Chandrababu Delhi Tour: ముందు మర్యాదలు.. తర్వాత చర్చలు.. ఆపై నిర్ణయాలు.. ఇదీ బాబు స్టైల్! అప్పటికి ఇప్పటికీ చాలా తేడా..

అడగనిదే అమ్మైనా పెట్టదనే సామెత ఉంటుంది. అంటే మనకు ఏం కావాలో మనకు జన్మనిచ్చిన తల్లికి కూడా చెప్పాలి. అప్పుడే ఆమె అర్థం చేసుకొని పెడుతుంది. ఇదే సూత్రం రాజకీయాలకు కూడా వర్తిస్తుంది. పైగా మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి.. కింది స్థాయిలో ఉన్న రాష్ట్రాలు.. పై స్థాయిలో ఉన్న కేంద్రాన్ని ఎప్పటికప్పుడు అడగాలి. స్థూలంగా చెప్పాలంటే చెవిలో జోరీగ లాగా పోరు పెడుతుండాలి. కావలసినవన్నీ సాధించుకుంటూ ఉండాలి.

Written By: Anabothula Bhaskar, Updated On : October 9, 2024 1:40 pm

Chandrababu Delhi Tour

Follow us on

Chandrababu Delhi Tour: మనదేశంలో ఉన్న ముఖ్యమంత్రులలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కొందరు తమ రాష్ట్రాలకు కావలసిన వాటిని కేంద్రం వద్ద పోరు పెట్టి మరి తెచ్చుకుంటారు. మరికొందరేమో కేంద్రం వద్ద చేతులు కట్టుకొని ఎందుకు ఉండాలని.. తమలో తామే సర్దుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ మొదట్లో కేంద్రంతో సన్నిహితంగా ఉండేవారు. ఆ తర్వాత ఎక్కడ తేడా కొట్టిందో తెలియదు గాని.. కేంద్రంతో యుద్ధం ప్రకటించారు. కేంద్రం నిర్వహించే సమావేశాలకు డుమ్మా కొట్టారు. చివరికి ప్రధాని వచ్చిన కలవకుండా ముఖం చాటేశారు.. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి దాకా ముఖ్యమంత్రిగా కొనసాగిన జగన్ కేసీఆర్ వ్యవహరించకపోయినప్పటికీ.. రాష్ట్రానికి కావలసినవి సాధించుకోవడంలో పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదని విమర్శలు ఉన్నాయి. ప్రధానమంత్రిని, హోం మంత్రిని, ఆర్థిక శాఖ మంత్రిని, ఇతర మంత్రులతో మర్యాదగా భేటీ కావడం.. వారికి వినతి పత్రాలు సమర్పించడం.. జ్ఞాపికలు అందించడంతోనే సరిపుచ్చేవారు. ఆ తర్వాత ఫాలో అప్ అనేది ఉండేది కాదు. ఫలితంగా ఏపీకి పెద్దగా కేంద్రం నుంచి సాయం అందేది కాదనే విమర్శలు ఉన్నాయి. అటు జగన్, ఇటు కేసీఆర్ కంటే చంద్రబాబుది డిఫరెంట్ స్టైల్. పైగా ఆయన ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. కేంద్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతానికంటే భిన్నంగా ఇప్పుడు ఆయనకు కేంద్రంలో పలుకుబడి పెరిగింది. ఒకరకంగా చెప్పాలంటే నాటి వాజ్ పాయ్ ప్రభుత్వంలో చంద్రబాబు ఎలాంటి పాత్ర పోషించారో.. ప్రస్తుత నరేంద్ర మోడీ ప్రభుత్వంలోనూ అలాంటి భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు.

స్టైల్ వేరు

సాధారణంగా చంద్రబాబు గ్రీవెన్స్ డిఫరెంట్ గా ఉంటుంది. గంటల కొద్దీ సమీక్షలు ఉంటాయి. నిర్ణయాలు ఆలస్యంగా తీసుకున్నప్పటికీ.. అవి చాలా పకడ్బందీగా ఉంటాయి. అందువల్లే చంద్రబాబుతో పని చేసిన చాలామంది అధికారులు తమ అనుభవాలను వివిధ వేదికల వద్ద పంచుకున్నారు.. చంద్రబాబుతో పనిచేయడం ఒక ముఖ్యమంత్రితో చేసినట్టు ఉండదని.. ఒక కార్పొరేట్ కంపెనీ సీఈవోతో పనిచేసినట్టు ఉంటుందని పేర్కొన్నారు. నిజానికి చంద్రబాబు వర్కింగ్ స్టైల్ కూడా అలానే ఉంటుంది. కార్పొరేట్ సెక్టార్లో మర్యాదకు ప్రయారిటీ ఇస్తారు. ఆ తర్వాత చర్చలు మొదలు పెడతారు. చివరికి తమకు కావాల్సింది సమకూర్చుకుంటారు. సేమ్ అలాగే చంద్రబాబు విధానం కూడా ఉంటుంది. ప్రస్తుతం ఆయన ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ముందుగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. ఏపీకి సంబంధించిన పలు సమస్యలను ఆయన ఎదుట ప్రస్తావించారు. ఇదే సమయంలో తిరుమల లడ్డును అందించారు.. ఈ లడ్డు కల్తీ నెయ్యితో తయారుచేసింది కాదని.. స్వచ్ఛమైన నెయ్యితో రూపొందించిందని చమత్కరించారు. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు.. రావలసిన నిధుల గురించి చర్చించారు. అనంతరం కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, హార్దిప్ పూరి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో వరుసగా భేటీ అయ్యారు. ముందుగా వారికి ఏపీ ప్రభుత్వం తరఫున జ్ఞాపికలు అందించారు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలను ఇచ్చారు. ఆ తర్వాత పలు విషయాలపై చర్చించారు. అనంతరం వివిధ అధికారులతో ఫోన్లో మాట్లాడి.. ఏపీకి కావలసిన వాటిని మరొకసారి చర్చించారు. అయితే ఇది ఇక్కడితోనే ఆగిపోదు. ఆ తర్వాత నిరంతరం ఫాలో అప్ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. అందువల్లే గత కొద్దిరోజులుగా ఏపీకి కేంద్రం నుంచి నిధుల వరద కొనసాగుతోంది. ప్రస్తుతం కేంద్రంలో కీలకపాత్ర పోషిస్తున్నప్పటికీ.. బీహార్ రాష్ట్రంతో పోల్చితే ఏపీ రాష్ట్రానికి వస్తున్న నిధులు చాలా ఎక్కువ. ఇటీవల బడ్జెట్లో కేంద్రం అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు మంజూరు చేసింది.. ఇక భవిష్యత్తులోనూ మరిన్ని నిధులు అందించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్, బిపిసిఎల్ రిఫైనరీ, విజయవాడ తూర్పు బైపాస్ అభివృద్ధి.. ఇంకా అనేక వరాలు ఆంధ్రకు త్వరలో లభించనున్నాయి. ఇవన్నీ కూడా కేంద్రం అనుమతితో ఏపీకి రానున్నాయి.

స్థూలంగా చెప్పాలంటే రాజకీయాలు ఒక పట్లగా లేవు. రాజకీయాలు ఎలా మారుతాయో తెలియదు. ఎన్నికైన ప్రజల నమ్మకాన్ని చురగొనాలంటే.. పథకాలు ఒకటి మాత్రమే పరిష్కారం కాదు. శాశ్వత అభివృద్ధి.. మౌలిక వసతుల కల్పన.. ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం.. ప్రజల సమస్యలు పరిష్కరించడం.. ఇవన్నీ ఒక రోజులో పూర్తికావు. కానీ దశలవారీగా చేపడితేనే వీటన్నింటికీ మోక్షం లభిస్తుంది. అలా జరగాలంటే పాలకుడు ప్రజల క్షేమం కోణంలో పని చేయాలి. అన్నింటికీ మించి కేంద్రంతో సయోధ్య కుదుర్చుకోవాలి. ఉభయకుశలోపరి అనే ముద్రను తుదికంటా పాటించాలి.