Kadambari Jethwani case : ఏపీలో లడ్డు వివాదం ఒక వైపు కొనసాగుతుండగా.. మరోవైపు ముంబై నటి కాదంబరి జెత్వాని కేసులో కూడా కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లు చేర్చిన సంగతి తెలిసిందే. వారిపై సస్పెన్షన్ వేటు కూడా కొనసాగుతోంది. ఇంకోవైపు ఈ కేసులో ఇప్పటికే వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ అరెస్టయ్యారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టు న్యాయవాది ఒకరు కోర్టును ఆశ్రయించారు.కాదంబరి జెత్వాని కేసులో తనను అరెస్టు చేస్తారన్న భయంతో బెయిల్ కోసం ఆయన ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతోంది. వైసిపి హయాంలో ముంబైలో ఆ నటి ఓ పారిశ్రామికవేత్త కుటుంబం పై కేసు పెట్టింది. ఆ కేసును విత్ డ్రా చేయించడానికి సదరు పారిశ్రామికవేత్త ఏపీ ప్రభుత్వ పెద్దలను కలిశారు. వారి ఆదేశాల మేరకు ముగ్గురు ఐపీఎస్ అధికారులు రంగంలోకి దిగారు. పోలీస్ శాఖలో కిందిస్థాయి సిబ్బందిని ప్రయోగించి.. ముంబై నుంచి కాదంబరి జెత్వాని కుటుంబాన్ని విజయవాడ తీసుకొచ్చారు. కేసులతో భయపెట్టారు. చివరకు ఆమెను రిమాండ్ కు కూడా తరలించేలా చేశారు. చివరికి భయపడిపోయిన సదరు నటి ముంబైలో కేసు విత్ డ్రాకు ఒప్పుకున్నారు. తరువాత ముంబై వెళ్ళిపోయారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ ఇష్యూ బయటకు వచ్చింది. బాధితురాలు నేరుగా వచ్చి ఏపీ పోలీసులను ఆశ్రయించింది.
* నాటి ప్రభుత్వ పెద్ద ఆదేశాలతో
నాటి ప్రభుత్వ పెద్ద ఒకరు ఈ ఎపిసోడ్లో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గన్నీ, కాంతి రాణా టాటాలను సస్పెండ్ చేసింది ఏపీ ప్రభుత్వం.వైసిపి నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఒత్తిడితోనే పోలీస్ అధికారులు తన మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారని.. తనతోపాటు తన తల్లిదండ్రులను అరెస్టు చేసి జైల్లో పెట్టారని.. చిత్రహింసలకు గురి చేశారని కాదంబరి జెత్వాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎప్పటికీ వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ పోలీసుల అదుపులో ఉన్నారు.
* హైకోర్టు న్యాయవాది బెయిల్ పిటిషన్
అయితే వైసిపి నేత కుక్కల విద్యాసాగర్ పేరు ఉండడంతో.. భయపడుతున్నారు. తన పేరు సైతం ఈ కేసులో ఉంటుందని అనుమానిస్తున్నారు. అందుకే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో అక్టోబర్ 1 వరకు అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఇప్పటికే కోర్టు ఆదేశాలు ఉన్నాయి. హైకోర్టు ఇచ్చిన గడువు ఈరోజుతో ముగుస్తుండడంతో మరోసారి విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలోనే బెయిల్ తీసుకోవాలని ఐపీఎస్ అధికారులతో పాటు న్యాయవాది వెంకటేశ్వర్లు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.
* ఆసక్తి చూపిన వారిలో భయం
అయితే ఈ కేసులో చాలామంది వైసిపికి సంబంధం ఉన్నవారు ఉన్నట్లు తెలుస్తోంది. అప్పట్లో వైసీపీ ప్రభుత్వ పెద్దల్లో ఒకరు రంగంలోకి దిగడంతో చాలామంది.. ఈ కేసు విషయంలో ఆసక్తి చూపినట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాధితురాలే నేరుగా వచ్చి ఫిర్యాదు చేయడంతో.. నాడు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకారం అందించిన వారిలో ప్రకంపనలు రేగుతున్నాయి. ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవడం తప్పదని వారు ఒక నిర్ణయానికి వస్తున్నారు. అందుకే ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది.