Homeఆంధ్రప్రదేశ్‌Kadapa TDP: కడప టిడిపి అభ్యర్థిగా వివేకానంద రెడ్డి భార్య?

Kadapa TDP: కడప టిడిపి అభ్యర్థిగా వివేకానంద రెడ్డి భార్య?

Kadapa TDP: కడప జిల్లాలో పొలిటికల్ సీన్ మారుతోంది. ప్రధానంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విపరీతంగా ప్రభావం చూపనుంది. వివేక హత్యపై ఆయన కుమార్తె సునీత న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ హత్య కేసు విచారణలో ఎడతెగని జాప్యం జరుగుతోంది. సునీత ఆశించిన స్థాయిలో న్యాయం దక్కలేదు. దీంతో ఆమె ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టారు. ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఈ కేసు వెనకాల ఉన్న కథను వివరించే ప్రయత్నం చేశారు. జగన్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు ఓటు వేయవద్దని పిలుపునిచ్చారు. దీంతో ఆ కుటుంబం నుంచి ఒకరు ప్రత్యక్ష ఎన్నికల్లో కడప నుంచి పోటీ చేస్తారని ప్రచారం ఊపందుకుంది. అందుకు తగ్గట్టుగానే పరిస్థితులు నెలకొన్నాయి. వివేక భార్య సౌభాగ్యవతమ్మకు ఎంపీ సీటు ఇచ్చేందుకు రాజకీయ పార్టీలు సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు సమాచారం.

గత ఎన్నికలకు ముందు వైయస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. రాజకీయ ప్రత్యర్థులు చేసిన పనేనంటున్నాడు ప్రచారం చేయడంతో వైసీపీకి కలిసి వచ్చింది. విపరీతమైన సానుభూతి పనిచేసింది. నాటి చంద్రబాబు సర్కార్ ఇబ్బందులను ఎదుర్కొంది. సిబిఐ విచారణకు ఆదేశించింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ విచారణ అవసరం లేదని జగన్ తేల్చి చెప్పారు. అప్పుడే అనుమానాలు ప్రారంభమయ్యాయి. వివేక కుమార్తె సునీత ఎంటర్ అయ్యారు. న్యాయ పోరాటం చేయడం ప్రారంభించారు. సిబిఐ విచారణ సైతం ప్రారంభమైంది. కానీ అసలు నిందితులను అరెస్టు చేయడంలో జాప్యం జరిగింది. తెర వెనుక సూత్రధారులు ఉన్నారని అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే దాదాపు ఐదేళ్లవుతున్న ఈ కేసు కొలిక్కి తేవడంలో సిబిఐ దారుణంగా విఫలమైంది. దీని వెనుక జగన్ హస్తం ఉన్నట్లు సునీత అనుమానించారు. అందుకే జగన్తో ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని భావిస్తున్నారు.

అయితే వివేకానంద రెడ్డి కుటుంబం షర్మిల ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీలో చేరుతుందని ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు వివేక భార్య సౌభాగ్యవతమ్మను కడప ఎంపీ సీటుకు పరిగణలోకి తీసుకోవాలని కడప జిల్లా నేతలు టిడిపి హై కమాండ్ కు కోరినట్లు సమాచారం. సునీత న్యాయ పోరాటం చేయడం వెనుక చంద్రబాబు హస్తము ఉన్నట్లు ప్రచారం సాగింది. ప్రస్తుతం సునీత ప్రజాక్షేత్రంలో పోరాటం చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో.. ఆ కుటుంబం ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తుందని బలమైన ప్రచారం జరుగుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరి పోటీ చేస్తే ఓట్లు దక్కుతాయో లేదో అన్న అనుమానాలు ఉన్నాయి. అదే టిడిపిలో చేరి పోటీ చేస్తే
.. మంచి ఫలితం వస్తుందని ఒక అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కుటుంబ వ్యవహారంలో తలదూర్చకూడదని టిడిపి భావించినట్లు తెలుస్తోంది. అటు సునీత కుటుంబం నుంచి కూడా దీనిపై స్పందన రావాల్సి ఉంది. మొత్తానికైతే టిడిపి నేతలకు ఎటువంటి సమాచారం లేకుండా ఈ ప్రతిపాదన పెట్టే అవకాశం లేదు. వివేక కుటుంబం నుంచి సంకేతాలు వచ్చిన తర్వాతే టిడిపి నేతలు పావులు కదిపినట్లు సమాచారం. దీనిపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version