Tirumala Laddu : తిరుమల లడ్డు కల్తీ ఘటనకు సంబంధించి విచారణ కీలక దశకు చేరుకుంది. దీనిపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణను ముమ్మరం చేస్తోంది. తిరుపతిలో మకాం వేసిన సిట్ అధికారులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. లడ్డు తయారీ కేంద్రం మొదలు.. నెయ్యి సరఫరా కంపెనీల వరకు వివరాలు సేకరించారు. అందుకు సంబంధించి రికార్డులను సైతం స్వాధీనం చేసుకున్నారు. పూర్తిస్థాయి విచారణకు సంబంధించి ప్రాథమిక నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తిరుమల లడ్డులో జంతు కొవ్వు కలిపారని సాక్షాత్ సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ హయాంలో తిరుమల పవిత్రతను మంటగలిపే చర్యలు జరిగాయి అన్నది చంద్రబాబు నుంచి వచ్చిన ఆరోపణ. దీనిపై వైసీపీ అప్రమత్తం అయ్యింది. వెంటనే న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. సిబిఐ నేతృత్వంలోని అత్యున్నత సిట్ బృందం దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని కోర్టులో వాదనలు వినిపించింది. దీనిపై స్పందించిన న్యాయస్థానం సిబిఐ నేతృత్వంలో రాష్ట్ర పోలీస్ అధికారులను సైతం భాగస్వామ్యం కల్పించింది. ఐదుగురితో సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇప్పుడు అదే సిట్ బృందం లడ్డు కల్తీపై విచారణ చేపడుతోంది.
* విచారణ వేగవంతం
తిరుపతిలోని తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేసుకున్న సిట్ విచారణను వేగవంతం చేసింది. సిబిఐ జెడి నేతృత్వంలోని ఏర్పాటైన షిట్ లడ్డు తయారీ చేసే పోటును సైతం పరిశీలించింది. తిరుమలకు నెయ్యి టెండర్లు, కాంట్రాక్టర్ల ఖరారు పైన ఆరా తీసింది. తిరుమలకు నీ సరఫరా చేసిన కంపెనీలను సైతం పరిశీలించింది. ఏ ఆర్ డైరీలో విచారణ కొనసాగించింది. కొన్ని కీలక ఫైల్స్ ను సైతం స్వాధీనం చేసుకుంది.
* కీలక వాంగ్మూలం
అయితే ఈ మొత్తం వ్యవహారంలో లారీ టాంకర్లకు సంబంధించి డ్రైవర్ల వాంగ్మూలం కీలకంగా మారింది. వారి నుంచి వివరాలు సేకరించి నమోదు చేసింది. ఈ మొత్తం విచారణలో పలు సంచలన విషయాలు వెల్లడయ్యాయి. దీనిపైనే ఒక నివేదికను సిద్ధం చేసుకుంది సిట్. నెయ్యి సరఫరా లోపాల పైన ప్రాథమిక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. నెయ్యి సరఫరా లో మధ్యలో కొన్ని కంపెనీల జోక్యాన్ని సైతం గుర్తించగలిగింది సిట్ బృందం. అదే సమయంలో నెయ్యి శాంపిల్స్ ను ల్యాబ్ లకు పంపించింది. అటు ప్రాథమిక విచారణ పూర్తికాగా.. అందుకు సంబంధించి నివేదికను తయారుచేసి సిట్ అధికారులు ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేసినట్లు సమాచారం. మొత్తానికైతే లడ్డు కల్తీ విచారణ దాదాపు తుది అంకానికి చేరుకుంది.