Uttarandhra: తుఫాను అంటేనే ఉత్తరాంధ్ర చిగురుటాకులా వణికి పోతోంది. గడిచిన 24 గంటల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈరోజు, రేపు భారీ వర్ష సూచన ఉండడంతో ఉత్తరాంధ్ర ప్రజలు ఆందోళనతో ఉన్నారు. ఆదివారం ఉదయం నుంచి వర్షపు జల్లులు ప్రారంభమయ్యాయి. అక్కడక్కడ భారీ వర్షాలు నమోదవుతున్నాయి. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో 10.35 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.శనివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో విజయనగరం,శ్రీకాకుళం జిల్లాలో గడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. విజయనగరం జిల్లా రేగిడి ఆముదాలవలస లో ప్రభుత్వ కార్యాలయాలు, ఇళ్లు ముంపు బారిన పడ్డాయి. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో ఒక గెడ్డలో సరుకుల వ్యాను కొట్టుకుపోయింది. కాపాడేందుకు ప్రయత్నించినా వీలు లేకుండా పోయింది. డ్రైవర్లు సురక్షితంగా బయటపడగా.. వ్యాన్ ఆచూకీ గల్లంతయ్యింది.
* పెరుగుతున్న నీటి ప్రవాహం
శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి నదుల్లో నీటి ప్రవాహం క్రమేపి పెరుగుతోంది.భారీగా వరద నీరు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. ముందస్తు చర్యలు చేపడుతున్నారు. నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.గొట్టా బ్యారేజీ వద్దగేట్లను ఎత్తివేసి నీటిని వంశధార నదిలో విడిచి పెడుతున్నారు.మరోవైపు ఉత్తరాంధ్రలో అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. తెలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.
* విశాఖలో భయం భయం
మరోవైపు విజయవాడ సీన్ రిపీట్ అవుతోంది విశాఖపట్నంలో. కొండ చరియలు విరిగి పడుతుండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళనతో ఉన్నారు. విశాఖలోని గోపాలపట్నంలో భారీ కొండ చరియ విరిగిపడింది. రామకృష్ణ నగర్ వద్ద దశాబ్దాల కిందట నిర్మించిన రక్షణ గోడ కొండ చరియాలతో పాటు కుప్పకూలింది. రెండు ఇల్లు ప్రమాదకరంగా మారాయి. జీవీఎంసీ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన అక్కడ ఉన్నఇళ్లను ఖాళీ చేయించింది. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
* గత అనుభవాల దృష్ట్యా
గత అనుభవాల దృష్ట్యా తుఫాన్లు అంటేనే ఉత్తరాంధ్ర ప్రజలు వణికి పోతున్నారు. కళ్ళముందే హుద్ హుద్, తితలి, లెనిన్ తుఫాన్లు సృష్టించిన విళయాన్ని గుర్తు చేసుకుంటున్నారు.మరోసారి అటువంటి విధ్వంసం జరగకుండా చూడాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు.మరోవైపు విజయవాడ వరదల నేపథ్యంలో వర్షం అంటేనే సామాన్య జనం భయపడే పరిస్థితి. ఈరోజు, రేపు గడిస్తే ప్రమాదం తప్పుతుందని ఆశిస్తున్నారు.