Visakha Railway zone : విశాఖపట్నం రైల్వే జోన్( Visakhapatnam Railway zone) అంశం మరోసారి చర్చకు దారి తీసింది. ఇప్పటికే విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. దీంతో జూన్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని అంతా భావించారు. అయితే సాంకేతిక కారణాలతోపాటు ఒడిస్సా అధికారుల నుంచి వస్తున్న అభ్యంతరాలతో పనులు ఆలస్యం అవుతున్నాయి. కొత్తవలసను కూడా రాయగడ డివిజన్ లో చేర్చాలన్న డిమాండ్ తెర మీదకు రావడంతో జోన్ కార్యాలయ పనులు ఆగాయి. అయితే ఇప్పటివరకు దక్షిణ కోస్తా రైల్వే జోన్ తెచ్చామంటూ హడావిడి చేసిన కూటమి నేతలు ఇరకాటంలో పడినట్లు అయ్యింది. ఈ తరుణంలో కేంద్రం నిర్ణయం కీలకంగా మారుతోంది.
Also Read : కూటమిలో ఆదినారాయణ రెడ్డి చిచ్చు.. అన్ని అతనికే కావాలట!
* నాలుగు నెలల కిందట శంకుస్థాపన
నాలుగు నెలల కిందట ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi) దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు విశాఖలో శంకుస్థాపన చేశారు. రైల్వే జోన్ భవన నిర్మాణానికి రూ.149 కోట్లతో టెండర్లు పిలిచారు. అయితే శంకుస్థాపన జరిగి నాలుగు నెలలు అవుతున్న ఇంతవరకు గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. ప్రధానంగా తూర్పు కోస్తా జోన్ అధికారుల తీరు సమస్యగా మారింది. విశాఖ రైల్వే జోన్ కు సంబంధించి కాంట్రాక్టర్ పనులు మొదలుపెట్టారు. అయితే ఆ భూమి తనదంటూ కొందరు గిరిజనులు పనులను అడ్డుకున్నారు. కాగా గిరిజనులకు అక్కడున్న భూములపై హక్కులు లేవని అధికారులు నిర్ధారించారు. దీంతో పనులు చేసేందుకు మార్గం సుగమం అయింది.
* గెజిట్ జాడలేదు..
వాస్తవానికి రైల్వేలో ఏదైనా కొత్త జోన్ ఏర్పాటు చేసినప్పుడు దానికి సంబంధించి అధికారికంగా ఒక గెజిట్ ( official gazette) విడుదల చేస్తారు. జోన్ పరిధి, హద్దులు, ఆపరేషన్ తేదీ వంటి వివరాలపై స్పష్టత ఇస్తూ అన్ని జోన్లకు గెజిట్ ప్రకటించాకే పనులు ప్రారంభిస్తారు. అటువంటిది విశాఖలోని దక్షిణ కోస్తా జోన్ కు మాత్రం ఇంతవరకు గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. దాదాపు నాలుగు నెలలు అవుతున్న దాని గురించి ఎవరూ ప్రశ్నించడం లేదు. జోనల్ కొత్త కార్యాలయం నిర్మాణం రెండేళ్లలో పూర్తి చేసేందుకు నిర్ణయించారు. అయితే గెజిట్లో ఆపరేషన్ డేట్ ప్రకటిస్తేనే.. దాని ప్రకారం రైల్వే అధికారులు పనులు పూర్తి చేయగలరు. అయితే ఉద్దేశపూర్వకంగా రైల్వే ఉన్నతాధికారులు జాప్కం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
* ఒడిశా హవాకు చెక్
రైల్వే జోన్ విషయంలో ఇప్పటివరకు ఒడిశా( Odisha ) హవా నడిచింది. తూర్పు కోస్తా రైల్వే పరిధిలో ఉత్తరాంధ్ర ప్రాంతం ఉండేది. అయితే దానిని విభజిస్తూ దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేసింది కేంద్రం. వాల్తేరు డివిజన్ ను విడగొట్టి కొత్తగా ఒడిస్సా లోని రాయగడ కేంద్రంగా మరో డివిజన్ ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లా కొత్తవలస నుంచి అరకు వరకు రాయగడ డివిజన్లో చేర్చారు. అయితే తాజాగా కొత్తవలస స్టేషన్ కే ఇవ్వాలని తూర్పు కోస్తా జోన్ అధికారులు భువనేశ్వర్ నుంచి ఒత్తిడి తెస్తున్నారు. అయితే భవిష్యత్తులో కొత్తవలస స్టేషన్ పరిధిలో రైల్వే వ్యాగన్ డిపో ఏర్పాటు చేయాలని భావిస్తుండటమే కారణం. అందుకే కొత్తవలస స్టేషన్ను రాయగడ డివిజన్లో చేర్చాలని కోరుతున్నారు. అది పూర్తయ్యాకే గెజిట్ విడుదల చేయించాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఇది కూటమి ప్రతినిధులకు ఇబ్బందికరంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Also Read : ఏపీ లిక్కర్ స్కాం.. సాయిరెడ్డి గుట్టు.. మిధున్ రెడ్డికి ఉచ్చు!