Vidadala Rajini: ఏపీలో( Andhra Pradesh) కూటమి ప్రభుత్వం వైయస్సార్ కాంగ్రెస్ నేతలకు ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. వరుసగా కేసులు నమోదు చేస్తోంది. అరెస్టుల పర్వం కూడా నడుస్తోంది. ఇటీవల రాజ్ కసిరెడ్డి తో పాటు సీనియర్ ఐపీఎస్ అధికారి రామాంజనేయులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అది మరవకముందే మరో అరెస్ట్ కు తెరలేపింది కూటమి ప్రభుత్వం. మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. కంకర క్వారీ యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేశారని వచ్చిన ఫిర్యాదు పై ఈ అరెస్టు జరిగింది. విజిలెన్స్ తనిఖీల పేరుతో రెండు కోట్ల 20 లక్షలు వసూలు చేశారని ఆరోపణలు రావడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. ఈ కేసులో రజినిని ఏ 1గా, ఐపీఎస్ అధికారి జాషువాను ఏ 2గా చేర్చారు. కాగా రజని మరిది గోపి 10 లక్షలు వసూలు చేసినట్లు కూడా కేసులో పేర్కొన్నారు. అందుకే హైదరాబాద్ ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలిలో ఏపీ పోలీసులు గోపిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హైదరాబాదు నుంచి విజయవాడకు తరలించారు.
Also Read: బెంగళూరులో వ్యూహకర్తలతో జగన్!
* బెదిరింపు తో వసూళ్లు
2019లో చిలకలూరిపేట( chilakaluripeta ) నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు రజిని. మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పై గెలిచారు. అయితే ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి దూకుడుగా ఉండేవారు. విస్తరణలో జగన్మోహన్ రెడ్డి రజనీకి ఛాన్స్ ఇచ్చారు. కీలకమైన పోర్టు పోలియోను కేటాయించారు. అయితే ఎడ్లపాడులో కంకర క్వారీ యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేశారని కేసులో మాజీ మంత్రి రజినిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ప్రస్తుతం అదే కేసులో గోపి కూడా అరెస్టయ్యారు. 2020లో పలనాడు జిల్లా ఎడ్లపాడు లోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించి రెండు కోట్ల 20 లక్షలు వసూలు చేశారని ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ ఏడాది మార్చిలో ఏసీబీ కేసులు నమోదు చేసింది.
* ఆ నలుగురే కీలకం
ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా మాజీ మంత్రి రజిని( Rajini ) ఉన్నారు. ఆమెను ఏ1 గా చేర్చారు. ఆమెతోపాటు ఐపీఎస్ అధికారి జాషువాను ఏ 2 గా చేర్చారు. రజిని మరిది గోపిని ఏ 3గా, పిఏ దొడ్డ రామకృష్ణను ఏ 4 గా చూపారు. రజిని వాటాగా రెండు కోట్లు తీసుకున్నారని కేసులో నమోదు చేశారు. ఐపీఎస్ అధికారి జాషువాతో పాటు రజిని మరిది గోపికి పది లక్షలు చొప్పున అందించినట్లు పేర్కొన్నారు. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కేసులు నమోదైన తరుణంలో మాజీ మంత్రి రజిని హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసు నమోదు చేసిందని.. దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని వాదనలు వినిపించారు.
* కోర్టులో తీర్పు రిజర్వు..
అయితే ఈ కేసులో మంత్రి రజినితోపాటు నిందితుల పాత్ర ఉందని ప్రభుత్వం తరుపు న్యాయవాదులు గట్టిగానే వాదనలు వినిపించారు. విజిలెన్స్( vigilance) పేరుతో బెదిరించి వసూలు చేశారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అప్పట్లో మంత్రి రజిని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కూడా ఆరోపించారు. అయితే ఇరువైపుల వాదనలు విన్న తీర్పును రిజర్వ్ చేసింది. అయితే ఇంతలోనే మాజీ మంత్రి రజిని మరిది గోపి అరెస్టు కావడం కలకలం రేపుతోంది. విడదల రజిని చుట్టూ ఉచ్చు బిగుస్తోందని అర్థమైంది. ఈ కేసులో మరిన్ని అరెస్టులు ఉంటాయని కూడా ప్రచారం జరుగుతోంది.
Also Read: వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ సస్పెన్షన్ కు కారణం అదేనా!