Tirumala Laddu Ghee Scam: తిరుమల( Tirumala) లడ్డూ వివాదానికి సంబంధించిన కేసు విచారణ తుది దశకు చేరుకుంది. సిబిఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా తిరుపతిని కేంద్రంగా చేసుకొని ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగుతోంది. దీనిని సిబిఐ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేసు విచారణ ఒక కొలిక్కి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడికి కోర్టు బెయిల్ నిరాకరించడం.. తుది దశకు చేరుకున్నట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం సంకేతాలు పంపించింది. అయితే ఈ కేసు విచారణలో భాగంగా సంచలనాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుమల లడ్డు తయారీలో వాడే నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న ఆరోపణలు వచ్చాయి. అయితే జంతు కొవ్వుకు సంబంధించిన అంశం బయటకు రాలేదు కానీ.. నెయ్యి మాత్రం కల్తీ అయిందని స్పష్టమైన ఆధారాలు దొరికాయి. అయితే ఈ కేసు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీగా డ్యామేజ్ చేసింది.
* వైసిపి హయాంలో..
వైసీపీ( YSR Congress party) హయాంలో టీటీడీ ప్రతిష్టకు మంటగలిపే చాలా రకాల చర్యలు జరిగాయన్నది ప్రధాన ఆరోపణ. అన్యమత ప్రచారం తో పాటు టీటీడీలో చాలా రకాల అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఇటువంటి నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు వైసీపీ హయాంలో జరిగిన వ్యవహారం పై మాట్లాడారు. తిరుమల లడ్డు తయారీకి సంబంధించిన నెయ్యిలో జంతు కొవ్వు వాడారని ఆరోపణలు చేశారు. అప్పట్లో ప్రకంపనలకు దారితీసాయి ఆ వ్యాఖ్యలు. అయితే ఈ ఆరోపణలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. కానీ సిబిఐ నేతృత్వంలోని దర్యాప్తు కావాలని వైసిపి కోరింది. దీంతో కోర్టు సిబిఐ నేతృత్వంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. గత కొన్ని నెలలుగా సిట్ విచారణ చేపడుతోంది. అయితే ఇది తుది దశకు విచారణ వచ్చినట్లు తెలుస్తోంది.
* అధికారి పాత్ర పై ఆధారాలు..
అప్పట్లో టిటిడిలో పనిచేసిన ఓ అధికారి నెయ్యి సరఫరా చేసిన సంస్థల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడినట్లు విచారణలో తేలినట్లు సమాచారం. అయితే దాదాపు 80 లక్షల రూపాయలకు పైగా లావాదేవీలకు సంబంధించి ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అప్పన్న అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించారు. తెర వెనుక పెద్ద వ్యక్తుల ప్రమేయాన్ని కూడా గుర్తించినట్లు సమాచారం. మరోవైపు సిబిఐ ఉన్నతాధికారులు ఢిల్లీ నుంచి తరచూ వస్తున్నారు. ఇంకోవైపు కోర్టు ప్రధాన నిందితుడికి సంబంధించి బెయిల్ తిరస్కరించింది. ఇటువంటి పరిస్థితుల్లో కేసు విచారణ తుది దశకు చేరినట్లు స్పష్టమవుతోంది. అయితే ఈ కేసులో సంచలనాలు నమోదయ్యే ఛాన్స్ ఉందని అధికార వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. మరి ఎటువంటి సంచలనాలు నమోదు అవుతాయో చూడాలి.