Mount Everest: ఎవరెస్ట్ శిఖరం హిమాలయ పర్వతాలకు కంఠాభరణం గా ఉంటుంది..ఈ శిఖరం వల్ల హిమాలయ పర్వతాల్లో జీవ వైవిధ్యం సమున్నతంగా ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల అంటార్కిటిక్ ఖండంలో మంచు కరుగుతోంది. ధ్రువపు ప్రాంతాల్లో మంచు కరగడం వల్ల సముద్రమట్టాలు పెరుగుతున్నాయి. వాతావరణంలో అసాధారణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కానీ వీటికంటే భిన్నంగా ఎవరెస్ట్ శిఖరం ఎత్తు పెరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తాజా పరిశోధనల ప్రకారం భారతదేశంలో విస్తరించి ఉన్న యురేషియన్ టెక్నిక్ ప్లేట్లలో గత కొంతకాలంగా కదలికలు ఏర్పడుతున్నాయి. ఈ కదలికలు హిమాలయాల ఎత్తు పెరగడానికి కారణం అవుతున్నాయి. 50 మిలియన్ సంవత్సరాలుగా హిమాలయ పర్వతాలు పెరుగుతున్నప్పటికీ.. ఎవరెస్ట్ ఇటీవల కాలంలో ఊహించిన దాని కంటే ఎక్కువ ఎత్తు పెరిగిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎవరెస్ట్ నేపాల్ దేశంలో విస్తరించి ఉంది. దీని ఎత్తు 8,848.86 మీటర్లు. బిలియన్ సంవత్సరాల క్రితమే హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. సుమారు 89,000 సంవత్సరాల క్రితం హిమాలయ పర్వతాల పరిధిలో ప్రవహించే కోసి నది ఆ సమయంలో అరుణ్ అనే నదిలో కలిసిపోయింది. ఈ పరిణామం ఎవరెస్ట్ శిఖరం 49 నుంచి 164 అడుగుల ఎత్తు పెరగడానికి దారితీసింది. “ఐసో స్టాటిక్ రీ బౌండ్” అనే భౌగోళిక ప్రక్రియ ద్వారా ఈ మార్పు చోటుచేసుకుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి సంబంధించిన విషయాలను నేచర్ జియో సైన్స్ అనే జర్నల్ లో ప్రచురించారు. ఈ జర్నల్ లో ఇటీవల ప్రచురితమైన కొత్త అధ్యయనం ప్రకారం సముద్రమట్టానికి 8.85 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్టు పర్వతం మరింత పొడవు పెరుగుతోంది. చైనాలోని బీజింగ్ నగరంలో చైనా యూనివర్సిటీ ఆఫ్ జియో సైన్సెస్ కు చెందిన జిన్ జెన్ డై ఆధ్వర్యంలో పరిశోధన చేశారు.. ఆయన పరిశోధనలో ఎవరెస్ట్ పెరుగుదల విస్తృతంగా ఉందని తేలింది.
అదే కారణమా
హిమాలయ నదులు ఇటీవల కాలంలో భారీగా కోతకు గురవుతున్నాయి. హిమాలయ ప్రాంతాలలో రాళ్లు, మట్టిని తొలగిస్తున్న నేపథ్యంలో భూమి క్రస్ట్ పై బరువు తగ్గింది.. దీంతో ఎవరెస్టు పెరగడం మొదలైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎవరెస్ట్ వార్షిక పెరుగుదలలో ఐసో స్టాటిక్ రీబాౌండ్ ప్రభావం 10 శాతం వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇది సంవత్సరానికి దాదాపుగా 0.01 నుంచి 0.2 అంగుళాలుగా ఉంటుందని తెలుస్తోంది. కేవలం ఎవరెస్టు మాత్రమే కాకుండా పక్కనే ఉన్న లోట్సే, మకాలు వంటి శిఖరాలు కూడా విపరీతమైన వృద్ధిని సాధిస్తున్నాయి.. అరుణ్ నదికి దగ్గరగా ఉన్న మకాలు పర్వతం ఎవరెస్ట్ తో పోల్చితే కొంచెం ఎక్కువ ఎత్తులో ఉందని తెలుస్తోంది.. లండన్ లోని యూనివర్సిటీ కాలేజీలో డాక్టరల్ విద్యార్థి అయిన ఆడం స్మిత్ జిపిఎస్ కొలతల ద్వారా ఎవరెస్టు ఎత్తును అంచనా వేశారు. చుట్టుపక్కల ఉన్న హిమాలయాలు నిరంతరం పెరుగుతున్నాయని అతడు పేర్కొన్నాడు.. ” చాలా సంవత్సరాలుగా ఎవరెస్టు పెరుగుతోంది. ఈ పరిణామం ఎందుకు దారితీస్తోంది అని పరిశీలించగా.. సంచలమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. కొన్ని నదులు మిగతా వాటిల్లో కలిసిపోయాయి. అందువల్ల భౌగోళిక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నదుల ప్రవాహం ఒక్కసారిగా మారడంతో ఎవరెస్ట్ అడుగున ఉన్న క్రస్టు భాగం పై ఒత్తిడి తగ్గుతోంది. అందువల్ల ఎవరెస్టు శిఖరం ఎత్తు పెరుగుతోందని” స్మిత్ వ్యాఖ్యానించారు. అయితే ఎవరెస్ట్ ఎత్తు పెరిగితే దాని పర్యవసనాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు దాని ప్రభావం కనిపించకపోయినప్పటికీ.. దీర్ఘకాలంలో అధికంగా ఉంటుందని వారు వివరిస్తున్నారు.