Pawan vs Jagan : ఇటీవల కురిసిన వర్షాలకు ఏపీలోని విజయవాడ మునిగిపోయింది. బుడమేరు ఉధృతంగా ప్రవహించడంతో విజయవాడ నగరం వణికిపోయింది. దాదాపుగా అన్ని ప్రాంతాలు నీట మునిగాయి. ఇదే సమయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా విమర్శలు చేసుకోవడం మొదలుపెట్టాయి. విజయవాడ నగరం మునిగిందంటే దానికి కారణం మీరంటే మీరని పరస్పరం బురద ఎత్తిపోసుకున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఒకరి తప్పులను మరొకరు బయట పెట్టుకుంటూ.. వరదలను కూడా రాజకీయాలకు ఉపయోగించుకున్నాయి.
విజయవాడ నగరం నీట మునిగిన నేపథ్యంలో ప్రభుత్వపరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు పనులు జరుగుతున్న తీరును పరిశీలిస్తున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా విజయవాడలో పర్యటించారు. వరద బాధితులను పరామర్శించారు. విజయవాడ నగరం నీట మునగడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడని ఆరోపించారు. ఆయన నివాసం నీట మునగకుండా ఉండేందుకు బుడమేరు లాకులు ఎత్తారని విమర్శించారు. ఆ లాకులు ఎత్తకుండా ఉంటే విజయవాడ నగరం ఈ స్థాయిలో నీట మునిగేది కాదని పేర్కొన్నారు.. వరద బాధితుల కోసం కోటి రూపాయలు ధనవంతు సహాయంగా అందిస్తున్నట్టు వెల్లడించారు. ఇదే క్రమంలో వరదల్లో సర్వం కోల్పోయి ఇబ్బంది పడుతున్న బాధితులకు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భరోసా అందించలేదని.. కనీసం క్షేత్రస్థాయిలో వారిని పరామర్శించలేదని.. సహాయక చర్యలను పర్యవేక్షించలేదని జగన్ ఆరోపించారు.
జగన్ ఆరోపించిన వెంటనే..
జగన్ పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు చేసిన వెంటనే ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న సాక్షి మీడియా కూడా తన పల్లవి అందుకుంది. పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా కథనాలను ప్రసారం చేయడం మొదలుపెట్టింది. దీంతో పవన్ కళ్యాణ్ స్పందించక తప్పలేదు. తాను క్షేత్రస్థాయిలోకి వస్తే, అధికారులు మొత్తం తన చుట్టే ఉంటారని.. అందువల్లే తను రాలేదని పవన్ కళ్యాణ్ వివరించారు. ఇదే సమయంలో కోటి రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రకటించారు. అంతేకాకుండా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రామీణ అభివృద్ధి శాఖ పరిధిలోని 400 గ్రామ పంచాయతీలకు లక్ష చొప్పున విరాళంగా ఇస్తున్నట్టు వెల్లడించారు. మొత్తంగా ఐదు కోట్లను పవన్ కళ్యాణ్ ఇస్తానని ప్రకటించారు.
జనసేన నాయకులు.. ఏమంటున్నారంటే..
పవన్ కళ్యాణ్ పై వైసీపీ శ్రేణులు, సాక్షి మీడియా ప్రధానంగా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో జనసేన నాయకులు స్పందించారు. గతంలో ఏపీని వరదలు ముంచెత్తినప్పుడు.. జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించలేదు. తాడేపల్లి ప్యాలెస్ వదిలిపెట్టి రాలేదు. దీనిపై అప్పట్లో ప్రతిపక్ష స్థానంలో ఉన్న టిడిపి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. దీంతో జగన్మోహన్ రెడ్డి శాసనసభ వేదికగా స్పందించాల్సి వచ్చింది..”నేను ముఖ్యమంత్రిని. క్షేత్రస్థాయిలోకి వచ్చి ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తే.. అధికారులు మొత్తం నా చుట్టూ ఉంటారు. అది సహాయక చర్యలకు విఘాతం కలిగిస్తుంది. అందువల్ల నేను క్షేత్రస్థాయిలో పర్యటించలేదు. దీనిని కూడా రాజకీయం చేయడం సరికాదని” జగన్ వ్యాఖ్యానించారు. ఇక నాటి వీడియోను జనసేన నాయకులు సోషల్ మీడియాలో తెగ ట్రెండు చేస్తున్నారు..”నాడు నీతులు చెప్పిన జగన్.. నేడు పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తున్నారు. వరద బాధితులను పరామర్శించేందుకు రాలేదని ఆరోపిస్తున్నారు. దయ్యాలు వేదాలు వల్లిస్తే ఇలానే ఉంటుందని” జనసేన నాయకులు పేర్కొంటున్నారు.
వీడియో కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి