Venkatarami Reddy: ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి గుర్తున్నారు కదూ. వైసిపి హయాంలో ఒక వెలుగు వెలిగారు ఈయన.సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ కుప్రతినిధిగా వ్యవహరించిన ఈయన..వైసిపి నేతకు మించి ప్రకటనలు చేసేవారు. అప్పటి సీఎం జగన్ పై ఈగ వాలనిచ్చేవారు కాదు. వైసిపి ప్రభుత్వం ఉద్యోగ వ్యతిరేక విధానాలను అవలంభించినా సమర్ధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన కేవలం ఉద్యోగుల కంటే వైసీపీ ప్రయోజనాల కోసమే పని చేశారన్న విమర్శ కూడా ఉంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపై ప్రత్యేకంగా ఫోకస్ పెంచింది. ఎక్కడ తప్పు చేస్తారా? అని ఎదురుచూసింది. సరిగ్గా ఓ మందు పార్టీలో సచివాలయ ఉద్యోగులను ప్రలోభ పెట్టారని సమాచారం రావడంతో పోలీసులు అరెస్టు చేయడం సంచలనంగా మారింది.పదుల సంఖ్యలో మద్యం సీసాలను స్వాధీనం చేసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. ఉద్యోగ సంఘాల నేత మద్యం బాటిళ్లతో దొరకడం ఏంటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
* ప్రభుత్వానికి కొమ్ము
వైసిపి హయాంలో చాలామంది ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారు. ఉద్యోగ సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తూనే ప్రభుత్వానికి కొమ్ముకాసేవారు. చివరకుఉద్యోగుల హక్కులు, విధులకు భంగం వాటిల్లినా స్పందించేవారు కాదు. అందులో వెంకట్రామిరెడ్డి ఒకరు. సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ కు ఆయన ప్రాతినిధ్యం వహించేవారు. ఈ ఎన్నికల్లోవైసిపికి అనుకూలంగా పనిచేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.ఈ తరుణంలోనే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపై ఫోకస్ పెంచినట్లు సమాచారం. సచివాలయ ఉద్యోగుల క్యాంటీన్ డైరెక్టర్ పదవుల కోసం త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. తమ వారిని గెలిపించుకునేందుకు వెంకట్రామిరెడ్డి ప్రలోభ పెట్టినట్లు ఫిర్యాదులు వచ్చాయి. అందులో భాగంగా అనుమతి లేకుండా మందు పార్టీ ఇవ్వడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.
* కేసు నమోదు
గుంటూరు జిల్లా తాడేపల్లి లోని కొండపావులూరి గార్డెన్లో వెంకట్రామిరెడ్డి సచివాలయ ఉద్యోగులకు మందు, విందు పార్టీని ఏర్పాటు చేశారు. పక్కా సమాచారం అందడంతో ఎక్సైజ్ అధికారులతో కలిసి పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అనుమతులు లేకుండా మందు పార్టీని నిర్వహించడంతో ఆయనను అరెస్టు చేశారు. ఆయన వద్ద నుంచి పెద్ద ఎత్తున మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మందు పార్టీకి ముందస్తు అనుమతులు తీసుకోకపోవడం, ఎక్సైజ్ నిబంధనలను ఉల్లంఘించడం వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.