AP Debt 2025
AP Debt 2025: ఏపీ ప్రభుత్వ( AP government) అప్పుల వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ మరోసారి బయటపెట్టింది. ఏడాదికి ఏడాది అప్పులు పెరుగుతున్నట్లు అర్థమవుతోంది. లోక్సభ లో ఓ సభ్యుడి ప్రశ్న మేరకు కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం చెప్పారు. దీంతో ఏపీకి అంత స్థాయిలో అప్పులు ఉన్నాయా అని సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఏడాదికి ఏడాది ఈ అప్పులు పెరుగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భారీగా అప్పులు పెరిగాయని కూటమి ఆరోపించింది. తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామని కూడా చెప్పుకొచ్చింది. కూటమి పాలనలో కూడా అప్పులకు చెక్ పడకపోవడం విమర్శలకు తావిస్తోంది.
Also Read: మారిన యనమల రూటు!
* స్పష్టమైన ప్రకటన
ప్రస్తుతం ఏపీ అప్పు అక్షరాల రూ.5.62 లక్షల కోట్లు అని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి( Pankaj Chaudhari ) తెలిపారు. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో అప్పులు 34.70% ఉంటాయని వెల్లడించారు. సోమవారం లోక్ సభలో ఎంపీ మనీష్ తివారి అడిగిన ప్రశ్నకు దేశంలోని రాష్ట్రాల అప్పుల వివరాలను పంకజ చౌదరి వెల్లడించారు. రాష్ట్రాల నికర రుణ పరిమితిని ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని తెలిపారు. అన్ని రాష్ట్రాలు ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ చట్టాన్ని అమలు చేస్తున్నాయని కూడా చెప్పారు.
* ఏటా పెరుగుతున్న అప్పులు
అయితే వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వ హయాంలో భారీగా అప్పులు పెరిగాయని ఆరోపణలు ఉన్నాయి. 2019లో రాష్ట్ర అప్పులు రూ. 2,64,451 కోట్లు ఉండగా..2020లో రూ. 3,07,671 కోట్లు, 2021లో రూ. 3,53,021 కోట్లు, 2022లో సవరించిన అంచనాల తరువాత రూ. 3,93,718 కోట్లు, 2023లో బడ్జెట్ అంచనాల ప్రకారం ఏపీ ప్రభుత్వ అప్పు రూ. 442442 కోట్లు. 2024 నాటికి ఏపీ అప్పులు 5 లక్షల కోట్లకు దాటాయి. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ 50 వేల కోట్ల అప్పులు పెరిగాయి. అయితే ఉన్న అప్పులు తీర్చుకునేందుకు కొత్త అప్పులు తప్పడం లేదని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓ 20 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టిందని.. కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని కూటమి ప్రభుత్వం చెబుతోంది.
* పథకాలు అమలు కాకముందే..
ఏపీలో ఇంకా సంక్షేమ పథకాలు( welfare schemes) అమలు ప్రారంభం కాలేదు. తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అందులో కీలకమైనవి అన్నదాత సుఖీభవ తో పాటు తల్లికి వందనం. ఈ రెండు పథకాలు అమలు చేసేందుకు 25 వేల నుంచి 30 వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఏపీ ఆదాయం చూస్తే అంతంతమాత్రంగా ఉంది. ఈ పథకాలకు వేలకోట్లు అప్పు అనివార్యం. అందుకే మున్ముందు ఈ అప్పులు మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.