Aadi Narayana Reddy: రాజకీయ నేతలకు స్వార్థం ఉండొచ్చు కానీ.. అది ఎక్కువైతే మాత్రం వికటిస్తుంది. ఇప్పుడు రాయలసీమలోని ఓ బిజెపి ఎమ్మెల్యే( BJP MLA) తీరు అలానే ఉంది. ఆయన వ్యవహార శైలితో పరిశ్రమల యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్నాయి. సీఎంఓ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లినా ఆ ఎమ్మెల్యే వినడం లేదు. ఇది కూటమికి తలనొప్పిగా మారింది. దీంతో ఆయనపై బీజేపీ హై కమాండ్ కు కూడా ఫిర్యాదులు వెళుతున్నాయి. ప్రస్తుతం ఆ రాయలసీమ బిజెపి ఎమ్మెల్యే పై బలమైన చర్చ నడుస్తోంది.
Also Read: ఏపీ లిక్కర్ స్కాం.. సాయిరెడ్డి గుట్టు.. మిధున్ రెడ్డికి ఉచ్చు!
* తరచూ వివాదాలు..
ఈ ఎన్నికల్లో రాయలసీమ నుంచి బిజెపి ప్రాతినిధ్యం పెంచుకుంది. కడప జిల్లా జమ్మలమడుగు నుంచి బిజెపి అభ్యర్థిగా బరిలో దిగిన ఆదినారాయణ రెడ్డి( Aadi Narayana Reddy ) గెలిచారు. అయితే గెలిచిన నాటి నుంచి ఆదినారాయణ రెడ్డి హవా సాగిస్తున్నారు. ఈ క్రమంలో అనంతపురం జిల్లాకు చెందిన జెసి ప్రభాకర్ రెడ్డితో గొడవపడ్డారు. సొంత పార్టీ ఎమ్మెల్యే సీఎం రమేష్ తో సైతం వివాదం పెట్టుకున్నారు. అయితే ఇవన్నీ పరిశ్రమలకు సంబంధించిన అంశాలతోనే జరగడం విశేషం. ఆదినారాయణ రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా మూటగట్టుకున్నారు. ఆయన వ్యవహార శైలి ఇప్పుడు కూటమికి ఇబ్బంది తెచ్చేలా ఉంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి కార్యాలయం కలుగజేసుకున్న ఆయన వెనక్కి తగ్గకపోవడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది.
* సిమెంట్ ఫ్యాక్టరీలు అధికం.. జమ్మలమడుగు( jammalamadugu ) నియోజకవర్గంలో సిమెంట్ ఫ్యాక్టరీలు అధికంగా ఉన్నాయి. సాధారణంగా ఏ ప్రభుత్వం ఉంటే అక్కడ వాటి హవా నడుస్తుంది. అధికార పార్టీకి చెందిన నేతల మనుషులకి పనులు దక్కుతాయి. ఈ నేపథ్యంలో ఆదినారాయణ రెడ్డి సంబంధిత పరిశ్రమ యాజమాన్యాలకు గట్టి హెచ్చరికలే పంపారు. కొన్ని కంపెనీల్లో తన మనుషులను నింపేశారు. అయితే మరికొన్ని కంపెనీలు మాత్రం తమకు ఇంకా కాంట్రాక్టు ఉందని… ఆ సమయం పూర్తయ్యాక చూద్దాం అంటూ చెప్పుకొస్తున్నాయి. అయినా సరే ఆదినారాయణ రెడ్డి అనుచరులు వినడం లేదు. తరచూ గొడవలు పెట్టుకుంటున్నారు.
* నిలిచిపోయిన ఉత్పత్తి..
ప్రస్తుతం జమ్మలమడుగు లోని కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీలలో( cement factories ) ఉత్పత్తి నిలిచిపోయింది. దానికి కారణం ముడి సరుకులు అందకపోవడమే. ముడి సరుకులు తెచ్చే లారీలను ఆదినారాయణ రెడ్డి అనుచరులు అడ్డుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే సంబంధిత పరిశ్రమల యాజమాన్యాలు మీడియాతో పాటు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొచ్చాయి. ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి వ్యవహార శైలి కూటమిలో హాట్ టాపిక్ అవుతోంది. ఆదినారాయణ రెడ్డి తీరుపై ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఇలానే ముందుకు సాగితే రాయలసీమలో ఆదినారాయణ రెడ్డి తీరుతో కూటమికి నష్టం జరుగుతుందన్న టాక్ వినిపిస్తోంది.