SBI: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వంగా బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్ల డేటా లీక్ వ్యవహారం కలకలం రేపుతోంది.. తమ కస్టమర్లకు సంబంధించిన కొంత సమాచారం డార్క్ వెబ్లో బహిర్గతమైనట్టు బ్యాంక్ స్టాక్ ఎక్స్చేంజి లకు వెల్లడించింది. ప్రాథమిక పరిశీలనలో భాగంగా సుమారు 3.75 లక్షల రికార్డులను సమీక్షించగా.. అందులో 3,897 రికార్డులలో వ్యక్తిగత గుర్తింపు సమాచారాన్ని గుర్తించినట్టు ప్రకటించింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టినట్టు బ్యాంకు వెల్లడించింది.
ఏ వివరాలు లీక్ అయ్యాయి?
డార్క్ వెబ్లో బహిర్గతమైనట్టు గుర్తించిన సమాచారంలో కస్టమర్ల పేర్లు.. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్లు.. పుట్టిన తేదీలు.. లింగం.. ఈమెయిల్ చిరునామాలు.. నివాస చిరునామాలు ఉన్నట్టు బ్యాంకు వెల్లడించింది. వీటితోపాటు బ్యాంకు బ్రాంచ్ వివరాలు.. కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఫైల్స్ (CIF) ఐడెంటి ఫైర్లు, లీడ్ ఐడి లు, రుణాలు లేదా రుణ దరఖాస్తులకు సంబంధించిన మెటా డేటా కూడా ఉన్నట్టు తెలుస్తోంది.. అయితే బహిర్గతమైన సమాచారానికి సంబంధించిన పూర్తి వివరాలు.. దాని ప్రామాణికత.. మొత్తం ఎంతమంది కస్టమర్లపై ప్రభావం పడిందని అంశాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.
అక్టోబర్ 16న వెలుగులోకి
అక్టోబర్ 16న తమ థ్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ప్రొవైడర్, డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT -In) నుంచి సమాచారం బహిర్గతానికి సంబంధించిన హెచ్చరికలు అందినట్టు ఎస్బిఐ వెల్లడించింది. అనంతరం ప్రాథమిక పరిశీలన చేపట్టి.. డార్క్ వెబ్లో అందుబాటులో ఉన్న రికార్డులను సమీక్షించింది. ఈ సంఘటనకు సంబంధించిన సమాచారం ఎక్కడ నుంచి బయటికి వెళ్లింది? ఏ మార్గంలో బహిర్గతమైంది? కస్టమర్లకు ఇంతవరకు ప్రమాదం పొంచి ఉంది? అనే అంశాలను నిర్ధారించాల్సిన అవసరం ఉంది.
దర్యాప్తు మొదలు
డేటా లీక్ సమాచారం అందిన వెంటనే సైబర్ ఘటనలపై స్పందించే చర్యలను మొదలుపెట్టినట్టు బ్యాంకు వెల్లడించింది. ఘటన స్వరూపం.. ప్రభావం.. సమాచారం బహిర్గతమైన పరిధిని పరిశీలించేందుకు సిఈఆర్టీ ఇన్ గుర్తింపు పొందిన ఇండిపెండెంట్ సైబర్ సెక్యూరిటీ సంస్థను నియమించింది. దర్యాప్తు కొనసాగుతోంద.. అవసరమైన దిద్దుబాటు చర్యలు.. ముందస్తు నివారణ చర్యలు చేపడుతున్నామని బ్యాంక్ ప్రకటించింది. ఈ ఘటన వల్ల తమ ప్రధాన బ్యాంకింగ్ కార్యకలాపాలు.. ఆర్థిక పని తీరు.. వ్యాపార కొనసాగింపు పై గణనీయమైన ప్రభావం పడలేదని స్పష్టం చేసింది.
కస్టమర్లు అప్రమత్తంగా ఉండాల్సిందే..
వ్యక్తిగత వివరాలు బయటకు రావడం వల్ల సైబర్ నేరగాళ్లు బ్యాంకు అధికారులమంటూ ఫోన్ చేసి మోసాలకు పాల్పడే ప్రమాదం ఉంది. కస్టమర్ల వ్యక్తిగత సమాచారం తెలిసిన వ్యక్తులు నమ్మకం కలిగించే విధంగా మాట్లాడి.. రహస్య వివరాలను సేకరించేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. అందువల్ల ఎస్బిఐ కస్టమర్లు అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్.. సందేశాలు.. అనుమాన్ హస్పద లింకుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు ఉద్యోగులమని చెప్పినప్పటికీ ఓటిపి, ఏటీఎం పిన్.. పాస్ వర్డ్ లు.. లేదా ఇతర రహస్య బ్యాంకింగ్ వివరాలను ఎవరికీ చెప్పకూడదు. అనుమానాస్పద లావాదేవీలు లేదా మోసపూరిత కాల్సేదైతే వెంటనే బ్యాంకు అధికారిక వర్గాల ద్వారా ఫిర్యాదు చేయాలి. సైబర్ లేదా ఆర్థిక మోసం జరిగితే భారత జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కి సమాచారం అందించాలి.