DC Vs RR IPL 2025: సూపర్ ఓవర్ లో ఢిల్లీ జట్టు అద్భుతంగా ఆడింది. కట్టుదిట్టంగా బంతులు వేసి.. ముందుగా రాజస్థాన్ జట్టును కట్టడి చేసింది. ఆ తర్వాత రాజస్థాన్ విధించిన లక్ష్యాన్ని నాలుగు బంతుల్లోనే పూర్తి చేసి.. ఓడిపోతుందనుకున్న మ్యాచ్ లో విజయం సాధించింది. ఈ గెలుపు ద్వారా ఢిల్లీ జట్టు పాయింట్ల పట్టికలో తన మొదటి స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.. అయితే సూపర్ ఓవర్లో విజేతను నిర్ణయించారు సరే.. ఒకవేళ సూపర్ ఓవర్ కూడా టై అయితే.. అప్పుడు విజేతను ఎలా నిర్ణయిస్తారు? ఐసీసీ నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.
Also Read: ఇప్పుడే కాదు.. గతంలోనూ ఢిల్లీ “సూపర్” విన్నరే.. ఎన్నిసార్లు ఇలా గెలిచిందంటే..
మ్యాచ్ టై అయితే పది నిమిషాల్లోనే..
ఢిల్లీ, రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ టై అయింది కాబట్టి.. సూపర్ ఓవర్ నిర్వహించారు. రెండు జట్ల స్కోర్లు సమం అయితే.. సూపర్ ఓవర్ లో భాగంగా రెండు జట్ల మధ్య మ్యాచ్ ను 10 నిమిషాల్లో నిర్వహిస్తారు. సూపర్ ఓవర్ లో కూడా మ్యాచ్ టై అయితే.. ఆ తదుపరి అయిదు నిమిషాలలో రెండవ సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. ఇక రెండవ సూపర్ ఓవర్ కూడా టై అయితే.. ఒక గంట వరకు సమయం తీసుకొని సూపర్ ఓవర్లు నిర్వహిస్తారు. అయితే సూపర్ ఓవర్ ఎప్పుడు ఆడాలనేది అంపైర్లు నిర్ణయిస్తారు. ఒకవేళ సూపర్ ఓవర్ కూడా ఆడేందుకు సాధ్యం కాకపోతే మ్యాచ్ టైం అవుతుంది.. ఐసీసీ నిబంధనల ప్రకారం మొదటి సూపర్ ఓవర్ వేసిన బౌలర్ రెండవ సూపర్ ఓవర్ వేయడానికి అవకాశం ఉండదు. ఒకసారి మాత్రమే బౌలింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక బ్యాటింగ్ విషయంలో చేజింగ్ జట్టు తొలి సూపర్ ఓవర్ ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ తొలి సూపర్ ఓవర్ టై అయితే.. రెండవ సూపర్ ఓవర్ లోనూ చేజింగ్ జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక తొలి సూపర్ ఓవర్ లో గనుక బ్యాటర్ అవుట్ అయితే.. అతడికి రెండవ సూపర్ ఓవర్ లో ఆడేందుకు అవకాశం ఉండదు. సదరు ఆటగాడు రిటైర్డ్ హర్ట్ అయితేనే అతడికి సూపర్ ఓవర్ ఆడేందుకు అవకాశం ఉంటుంది. సూపర్ ఓవర్ మొదలయ్యే ముందు ఆడే ఆ ముగ్గురు బ్యాటర్ల వివరాలను అంపైర్లకు తెలియజేయాలి. వారు మాత్రమే బ్యాటింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ సూపర్ ఓవర్ లో రెండు వికెట్లు కనుక కోల్పోతే ఆల్ అవుట్ అయినట్టే. ఇక బుధవారం నాటి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చేజింగ్ చేసింది కాబట్టి ముందుగా బ్యాటింగ్ కు దిగింది. రాజస్థాన్ జట్టు 11 పరుగులు మాత్రమే చేసింది. రెండు వికెట్లను రన్ అవుట్ రూపంలో కోల్పోయింది. ఇక రాజస్థాన్ చేసిన 11 పరుగులను ఢిల్లీ జట్టు 4 బంతుల్లో సాధించింది.
Also Read: ఇదే మ్యాచ్ లో మలుపు.. ఆ బ్యాటర్ వల్లే రాజస్థాన్ ఓటమి