Tuni Train Case : తుని రైలు దహనం.. కేసు తేలలేదు.. శిక్ష పడలేదు

తుది విచారణ సమయంలో ఏ సాక్షి ముందుకు రాలేదు. మిగతా సాక్షాలేవీ నిలబడలేదు. దీంతో రైల్వే కోర్టు కేసును కొట్టి వేస్తూ తిర్పునిచ్చింది.                                                  

Written By: Dharma, Updated On : May 1, 2023 6:28 pm
Follow us on

Tuni Train Case : తుని రైలు దహనం కేసును కోర్టు కొట్టేసింది. నిందితులందర్నీ నిరపరాధులుగా తేల్చింది. అయితే కేసు విచారణలో ఫెయిలైన ముగ్గురు అధికారులపై న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చర్యలకు ఆదేశించారు. కాపు రిజర్వేషన్ల డిమాండుతో టీడీపీ హయాంలో కాపు నేత ముద్రగడ పద్మనాభం పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఈ క్రమంలో 2016 జనవరి 31న తునిలో తలపెట్టిన కాపు గర్జన కార్యక్రమం హింసాయుతంగా మారింది.  ఆందోళనకారులు రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు నిప్పు పెట్టారు. అంతటితో ఆగకుండా తుని రూరల్ పోలీస్ స్టేషన్‌పై కూడా దాడి చేసి నిప్పు పెట్టారు. పోలీస్ స్టేషన్‌లోని ఆయుధాలు,ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్ కూడా మృతి చెందాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన సంచలనమైంది. దీనిపై అప్పటి నుంచి విచారణ కొనసాగుతోంది. ఇప్పుడు సాక్షాలు లేకపోవడంతో కోర్టు కేసును కొట్టి వేసింది.

సంచలన ఘటన..
అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. అయితే అప్పటి విపక్షం వైసీపీపైనే ఎక్కవ స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. రాయలసీమ నుంచి అల్లరిమూకలను రప్పించి విధ్వంసానికి దాగారని టీడీపీ ఆరోపించింది. అందుకు తగ్గట్టుగానే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కేసులను ఎత్తివేసింది. ప్రధానమైన రైల్వేశాఖకు సంబంధించి విచారణ సాగుతూ వస్తోంది. 41 మంది నిందితులు కోర్టుకు హాజరవుతూ వస్తున్నారు. కానీ తుది విచారణ సమయంలో ఏ సాక్షి ముందుకు రాలేదు. మిగతా సాక్షాలేవీ నిలబడలేదు. దీంతో రైల్వే కోర్టు కేసును కొట్టి వేస్తూ తిర్పునిచ్చింది.

అప్పట్లో రకరకాల ఆరోపణలు..
వాస్తవానికి కాపు రిజర్వేషన్ ఉద్యమ సమయంలో రకరకాల ఆరోపణలు వచ్చాయి. అప్పటి చంద్రబాబు సర్కారు మొండిగా వ్యవహరిండచంతో ఉద్యమం పతాక స్థాయికి చేరుకుంది. అయితే ఇక్కడే ప్రధాన విపక్షం వైసీపీ తన మెదడుకు పదును పెట్టింది. కాపు ఉద్యమంతో టీడీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని భావించింది. కాపు గర్జనకు పార్టీ తరుపున పిలుపు కూడా ఇచ్చింది. అటు నేతలు సైతం రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో హింసాత్మక ఘటనలకు దారితీసినట్టు రైల్వే పోలీసులు కేసు కూడా నమోదుచేశారు. కానీ సాక్షులను మాత్రం నిలబెట్టుకోలేకపోయారు. ఐదేళ్లు కేసును సాగదీసి ఒక్క సాక్షిని మాత్రమే ప్రవేశ పెట్టారని …ఒక్క సాక్ష్యం కూడా చూపించలేదని మండిపడి ముగ్గురు రైల్వే ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారు.. అసలు నిందితులు 41 మందిపై పెట్టిన కేసుల్ని అక్రమ కేసులుగా పరిగణిస్తూ విజయవాడ రైల్వే కోర్టు తీర్పు చెప్పింది.

బయటపడిన కీలక నేతలు..
కాపుఉద్యమ మాజీ నాయకుడు ముద్రగడ పద్మనాభం, మంత్రి దాడిశెట్టి రాజా, వన్‌ టీవీ ఎండీ మంచాల సాయిసుధాకరనాయుడు, సినీ నటుడు జీవీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కామన ప్రభాకరరావు, కాపు నాయకులు కల్వకొలను తాతాజీ, వాసిరెడ్డి ఏసుదాసు, నల్లా విష్ణుమూర్తి, ఆకుల రామకృష్ణ వంటి వారు నిందితులుగా ఉండేవారు. వారందరూ కేసు నుంచి బయట పడినట్లయింది. అయితే ఇప్పటికే కాపు రిజర్వేషన్ ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్టు ముద్రగడ ప్రకటించారు. సీఎం జగన్ కు లేఖాస్త్రాలతో సమయాన్ని గడుపుతున్నారు. తుని విధ్వంస కేసుల ఎత్తివేతతో సీఎం జగన్ కు ప్రత్యేకంగా లేఖరాసి దన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు ఏకంగా కేసు నుంచి బయటపడడంతో ఎలా స్పందిస్తారో చూడాలి మరీ.