https://oktelugu.com/

Visakha Steel :  విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆగినట్లే!

Visakha Steel ఈ పరిణామాల క్రమంలో తాత్కాలికంగానైనా విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Written By:
  • NARESH
  • , Updated On : June 14, 2024 10:50 am
    Visakha Steel Plant

    Visakha Steel Plant

    Follow us on

    Visakha Steel : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గత కొన్నేళ్లుగా ఊపేస్తోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం మొండిగా ముందుకు పోయింది. కానీ అప్పట్లో ఉన్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కేంద్రం వ్యవహరించింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి ప్రభుత్వం అడ్డుకోలేకపోయింది. కానీ ఇప్పుడు సీన్ మారింది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం.. భాగస్వామ్య పక్షాల సాయంతోనే గట్టెక్కింది. ఆ భాగస్వామ్య పక్షాల పార్టీల్లో టిడిపి పెద్దదిగా అవతరించింది. టిడిపి కూటమిలోకి బిజెపి కూడా వచ్చింది. అందుకే ఏపీలో రాజకీయ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం పక్కన పెట్టినట్టేనని తెలుస్తోంది.

    వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయించింది. అప్పుడు తెలుగుదేశం పార్టీది నామమాత్రపు పాత్ర. జీవీఎంసీ ఎన్నికల్లో సైతం ప్రైవేటీకరణ అంశం ప్రభావితం చేసింది. అప్పట్లో గాజువాక లాంటి ప్రాంతాల్లో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. కేంద్ర ప్రభుత్వ ప్రయత్నానికి రాష్ట్ర ప్రభుత్వం అడ్డు చెప్పకపోవడంతో.. వైసిపి పై ప్రజల్లో ఒక రకమైన ఆగ్రహం వ్యక్తం అయ్యింది. కానీ ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి కూటమికి అనుకూలంగా విశాఖ ప్రజలు తీర్పు ఇవ్వడం విశేషం. దీంతో బిజెపి హై కమాండ్ మనసు మార్చుకుంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

    ప్రస్తుతం బిజెపి సొంతంగా అధికారంలోకి రాలేదు. తెలుగుదేశం పార్టీ సహకారంతో అధికారంలోకి వచ్చింది. సంకీర్ణ ప్రభుత్వం నడుస్తుండడం, జెడిఎస్ పార్టీ నేత కుమారస్వామి సంబంధిత ఉక్కు శాఖ మంత్రిగా ఉన్నారు. మన రాష్ట్రానికి చెందిన బిజెపి ఎంపి భూపతిరాజు శ్రీనివాస వర్మ సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. తప్పకుండా వారు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను అడ్డుకుంటారు. పైగా ఉత్తరాది రాష్ట్రాల్లో బిజెపికి గట్టి దెబ్బ తగిలింది. ఇప్పుడిప్పుడే దక్షిణాది రాష్ట్రాల్లో ఆ పార్టీకి పట్టు దొరుకుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసి విమర్శలను మూటగట్టుకునే స్థితిలో బిజెపి లేదు. ఈ పరిణామాల క్రమంలో తాత్కాలికంగానైనా విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.