AP BJP Chief: ఏపీ బీజేపీ అధ్యక్ష( AP BJP Chief ) పదవి కోసం పార్టీలో పోటా పోటీ వాతావరణం నెలకొంది. రాష్ట్ర బిజెపి నేతలు ఎవరికి వారుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండడం.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నడుస్తుండడంతో ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి విపరీతమైన పోటీ నెలకొంది. దీంతో హై కమాండ్ అన్ని సమీకరణలను పరిగణలోకి తీసుకొని ఒక నిర్ణయానికి రానుంది. అయితే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన నేతలు ఆశావహులుగా ఉన్నారు. ఎవరికి వారుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈసారి రాయలసీమకు అధ్యక్ష పదవి దక్కే అవకాశం ఉంది. అది కూడా ఎవరూ ఊహించని నేతకు అధ్యక్ష పదవి వరించనున్నట్లు సమాచారం.
Also Read: తిరుపతిలో హై టెన్షన్.. గోశాల వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు.. బయలుదేరిన కరుణాకర్ రెడ్డి!
* ఏడాది పాటు ఎక్స్టెన్షన్
ఏపీ బీజేపీ చీఫ్ గా పురందేశ్వరి( Purun deshwari ) ఎంపికై రెండు సంవత్సరాలు పూర్తవుతోంది. ఆమె స్థానంలో కొత్త అధ్యక్షుడు ఎంపిక అనివార్యంగా మారింది. దీంతో రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఎవరి ప్రయత్నాలు వారు ఉన్నారు. అదే సమయంలో ఒక ఏడాది పాటు పురందేశ్వరి పదవి కొనసాగింపు పైన చర్చ జరుగుతోంది. మొన్న మధ్యన అమిత్ షా ఏపీకి వచ్చారు. ఆ సమయంలో పురందేశ్వరి ప్రత్యేక విన్నపం చేసినట్లు తెలుస్తోంది. ఏడాది పాటు తన పదవిని కొనసాగించాలని ఆమె కోరినట్లు అప్పట్లో ప్రచారం నడిచింది. అయితే ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆమెకు కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమె స్థానంలో కొత్త అధ్యక్షుడు రావడం ఖాయమని తేలింది. అయితే ఎవరిని ఎంపిక చేయాలి అన్నదానిపై బిజెపి హై కమాండ్ వడబోత చేస్తున్నట్లు తెలుస్తోంది.
* తెరపైకి బీసీ నేతలు..
అయితే ఈసారి బీసీలకు కానీ.. రెడ్డి సామాజిక వర్గానికి కానీ బిజెపి అధ్యక్ష పదవి ఇవ్వాలన్నది హై కమాండ్ ఉద్దేశం. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రకు చెందిన మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్( pvn Madhav) పేరు ప్రముఖంగా వినిపించింది. మరోవైపు శ్రీకాకుళం జిల్లాకు చెందిన పూడి తిరుపతిరావు సైతం పదవిని ఆశిస్తున్నారు. సుదీర్ఘకాలం ఆయన బిజెపిలో కొనసాగుతూ వచ్చారు. మరోవైపు జివిఎల్ నరసింహం పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన సైతం సుదీర్ఘకాలం బిజెపిలో పని చేశారు. రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఆశించారు. కానీ వివిధ సమీకరణల్లో ఆయనకు ఛాన్స్ దక్కలేదు. ఇప్పుడు అధ్యక్ష పదవి పై సైతం ఆశలు పెట్టుకున్నారు.
* రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలని..
అయితే రెడ్డి సామాజిక వర్గానికి( Reddy community ) అధ్యక్ష పదవి ఇవ్వడం ద్వారా రెండు రకాల ప్రయోజనాలు ఆశిస్తోంది బిజెపి హై కమాండ్. రాయలసీమలో పార్టీ బలోపేతంతో పాటు రెడ్డి సామాజిక వర్గం అభిమానాన్ని చూరగొనాలని చూస్తోంది. అయితే ఆ స్థాయిలో చూస్తే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కనిపిస్తున్నారు. అయితే ఆయన ఇటీవలే బిజెపిలో చేరారు. కొత్తగా చేరిన కిరణ్ కుమార్ విషయంలో అభ్యంతరాలు వస్తున్నాయి. మరోవైపు విష్ణువర్ధన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బిజెపి అనుబంధ సంఘాలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ ఆయన టిడిపికి వ్యతిరేకం అన్న ముద్ర ఉంది. ప్రస్తుతం పొత్తు సజావుగా కొనసాగుతున్న వేళ విష్ణువర్ధన్ రెడ్డికి ఇస్తే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని బిజెపి పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. అయితే అనూహ్యంగా పులివెందులకు చెందిన సింగారెడ్డి రామచంద్రారెడ్డి పేరు దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ రామచంద్ర రెడ్డి కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అనకాపల్లి ఎంపీగా ఉన్న ఆయనకు హై కమాండ్ వద్ద మంచి పలుకుబడి ఉంది. పైగా జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో హై కమాండ్ సైతం ఆమోదం ముద్ర వేసినట్లు తెలుస్తోంది. సింగారెడ్డి రామచంద్రారెడ్డి పేరును కొద్ది రోజుల్లో అనౌన్స్ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
Also Read: ఏపీలో ఉపాధ్యాయుల కష్టాలకు లోకేష్ చెక్.. కొత్తగా ఆ యాప్!