తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం హైడ్రా ద్వారా సృష్టించిన బీభత్సం మామూలుది కాదు. చెరువుల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేయడంలో భాగంగా, అక్కినేని నాగార్జున N కన్వెన్షన్ హాల్ ని కూల్చేసిన ఘటన పెద్ద సంచలనంగా మారింది. హై కోర్టు స్టే విధించినా ఎలా కూల్చేస్తారు, దీనిపై న్యాయ పోరాటం చేస్తాను అంటూ నాగార్జున రెస్పాన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కేవలం నాగార్జున కి సంబంధించిన ఆస్తులే కాదు, చెరువుల్లో అక్రమకట్టడాలు ఉన్న సామాన్యుల ఇళ్లను కూడా కూల్చేసిన ఘటనలు ఈమధ్య కాలంలో చాలా చూసాము. ఇది ప్రభుత్వానికి తీవ్రమైన వ్యతిరేక గాలి వీచేలా చేసింది. అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి తన పని తాను చేసుకుంటూ ముందుకు పోతున్నాడు. ఇది ఇలా ఉండగా ఇప్పుడు సినీ హీరో బాలకృష్ణ, జానా రెడ్డి ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వ కన్ను పడినట్టు తెలుస్తుంది.
ఫిల్మ్ నగర్ లో ఉన్నటువంటి నందమూరి బాలకృష్ణ ఇంటికి సుమారు 6 ఫీట్ల వరకు మార్కింగ్స్ చేసారని, ఆయన ఇంటి వద్దకు బుల్డోజర్లు కూడా వచ్చాయని మీడియా లో ఒక వార్త సంచలనం రేపింది. కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లై ఓవర్ బ్రిడ్జీలు, అండర్ పాస్ నిర్మాణాలకు ప్రభుత్వం గత కొద్దిరోజుల క్రితమే ప్లాన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ప్లాన్స్ ని అమలు చేసే విషయం లో భాగంగా జానా రెడ్డి, బాలకృష్ణ ఇంటిలోని కొంత భాగం భూసేకరణ చేయాలనీ నిర్ణయించుకొని, వాళ్ళిద్దరినీ ఏమాత్రం సంప్రదించకుండా వాళ్ళ ఇళ్ల గోడలపై మార్కింగ్స్ చేసింది. దీనిపై అటు బాలకృష్ణ, ఇటు జానారెడ్డి ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదంతా చూసిన అభిమానులు అసలు తెలంగాణలో ఏమి జరుగుతుంది..?, ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి సినీ తారలపై ఇంత పగబట్టాడు అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రజలు పరిపాలించమని ప్రభుత్వం లో కూర్చోబెడితే, ఇలా విద్వంసం చేస్తూ వెళ్లడం ఎంతవరకు సబబు అని మండిపడుతున్నారు.
నిన్ననే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన ఘటన ఇండస్ట్రీ లో పెను దుమారం రేపింది. ఇద్దరి వైపు తప్పులు ఉన్నప్పుడు, కేవలం అల్లు అర్జున్ ని మాత్రమే దోషిగా చూపించడం అన్యాయం అంటూ సినీ సెలెబ్రిటీలు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. అంతకు ముందు మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబం పై చాలా నీచమైన వ్యాఖ్యలు చేసిందని, దానికి సినీ ఇండస్ట్రీ మొత్తం తీవ్రస్థాయిలో విరుచుకుపడి, కొండా సురేఖ ని తప్పుబట్టిన విషయాన్ని మనసులో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి ఇలా ప్రవర్తిస్తున్నాడంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డి తెలుగు దేశం పార్టీ లో ఎన్నో ఏళ్ళు నమ్మకమైన నాయకుడిగా కొనసాగి మంచి పేరుని దక్కించుకున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ తో ఆయనకి ఎంతోమంచి సాన్నిహిత్యం ఉంది, అయినప్పటికీ కూడా ఆయన ఇంటిపై టార్గెట్ చేయడం ఏమిటో విశ్లేషకులకు సైతం అంతు చిక్కడంలేదు.