేదు. మొండిగా ముందుకు పోయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైసీపీ నిర్ణయాలపై సమీక్ష జరుగుతోంది. అసలు ఆ నిర్మాణాలను ఎందుకు జరిపారో? వాటిని దేనికి వినియోగిస్తారో వైసీపీ ప్రభుత్వం చెప్పలేదు. విశాఖను పాలనా రాజధానిగా చేసిన నేపథ్యంలో సీఎం క్యాంప్ ఆఫీస్ అని ఒకరిద్దరు మంత్రులు అప్పట్లో చెప్పుకొచ్చారు.
* సీఎం క్యాంప్ ఆఫీస్ కోసం
వైసిపి మూడు రాజధానులను తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే.అందులో భాగంగా విశాఖను పాలన రాజధానిగా ప్రకటించింది. అయితే న్యాయపరమైన చిక్కులు రావడంతో వెనక్కి తగ్గింది. అయినా సరే మొండిగా ముందుకు పోయింది. మంత్రులతో పాటు సీఎం క్యాంపు కార్యాలయాలను విశాఖలో అందుబాటులో తేవాలని భావించింది. సరైన భవనాల కోసం అన్వేషణకు అధికారులతో కూడిన కమిటీని కూడా నియమించింది. ఈ నేపథ్యంలో రుషికొండ పై నిర్మించిన భవనాలు సీఎం క్యాంప్ ఆఫీస్ తో పాటు మరికొన్ని కార్యాలయాలకు సరిపోతాయని ఆ కమిటీ ఒక అంచనాకు వచ్చింది. ఎన్నికల్లో వైసీపీ గెలిచి ఉంటే ఈపాటికి రుషికొండ భవనాలు అందుబాటులోకి వచ్చేవి. సీఎం క్యాంప్ ఆఫీసు కోసం తప్పకుండా వినియోగించేవారు.
* పర్యాటక నిబంధనలు ఉల్లంఘన
పర్యాటక నిబంధనలను ఉల్లంఘిస్తూ రుషికొండ నిర్మాణాలు చేపట్టారు అన్నది ఒక ప్రధాన ఆరోపణ. గతంలో రుషికొండ అంటే విశాఖ నగరానికి ఒక ల్యాండ్ మార్క్. కానీ అక్కడ పచ్చదనం ఆనవాళ్లను తొలగించారు. సామాన్య పర్యాటకులను దూరం చేశారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం పర్యాటక రంగానికి ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో.. రుషికొండ భవనాలను పర్యాటక రంగం కోసం వినియోగిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరి సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.