Union Budget 2024: కేంద్ర బడ్జెట్ లో ఈసారి ఏపీకి ప్రాధాన్యం దక్కింది. అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం 15 వేల కోట్లు ప్రత్యేక సాయం ప్రకటించింది. ఇంకా అవసరమైతే అదనపు నిధులు కేటాయించేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దీంతో టీడీపీ కూటమి నేతలు సంబరాల్లో మునిగిపోయారు. సామాన్య ప్రజలు సైతం అమరావతి రాజధాని నిర్మాణం ఊపందుకుంటుందని ఆశించారు. అయితే అదే సమయంలో అమరావతి నిర్మాణానికి కేంద్రం అందిస్తామన్న 15 వేల కోట్లు గ్రాంటా? రుణమా? అన్న చర్చ మొదలైంది. ఆర్థిక మంత్రి ప్రకటన తర్వాత సోషల్ మీడియా వేదికగా చర్చ ప్రారంభమైంది. కేంద్రం అందిస్తున్న సాయం గ్రాంట్ అని టిడిపి నేతలు చెబుతుండగా.. కాదు కాదు అది అప్పు రూపంలో ఇస్తున్నట్లు.. దానికి ఎందుకు ఆర్భాటం అంటూ వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాయి. దీంతో దీనిపై ఒక రకమైన గందరగోళం నెలకొంది.
* ఎన్నో సందేహాలు
నిర్మలా సీతారామన్ స్పష్టమైన ప్రకటన చేశారు. మల్టీ లెటరల్ ఏజెన్సీస్ ద్వారా 15 వేల కోట్లు ఆర్థిక సాయం అందిస్తామని స్పష్టం చేశారు. సాధారణంగా ఏజెన్సీలు గ్రాంట్లు ఇవ్వవు. అప్పులే సమకూరుస్తాయి. అప్పులు అయితే బడ్జెట్లో ఎందుకు పెడతారు అన్నది మరికొందరి వాదన. దీంతో అమరావతికి కేంద్రం ఇస్తామన్న 15 వేల కోట్లు ఏంటనే దానిపై అనేక రకాల సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇదే సమయంలో మాజీమంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఈ 15 వేల కోట్లు గ్రాంట్ కాదా? అనే సందేహం వ్యక్తం చేశారు. అమరావతికి 15 వేల కోట్లు అప్పు వివిధ సంస్థల ద్వారా ఏర్పాటు చేస్తామని కేంద్ర బడ్జెట్లో ప్రకటిస్తే గొప్పలు చెప్పుకుంటున్నారు. సంపద సృష్టి అంటే అప్పులు తెచ్చుకోవడం అన్నమాట అంటూ రాంబాబు ట్విట్ చేశారు. దీంతో వైసిపి శ్రేణులు ట్రోల్ చేయడం ప్రారంభించాయి.
* బిజెపి నుంచి ఫుల్ క్లారిటీ
అయితే దీనిపై బిజెపి నేతలు స్పందించారు. అమరావతికి కేంద్రం ప్రకటించింది రుణం కాదని.. గ్రాంట్ రూపంలో ఇచ్చినదేనని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సైతం ఫుల్ క్లారిటీ తో మాట్లాడారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత కూడా విలేకరుల సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ మాట్లాడారు. పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఏపీ విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణానికి కేంద్రం సాయం చేయాల్సి ఉందని కూడా చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు నుంచి 15 వేల కోట్లు ఇస్తున్నట్లు చెప్పారు. దీనికి అదనంగా నిధులు కేటాయింపు కూడా ఉంటుందన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వారు ఇస్తారా? లేదా కేంద్రం గ్రాంట్ ఇవ్వాలా అనేది చూస్తామని చెప్పుకొచ్చారు. అమరావతి నిర్మాణానికి మాత్రం కేంద్రం పూర్తిగా కట్టుబడి ఉందని నిర్మల సీతారామన్ స్పష్టం చేశారు.
* కేంద్రానిదే బాధ్యత
సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే నిధులు అప్పుల ద్వారా సమకూర్తుంది. పోలవరం ప్రాజెక్టుకు నాబార్డ్ ద్వారా రుణం మంజూరు చేయిస్తుంది. దానిని కేంద్రమే చెల్లించుకుంటుంది. కేంద్రమే అందుకు బాధ్యత వహిస్తుంది. అదే మాదిరిగా అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నిధులు 15 వేల కోట్ల రూపాయలను సమకూర్చింది. అందులో రాష్ట్రానికి ఎటువంటి బాధ్యత ఉండదు. తిరిగి ఆ రుణ చెల్లింపులు కేంద్రమే చేయాల్సి ఉంటుంది. అయితే నేరుగా నిధులు ఇస్తున్నామని కేంద్రం చెప్పకపోవడంతో విపక్షాలకు ఇదో ప్రచార అస్త్రంగా మారింది. కానీ విశ్లేషకులు మాత్రం దాన్ని తప్పు పడుతున్నారు. అది ముమ్మాటికీ గ్రాంట్ అని చెప్పుకొస్తున్నారు. గ్రాంట్ కాబట్టే బడ్జెట్లో కేటాయింపులు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మొత్తానికైతే అమరావతికి కేంద్రం ప్రకటించిన 15 వేల కోట్లు సాయం అని తేలింది. పూర్తిగా అమరావతి రాజధాని నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని.. సాయం చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి స్పష్టతనిచ్చారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More