https://oktelugu.com/

TTD : టీటీడీలో కీలక నిర్ణయాలు.. వార్షిక బడ్జెట్.. కొత్త రూల్స్ ఇవే!

TTD :టీటీడీలో అన్యమత ఉద్యోగస్తులను పూర్తిగా తొలగించాలని నిర్ణయం తీసుకుంది. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వార్షిక బడ్జెట్ ఆమోదం పొందింది. కాగా టీటీడీ పాలకవర్గ నిర్ణయాలను చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు.

Written By: , Updated On : March 25, 2025 / 12:18 PM IST
TTD Trust Board

TTD Trust Board

Follow us on

TTD : తిరుమల తిరుపతి ట్రస్ట్ బోర్డు ( Tirumala Tirupati trust board ) కీలక నిర్ణయాలు తీసుకుంది. వార్షిక బడ్జెట్ ను ఆమోదించింది. రూ. 5258.68 కోట్లతో పాలకమండలి ఆమోదం తెలిపింది. అలాగే వివిధ భూ కేటాయింపులను సైతం రద్దు చేసింది. మనదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో సైతం శ్రీవారి ఆలయాలను నిర్మించాలని నిర్ణయించింది. బ్రేక్ దర్శనాల మార్పుతో పాటుగా భక్తుల వసతి కోసం వసతి సముదాయాల పునరుద్ధరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీటీడీలో అన్యమత ఉద్యోగస్తులను పూర్తిగా తొలగించాలని నిర్ణయం తీసుకుంది. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వార్షిక బడ్జెట్ ఆమోదం పొందింది. కాగా టీటీడీ పాలకవర్గ నిర్ణయాలను చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు.

Also Read : అప్పుల కుప్పగా ఏపీ.. కేంద్రం సంచలన ప్రకటన

* భూ కేటాయింపులు రద్దు..
ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం( TTD ) గతంలో వివిధ హోటళ్లకు భూములు కేటాయించిన సంగతి తెలిసిందే. వాటిని రద్దు చేసినట్లు ఇటీవల సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇప్పుడు టీటీడీ కూడా అదే నిర్ణయాన్ని ప్రకటించింది. ముంతాజ్ హోటల్ నిర్మాణానికి వేరేచోట భూమి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. అలిపిరి వద్ద 35.24 ఎకరాలతో పాటు 15 ఎకరాల టూరిజం భూమిని టీటీడీ స్వాధీనం స్వాధీనం చేసుకోవడానికి టిటిడి నిర్ణయించింది. ప్రత్యామ్నాయంగా 50 ఎకరాల భూమిని మరో ప్రదేశంలో ప్రభుత్వానికి కేటాయిస్తామని చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. మనదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో సైతం శ్రీవారి ఆలయాలను నిర్మిస్తామని ప్రకటించారు. శ్రీవాణి ట్రస్టు తో పాటు నూతనంగా ఏర్పాటు చేయబోయే మరో ట్రస్టు ద్వారా వచ్చే విరాళాలతో ఈ ఆలయాలు నిర్మిస్తామని చెప్పారు.

* ఆస్తుల రక్షణకు చర్యలు..
మరోవైపు టీటీడీ ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు. శ్రీవారి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ప్రత్యేక కమిటీని( special committee) నియమిస్తున్నట్లు తెలిపారు. శ్రీవారి ఆస్తులకు సంబంధించి న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి చర్యలు తీసుకోనున్నారు. టీటీడీలో తరచూ అన్యమతస్తుల ఉద్యోగస్తులకు సంబంధించి విమర్శలు వస్తున్నాయి. దీనిపై సైతం నిర్ణయం తీసుకున్నారు. దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలను నిర్మిస్తామని చెబుతోంది టిటిడి. అందుకు సంబంధించి సానుకూల నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో పలుచోట్ల నిలిచిపోయిన దేవాలయాలను సైతం పునర్నిర్మించనున్నారు.

* దర్శనాల మార్పులు..
స్వామి వారి బ్రేక్ దర్శనాలకు సంబంధించి మార్పులు చేశారు. గతం మాదిరిగానే ఉదయం 6 గంటలకు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తిరుపతి గంగమ్మ( Tirupati Gangamma ), తలకోన, కర్నూలు జిల్లాలో బుగ్గ, అనకాపల్లిలోని ఉపమాక, ధర్మవరం, తెలంగాణలోని కొడంగల్, సికింద్రాబాద్, కరీంనగర్లలో నూతనంగా ఆలయాలు నిర్మిస్తున్నామని ప్రకటించారు. వికలాంగులు, వృద్ధులకు ఆన్లైన్లో టికెట్ జారీపై కూడా నిర్ణయం తీసుకున్నారు. ఆగమ సలహా మండలిని రద్దు చేశారు. త్వరలోనే నూతన కమిటీని నియమించనున్నారు. శ్రీనివాసన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ధికి కోటి రూపాయల నిధులు మంజూరు చేశారు. గూగుల్ సంస్థ ద్వారా తిరుమల కార్యకలాపాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు టిటిడి చైర్మన్. మొత్తానికైతే కీలక నిర్ణయాలు దిశగా టీటీడీ అడుగులు వేసిందన్నమాట.

Also Read : ఎంపీ వర్సెస్ మాజీ మంత్రి.. ముదురుతున్న వివాదం!