Star liner : స్టార్ లైనర్ వచ్చింది సరే.. అంతరిక్షంలో ఉన్న సునీత పరిస్థితి ఏంటి? అక్కడ ఆమె సురక్షితమేనా? భూమ్మీదకి తిరిగి ఎప్పుడొస్తుందంటే..

అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏ డాది ఫిబ్రవరి నెలలో సునీత, బుచ్ విల్ మోర్ తిరిగి భూమ్మీదకి వస్తారని తెలుస్తోంది. ఈ బాధ్యతను పూర్తిగా నాసా తీసుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : September 7, 2024 9:16 pm

Star liner has come to Earth.. What is the condition of Sunita Williams in space?

Follow us on

Star liner : ఒక ప్రయోగం నిమిత్తం ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కు వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లిన బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్ అకస్మాత్తుగా తిరిగి భూమి మీదకి వచ్చింది. సాంకేతిక సమస్యలు చోటు చేసుకోవడంతో వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్ మోర్ ను అంతరిక్షంలోనే ఉంచి భూమిని చేరింది.. స్టార్ లైనర్ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ నుంచి వీడ్కోలు తీసుకున్న తర్వాత ఆరు గంటల అనంతరం భూమ్మీదకు చేరింది. మెక్సికో సమీపంలోని వైట్ శాండ్స్ స్పేస్ హార్బర్ లో ల్యాండ్ అయింది.

సురక్షితమేనా?

అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఈ ఏడాది జూన్ నెలలో బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్ నిర్వహించింది.. ఈ మిషన్ గడువు పది రోజులు. ఈ ప్రయోగంలో భాగంగా భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్, బుచ్ విల్ మోర్ స్టార్ లైనర్ కంపెనీకి చెందిన నౌకలో ప్రయాణించారు. జూన్ 5న ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ లో అడుగుపెట్టారు. ముందుగానే నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం వీరిద్దరూ జూన్ 14న తిరిగి భూమి మీదకు రావాల్సి ఉంది.. అయితే స్టార్ లైనర్ వ్యోమ నౌకలో హీలియం గ్యాస్ లీక్ అయింది. అంతేకాదు దాన్నుంచి వింత వింత శబ్దాలు వచ్చాయని వెస్ట్రన్ మీడియా కథనాలు రాసింది.

హీలియం గ్యాస్ లీక్ తో..

స్టార్ లైనర్ వ్యోమ నౌకలో హీలియం గ్యాస్ లీక్ అవుతున్న నేపథ్యంలో… ఆ సమస్యను పరిష్కరించేందుకు బోయింగ్ రకరకాల ప్రయోగాలు చేసింది. ఫలితంగా సునీత, బుచ్ విల్ మోర్ భూమ్మీదికి తిరిగి రావడం వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు స్టార్ లైనర్ లో ఆ సమస్యను గోయింగ్ సంస్థ పరిష్కరించింది. వ్యోమగాములను భూమ్మీదకు తిరిగి తీసుకువస్తామని వెల్లడించింది. అయితే గతంలో చేదు అనుభవాలు ఎదుర్కోవడంతో నాసా దీనికి ఒప్పుకోలేదు. నాసా ఒప్పుకోకపోవడంతో వారిని భూమ్మీదికి తిరిగి తీసుకురావడానికి స్టార్ లైనర్ కు అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆ వ్యోమ నౌక ఖాళీగా తిరిగి భూమి మీదకి వచ్చింది. సునీత, బుచ్ విల్ మోర్ తిరిగి భూమ్మీదికి తీసుకొచ్చేందుకు ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ మరో వ్యోమ నౌక రూపొందిస్తోంది. ఫలితంగా మరికొద్ది నెలలపాటు సునీత, బుచ్ విల్ మోర్ అంతర్జాతీయ స్పేస్ సెంటర్ లోనే ఉండాల్సి వస్తుంది.

సునీత ఎప్పుడు వస్తుందంటే?

స్పేస్ ఎక్స్ కంపెనీ క్రూ 9 మిషన్ ను నిర్వహిస్తోంది. ఇందు లో భాగంగా నాసా ఇద్దరు ఆస్ట్రోనాట్లతో క్రూ డ్రాగన్ ను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెలలోనే ఈ ప్రయోగం నిర్వహిస్తుందని తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏ డాది ఫిబ్రవరి నెలలో సునీత, బుచ్ విల్ మోర్ తిరిగి భూమ్మీదకి వస్తారని తెలుస్తోంది. ఈ బాధ్యతను పూర్తిగా నాసా తీసుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.