TV5 Murti : వాక్ స్వాతంత్రం పేరుతో.. నచ్చిన నాయకులపై ప్రశంసలు.. నచ్చని నాయకులపై తిట్లు విమర్శలు చేస్తూ జర్నలిస్టుల ముసుగులో కొంతమంది వ్యవహరిస్తున్నారు. అలాంటి వారి వల్ల జర్నలిజం అనే వృత్తికే కళంకం ఏర్పడుతోంది. అయితే ఈ జాబితాలో కొంతమంది సీనియర్ పాత్రికేయులు కూడా ఉండడం బాధ కలిగిస్తున్నది.. ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్తే పెద్దగా ఇబ్బంది లేదు. ఒకవేళ విమర్శించాలి అనుకుంటే.. చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. అలాంటి వ్యాఖ్యలు చేసిన నాయకులను ప్రశ్నిస్తూ.. కడిగిపారేయాలి. దీనిని ఎవరూ తప్పు పట్టరు కూడా. కానీ అనుకూలమైన నాయకులు మాట్లాడితే ఒక విధంగా.. గిట్టని నాయకులు మాట్లాడితే మరొక విధంగా వ్యవహరించడమే నయా జర్నలిజం ట్రెండ్ అయిపోయింది. ఆమధ్య ఏపీలో పథకాలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. పథకాలు అమలు చేసే తీరు ఇప్పట్లో సాధ్యం కాదని తేల్చి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి విపరీతమైన అప్పులు చేశారని.. ఆ అప్పుల నుంచి రాష్ట్రం కోలుకోవాలంటే చాలా సమయం పడుతుందని అన్నారు. దీనిని ఓవర్గం మీడియా జగన్ మీదకు ఈజీగా డైవర్షన్ చేసింది. జగన్ చేసిన అప్పుల వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారిందని కథనాలు ప్రసారం చేయడం ప్రారంభించింది. ఇక మరో వర్గం మీడియా జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేస్తూ.. చంద్రబాబు నాయుడుకి పరిపాలన అనుభవం తెలియదని విమర్శించడం ప్రారంభించింది. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక దుస్థితికి అద్దం పట్టేలా ఉన్నాయని పేర్కొన్న ఓ వర్గం మీడియా.. ఇటీవల రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను విమర్శించడం విశేషం.
Also Read :హరి హర వీరమల్లు’ టీంని శాసిస్తున్న ‘అమెజాన్ ప్రైమ్’..విడుదల తేదీపై భారీ ట్విస్ట్!
నీతి సూక్తులు వల్లించడం మొదలుపెట్టింది
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. గులాబీ పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పట్టింది. దమ్ముంటే వెంటనే ముఖ్యమంత్రి సీటు నుంచి రేవంత్ దిగిపోవాలని డిమాండ్ చేసింది. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఉండే కనీస అర్హత కూడా లేదని తిట్టిపోసింది. అది ఎలాగూ పార్టీ మౌత్ పీస్ కాబట్టి దాని గురించి అలా వదిలేస్తే.. కాస్తో కూస్తో జనాల్లో క్రెడిబిలిటీ ఉన్న కొన్ని చానల్స్ కూడా అలానే వ్యవహరించడం నిజంగా సిగ్గుచేటు. తెలంగాణలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. వాటిని అమలు చేయడంలో కిందా మీదా పడుతోంది. ఇదే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి రేవంత్ రెడ్డి మొహమాటం లేకుండా చెప్పేశారు. ఇందులో ఆయన తప్పు కూడా ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అప్పులు మొత్తం రేవంత్ రెడ్డి చేయలేదు కదా.. ఇందులో కేసీఆర్ కు కూడా భాగస్వామ్యం ఉంటుంది కదా.. ఆ విషయాన్ని మర్చిపోయి కేవలం రేవంత్ రెడ్డి నే టార్గెట్ చేయడం నిజంగా మీడియా వ్యవహరిస్తున్న ఏకపక్ష ధోరణికి నిదర్శనం. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల వల్ల పెట్టుబడులు రావు.. బ్యాంకర్లు వెనుకంజ వేస్తారు.. ప్రభుత్వాన్ని ఎవరూ నమ్మరు.. అని వ్యాఖ్యానించిన ఓ వర్గం మీడియా.. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సైలెంట్ గా ఉండడం ఏంటి.. దీని ఏ భావ దారిద్రం అనుకోవాలి.. ఇక ఇదే సమయంలో ఆ వర్గం మీడియా లో పనిచేసే జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలను.. చంద్రబాబు నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై చేసిన వ్యాఖ్యలకు సరిపెడుతూ.. ఓ పార్టీ అనుకూల సోషల్ మీడియా గ్రూపులలో ప్రచారం చేయడం మరింత దారుణం. సోషల్ మీడియాను రాజకీయ పార్టీలు దారుణంగా వాడుకుంటున్నాయి. ప్రత్యర్థి పార్టీలను ప్రజల్లో చులకన చేయడానికి ఇలాంటి వీడియోలను మరింతగా వాడుకుంటున్నాయి. ఇవి ఎంతటి పెడపోకడలకు దారితీస్తున్నాయో ఇప్పటికే మనం చూసాం. వచ్చే రోజుల్లో మరెంత దారుణంగా మారుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
టీవీ 5 మూర్తి రివర్స్ #jaganannamedia pic.twitter.com/rbLOrI9iME
— JAGANANNAMEDIA (@JAGANANNAMEDIA) May 7, 2025