IND Vs AUS: మూడు వన్డేల సిరీస్ లో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడుతోంది. పెర్త్ మైదానంలో జరిగిన తొలి వన్డేలో టీం ఇండియా ఓటమిపాలైంది. బ్యాటింగ్లో విఫలమైంది. బౌలింగ్లో సత్తా చూపించలేకపోయింది. ఆతిథ్య జట్టు బౌలర్ల ఎదుట దాసోహం అయిపోయింది. దీంతో టీమిండియా అభిమానులు ఒక్కసారిగా నిరుత్సాహానికి గురయ్యారు. వాస్తవానికి ఈ మ్యాచ్ కు అనేక పర్యాయాలు వర్షం అంతరాయం కలిగించింది. ఇది కూడా టీమ్ ఇండియా ఓడిపోవడానికి ఒక కారణమైంది.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, గిల్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి దారుణంగా విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కోవడంలో సత్తా చూపించలేకపోయారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ 0 పరుగులకు అవుట్ కావడాన్ని సగటు భారత అభిమాని జీర్ణించుకోలేకపోతున్నాడు. వాస్తవానికి ఈ మైదానంలో టీమిండియా కు మెరుగైన రికార్డు ఉంది. అయినప్పటికీ టీమిండియా గత వైభవాన్ని కొనసాగించలేకపోయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ , హేజిల్ వుడ్ టీమిండియా ప్లేయర్లకు చుక్కలు చూపించారు.
పెర్త్ మైదానంలో ఓటమి తర్వాత.. టీమిండియా గురువారం ఆస్ట్రేలియాతో రెండవ వన్డే ఆడుతోంది. అడిలైడ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా సారథి టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మైదానం కూడా పేస్ బౌలర్లకు విపరీతంగా సహకరిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మైదానంలో ఆస్ట్రేలియాకు ఘనమైన రికార్డు ఉంది. ఇప్పటికే పేస్ బౌలర్లను ఎదుర్కోవడంలో భారత ప్లేయర్లు విఫలమయ్యారు. తొలి వన్డేలో అది ప్రస్ఫుటంగా కనిపించింది. ఈ నేపథ్యంలో రెండవ వన్డేలో కూడా బౌన్సీ పిచ్ ను రూపొందించడంతో టీమ్ ఇండియాకు కష్టాలు తప్పవని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
ఈ మైదానంలో టీమ్ ఇండియా మొత్తం ఇప్పటివరకు 15 వన్డే మ్యాచ్లు ఆడింది. ఇందులో తొమ్మిది విజయాలు, ఐదు ఓటములు ఉన్నాయి. 2012లో శ్రీలంక జట్టుతో టీమ్ ఇండియా ఈ మైదానంలో ఆడిన మ్యాచును టై గా ముగించింది. టీమిండియా ఈ మైదానంపై ఆడిన చివరి ఐదు మ్యాచ్లలో ఓటమి పాలు కావడం విశేషం. 2008లో ఫిబ్రవరిలో ధోని ఆధ్వర్యంలో టీమిండియా ఈ మైదానంలో ఆస్ట్రేలియాతో తలపడి విజయం సాధించింది. అప్పుడు ఆస్ట్రేలియా జట్టుకు పాంటింగ్ నాయకత్వం వహించాడు. ఈ మైదానంలో ఫిబ్రవరి 15 2015లో పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ఈ మైదానంలో టీమిండియా కు ఇదే అత్యుత్తమ స్కోరు. 2008లో ఫిబ్రవరి 17న ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మ్యాచ్లో టీమిండియా 153 పరుగులకు కుప్పకూలింది. ఈ మైదానంలో టీమిండియా కు ఇదే అత్యల్ప స్కోర్.