Vegetable Prices: ఏపీలో కూర‘గాయాల’ మంట.. ఆంధ్రజ్యోతినే నిలదీసిందిగా.. బాబు సర్కార్ ఏం చేస్తుందో?

కొనబోతే కొరివి.. అమ్మ బోతే అడవి అన్నట్టు ఉంది ఏపీలో కూరగాయల ధరల పరిస్థితి. రైతు తనకు గిట్టుబాటు ధర దక్కడం లేదని చెబుతున్నాడు. కానీ వ్యాపారులు మాత్రం రైతు వద్ద కొనుగోలు చేసిన ధర కంటే.. రెట్టింపు ధరతో అమ్ముతున్నారు. ఫలితంగా అటు రైతు, ఇటు అదే సరుకు కొనుగోలు చేసే వినియోగదారుడు నష్టపోతున్నాడు.

Written By: Dharma, Updated On : October 9, 2024 1:32 pm

Vegetable Prices

Follow us on

Vegetable Prices: ఏపీలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. వర్షాకాలంలో ధరల పెరుగుదల సహజమే అయినా.. గత ఐదు నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కానీ ప్రభుత్వం ఎటువంటి నియంత్రణ చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. అయితే రైతు పండించిన పంటకు గిట్టుబాటు లేదు. అదే పంట వినియోగదారుడు కొనుగోలు చేస్తే ధర ఎక్కువగా ఉంది. అంటే మధ్యలో దళారుల ప్రమేయం అధికం అయింది అన్నమాట. మార్కెట్ మాయతో ధరల మంట మండుతోందన్నమాట. గత నాలుగైదు నెలలుగా కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టడం లేదు. రైతు బజార్లతో పోల్చితే బహిరంగ మార్కెట్లో రెట్టింపు ధర ఉంటోంది. పండించిన రైతుకు పది రూపాయలు దక్కుతుండగా.. బహిరంగ మార్కెట్లో వినియోగదారుడికి 30 రూపాయలకు విక్రయిస్తున్నారు. అంటే రైతు కంటే దళారుల రూపంలో ప్రవేశిస్తున్న వ్యాపారులకు 20 రూపాయల లాభం దక్కుతుందన్నమాట. ప్రస్తుతం టమాటా ధర 100 రూపాయలకు ఎగబాకింది. ఉల్లి ధర 50 రూపాయల పై మాటే. ఇతరత్రా కూరగాయల ధరలు సైతం అదే స్థాయిలో ఉన్నాయి. మండువేసవితో పాటు వరదల సమయంలో కూరగాయల ధరలు పెరగడం సహజం. పంటలు దెబ్బ తినడమే ఇందుకు కారణం. ఆ తరువాత మళ్లీ ధరలు దిగివస్తాయి. కానీ రాష్ట్రంలో నాలుగైదు నెలలుగా కూరగాయల ధరలు ఆకాశంలోనే ఉన్నాయి. కిందికి దిగి రావడం లేదు. ప్రభుత్వానికి అత్యంత దగ్గరైనా, టిడిపి అనుకూల మీడియాగా ముద్రపడిన ఆంధ్రజ్యోతిలోనే కూరగాయల ధరలపై ఒక ప్రత్యేక కథనం వచ్చింది. అంటే ఏ స్థాయిలో ధరలు విసుగు పుట్టిస్తున్నాయో అర్థం అవుతోంది.

Vegetable Prices

* ఎన్నికల ముందు హామీ
తాము అధికారంలోకి వస్తే నిత్యవసరాలతో పాటు కూరగాయల ధరల పెరుగుదలను నియంత్రిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ గత నాలుగు నెలలుగా ఇదే పరిస్థితి ఉంది. ఉల్లి, టమాట, బంగాళదుంపలు సర్వసాధారణంగా ప్రతి ఇంట ఉపయోగించడం అధికం. వంటల్లో వీటిదే కీలకపాత్ర. కానీ వీటి ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. పోనీ రైతుల వద్ద ఉన్న పంటకు గిట్టుబాటు లభిస్తుందా? అంటే అది ఉండడం లేదు. రైతులు వద్ద కొనుగోలు చేసిన ధర కంటే రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారు. వ్యాపారులు, దళారులు సొమ్ము చేసుకుంటున్నారు.

* ధరలో ఎంతో తేడా
మదనపల్లె మార్కెట్ టమాటా వ్యాపారానికి పెట్టింది పేరు. అక్కడ 10 కిలోల టమాట 200 రూపాయల నుంచి 450 లకు మించి వ్యాపారులు కొనుగోలు చేయడం లేదు. అంటే కిలో 25 రూపాయల నుంచి 40 రూపాయల వరకు దొరుకుతుందన్నమాట. బహిరంగ మార్కెట్లో కిలో టమాట ధర 100 రూపాయల వరకు ఎగబాకింది. అంటే దళారులు వ్యాపారులు దోచుకున్నారని అర్థమవుతోంది. ఇంత జరుగుతున్నా పర్యవేక్షణ లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. కేవలం ఉల్లి, టమాటా వంటి ధరలు పెరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తోంది. మార్కెటింగ్ శాఖ ద్వారా రాయితీపై వాటిని పంపిణీ చేస్తోంది. కానీ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా? రైతుల వద్ద కొనుగోలు చేస్తున్నది ఎంత? బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నది ఎంత? అనేది మాత్రంపర్యవేక్షణ లేకుండా పోతోంది.దాని ప్రభావం ధరల పెరుగుదలపై పడుతోంది.అయితే కనీసం అనుకూల మీడియాగా పరిగణించబడుతున్న ఆంధ్రజ్యోతిలోవచ్చిన కథనంతో నైనా ప్రభుత్వం మేల్కొంటుందో?లేదో?చూడాలి.