Amaravathi capital : అమరావతికి కొత్త ఊపిరి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతికి ఆశలు వచ్చాయి. అటు కేంద్ర ప్రభుత్వం సైతం 15 వేల కోట్ల సాయం ప్రకటించడంతో నిర్మాణ పనులు ఇక దూసుకెళ్లనున్నాయి.గత ఐదు సంవత్సరాలుగా అమరావతి రాజధాని దారుణ వంచనకు గురైంది. ప్రస్తుతం రాజధాని నిర్మాణం పట్టాలెక్కించాలన్నా వనరులు సమీకరించడమే అతిపెద్ద సమస్య. ఇటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం సాయం ప్రకటించడం భారీ ఊరట. మరో నాలుగైదు నెలల్లో రాజధాని నిర్మాణ పనులు పూర్తిస్థాయిలో ప్రారంభించేందుకు వీలు కలగనుంది. జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టి అమరావతి రాజధానిని యధా స్థానానికి తీసుకు వచ్చేందుకు సి ఆర్ డి ఏ అధికారులు శ్రమిస్తున్నారు.
* కూటమి ప్రభుత్వ రాకతో
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి అమరావతి రాజధానిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. జూన్ 4న ఫలితాలు వచ్చాయి. కూటమికి భారీ మెజారిటీ దక్కింది. ఆ మరుసటి రోజు నుంచి 100 జెసిబి లతో పాటు వందలాది వాహనాలతో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. రహదారులతో పాటు కీలక నిర్మాణాలు ముళ్లపొదలు, పిచ్చి చెట్ల మధ్య ఉండి పోయాయి. అందుకేజంగిల్ క్లియరెన్స్ చేయడం ద్వారావాటిని గుర్తించగలిగారు.ఐకానిక్ నిర్మాణాల స్థితిగతులను నిపుణులతో కూడిన అధికారుల బృందం పరిశీలించింది. వాటి పరిస్థితిని అంచనా వేసి ప్రభుత్వానికి ఒక నివేదిక అందజేసింది. దాదాపు 29 గ్రామాల్లో.. 50 వేల ఎకరాల్లో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకుగాను 33 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇందుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. 45 రోజుల్లో జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
* ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థలకు భూములు
అమరావతిలో చాలా సంస్థలకు భూములు కేటాయించారు. అందులో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఉన్నాయి. ప్రైవేటు విద్యాసంస్థలు, టూరిజం ప్రాజెక్టులకు సైతం భారీ స్థాయిలో భూములు కేటాయించారు. ఇప్పుడు ఆ పరిశ్రమలకు సంబంధించి ప్రతినిధులతో సి ఆర్ డి ఏ అధికారులు మాట్లాడుతున్నారు. స్థలాలు అప్పగించేందుకు కసరత్తు చేస్తున్నారు. మరి కొన్ని సంస్థలు సైతం అమరావతి రాజధాని కి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి. వాటికి సైతం భూములు కేటాయించే అవకాశం ఉంది. ఆర్ 5 జోన్లో భూములను పేదలకు ఇళ్ల స్థలాల రూపంలో అందించారు. వాటిని తిరిగి యధా స్థానానికి తీసుకురావాలి. ఇందుకు సంబంధించి శాసనసభలో బిల్లు తేవాలి.మరోవైపు అమరావతికి సంబంధించి కేసులు న్యాయస్థానాల్లో ఉన్నాయి.వాటికి సంబంధించి పరిష్కార మార్గం చూపాల్సి ఉంది.
* పెండింగ్ పనులు పూర్తిచేస్తే..
అమరావతి రాజధాని లో ప్రధాన మౌలిక వసతుల పనులు, రైతులకు స్థలాలు ఇచ్చిన ఎల్పీఎస్ లేఅవుట్ లో మౌలిక వస్తువుల కల్పనకు దాదాపు 50 వేల కోట్లకు పైగా అవసరమని 2014లో టిడిపి ప్రభుత్వం అంచనా వేసింది. 41 వేల కోట్లకు సంబంధించి టెండర్లు పిలిచింది. 5000 కోట్లకు పైగా పనులు పూర్తయ్యాయి. గతంలో చేసిన పనులకు కాంట్రాక్టర్లకు 1300 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించాల్సి ఉంది. ముందుగా ఈ పెండింగ్ బిల్లులు చెల్లిస్తే కాంట్రాక్టర్లు అదే ఉత్సాహంతో పనులు ప్రారంభించే అవకాశం ఉంది. జంగిల్ క్లియరెన్స్ పనులకు రెండు నెలలు, నిలిచిపోయిన పనులకు డిపిఆర్లు, అంచనాలు సిద్ధం చేసేందుకు నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ లెక్కన మరో నాలుగు నెలలు ప్రాథమిక దశలోనే పనులు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన 15000 కోట్లువిడుదల అయితే మాత్రం అమరావతి నిర్మాణ పనులు చురుగ్గా ముందుకు సాగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More