Homeఆంధ్రప్రదేశ్‌Duvvada Srinivas: వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ సస్పెన్షన్ కు కారణం అదేనా!

Duvvada Srinivas: వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ సస్పెన్షన్ కు కారణం అదేనా!

Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను ( MLC duvvada Srinivas ) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు వేటు వేసినట్టు? ఆయన క్రమశిక్షణ కట్టు దాటారా? పార్టీకి అపవాదు తెచ్చారా? కుటుంబ వివాదాలతో పార్టీని ఇబ్బంది పెట్టారా? ఈ కారణాలతోనే ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. అయితే ఆయన కుటుంబ వివాదం జరిగి నెలలు గడుస్తోంది. మరోవైపు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. శాసనమండలి సమావేశాలకు హాజరయ్యారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం ఎత్తారు. కానీ ఉన్నపలంగా ఆయనపై సస్పెన్షన్ వేటు వేయడం ఏమిటనేది ఇప్పుడు చర్చగా మారింది. తెర వెనుక ఏదో జరిగిందన్న టాక్ నడుస్తోంది. దీనికి కారణం మంత్రి లోకేష్ అని తెలుస్తోంది. లోకేష్ విషయంలో ఇటీవల దువ్వాడ శ్రీనివాస్ వ్యవహరించిన తీరుతోనే అధినేత జగన్మోహన్ రెడ్డికి కోపం వచ్చినట్లు సమాచారం.

Also Read: మళ్లీ రిమాండ్.. వల్లభనేని వంశీ విడుదల ఎప్పుడు?

* వివాదం జరిగిన చాలా రోజులకు..
దువ్వాడ శ్రీనివాస్ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా భార్య వాణి తో ఆయన వివాదం పెట్టుకున్నారు. ఎన్నికలకు ముందు కూడా ఈ వివాదం నడిచింది. దీంతో తనకే టెక్కలి అసెంబ్లీ( Tekkali assembly) నియోజకవర్గ టికెట్ ఇవ్వాలని శ్రీనివాస్ భార్య వాణి డిమాండ్ చేశారు. కానీ వైసీపీ పెద్దలు సముదాయించడంతో మెత్తబడ్డారు. ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన రచ్చ అందరికీ తెలిసిందే. ఆయన తన ప్రేయసి దివ్వెల మాధురితో కలిసి ఉంటున్నారు. సహజీవనం చేస్తున్నారు. త్వరలో చట్టబద్ధంగా ఇద్దరం కలుసుకుంటామని చెబుతున్నారు. వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టారు. అయితే నెలలు జరిగిన వైయస్సార్ కాంగ్రెస్ హై కమాండ్ పెద్దగా పట్టించుకోలేదు. అదంతా దువ్వాడ శ్రీనివాస్ వ్యక్తిగత వ్యవహారంగా వైసీపీ అగ్రనేతలు కొట్టి పారేశారు. అయితే ఇప్పుడు అదే దువ్వాడ శ్రీనివాస్ పార్టీ క్రమశిక్షణ కట్టు దాటారంటూ ఆరోపిస్తూ సస్పెన్షన్ వేటు వేయడం విశేషం.

* అధినేతకు వీర విధేయుడు..
వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డికి( Jagan Mohan Reddy) దువ్వాడ శ్రీనివాస్ వీర విధేయుడు. జగన్ సైతం దువ్వాడ పై అభిమానాన్ని ఎప్పుడూ దాచుకోలేదు. ఈ కారణంగానే దువ్వాడపై స్వయానా ఆయన భార్య ఫిర్యాదు చేసినా అది వారి కుటుంబ వ్యవహారంగా వదిలేశారు. ఆ కారణంగానే దువ్వాడ శ్రీనివాస్ మాధురి తో కలిసి స్వేచ్ఛగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం, తమ బంధాన్ని గొప్పగా ప్రచారం చేసుకోవడం జరిగింది. అయితే ఈ ఎఫెక్ట్ పార్టీ పై పడినా దువ్వాడ శ్రీనివాస్ పై ఉన్న అభిమానంతో జగన్మోహన్ రెడ్డి చూసి చూడనట్టుగా వ్యవహరించారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా దువ్వాడ శ్రీనివాస్ పై చర్యలకు ఉపక్రమించడం మాత్రం చర్చకు దారితీస్తోంది. అయితే దువ్వాడ సస్పెన్షన్ వెనుక ఓ పెద్ద రీజన్ ఉందని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. మంత్రి నారా లోకేష్ ను పొగడడం వల్లే దువ్వాడ శ్రీనివాస్ పై వేటు వేసినట్లు తెలుస్తోంది.

* ఇంటర్వ్యూలో ప్రశంసలు
తన ప్రేయసి మాధురితో కలిసి డిజిటల్ మీడియాకు( digital media) ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇస్తుంటారు దువ్వాడ శ్రీనివాస్. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో టిడిపి యువనేత లోకేష్ ను ప్రశంసించారు. జగన్మోహన్ రెడ్డి ఆగ్రహానికి అసలు కారణం ఇదేనని తెలుస్తోంది. ఆ ఇంటర్వ్యూలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు లోకేష్ సమర్ధుడైన నాయకుడు అంటూ దువ్వాడ జంట కీర్తించింది. ఇది ఉత్తరాంధ్రకు చెందిన ఓ సీనియర్ నేతకు నచ్చలేదు. ఆయన నేరుగా జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుతోనే చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి చంద్రబాబు, పవన్, లోకేష్ లపై విమర్శలు చేయడంలో ముందు వరుసలో ఉండేవారు దువ్వాడ శ్రీనివాస్. అటువంటి వ్యక్తి యూటర్న్ తీసుకోవడంతోనే వైసీపీకి ఆగ్రహం తెప్పించిందని తెలుస్తోంది. మరి ఏం జరిగిందో దువ్వాడకి ఎరుక.

 

Also Read: బెంగళూరులో వ్యూహకర్తలతో జగన్!

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular