YS Jagan Tirumala Tour : ఏపీలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. తిరుమల లడ్డు వివాదం చుట్టూ తిరుగుతున్నాయి. వైసిపి ప్రభుత్వ హయాంలో లడ్డు తయారీలో జంతు కొవ్వుతో కూడిన నెయ్యి వాడారు అని టిడిపి ప్రభుత్వం చెబుతోంది. దీనిపై వైసీపీ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యింది. టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన వై వి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. ఈ వివాదాన్ని ఖండించారు. అదే సమయంలో హైకోర్టును ఆశ్రయించారు. సిబిఐ తో కానీ సింగిల్ జడ్జ్ తో కానీ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. జగన్ సైతం స్పందించారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ గా అభివర్ణించారు. అయితే రోజురోజుకు ఈ వివాదం పెరుగుతోంది. అధికార, విపక్షం పరస్పరం దూషించుకుంటున్నాయి. ఈ తరుణంలో వైసిపి అధినేత జగన్ తిరుమల వెళ్తున్నారు. చంద్రబాబు పాప ప్రక్షాళన కోసం అంటూ స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పూజలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. దీంతో ఒక్కసారిగా పొలిటికల్ హైటెన్షన్ నెలకొంది. ఈరోజు సాయంత్రం జగన్ తిరుమల చేరుకోనున్నారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. అయితే జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో దాదాపు పదివేల మంది వైసీపీ శ్రేణులు వస్తారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఈ వివాదం యూటర్న్ తీసుకునే అవకాశం ఉంది. తప్పకుండా ఇది శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అంశమని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఇవి ప్రభుత్వానికి నివేదించినట్లు తెలుస్తోంది.
* తెరపైకి డిక్లరేషన్
అయితే జగన్ తిరుమల పర్యటన ఆసక్తిగా మారింది. ఆయన తిరుమలలో అడుగుపెట్టాలంటే డిక్లరేషన్ ఇవ్వాలన్న కొత్త డిమాండ్ తెర పైకి వచ్చింది. గతంలో ముఖ్యమంత్రి హోదాలో పర్యటించిన సమయంలో కూడా అప్పటి విపక్షాలు డిక్లరేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చాయి. కానీ ముఖ్యమంత్రి హోదాలో డిక్లరేషన్ అవసరం లేదన్నట్టు అప్పటి టీటీడీ ట్రస్ట్ బోర్డ్, అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని టిటిడి అధికారులు తేల్చి చెబుతున్నారు. డిక్లరేషన్ ఇవ్వకుంటే దేవాదాయ శాఖ నిబంధనల మేరకు శ్రీవారి దర్శనానికి అనుమతి ఇవ్వమని చెబుతున్నారు. దీంతో ఇది వివాదంగా మారే అవకాశం కనిపిస్తోంది.
* భారీగా వైసీపీ శ్రేణులు
మరోవైపు జగన్ పర్యటన నేపథ్యంలో భారీగా వైసీపీ శ్రేణులు తరలిరావాలని హై కమాండ్ సూచించినట్లు తెలుస్తోంది. దాదాపు పదివేల మందిని సమీకరించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తిరుమలలో బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటువంటి సమయంలో అలజడులు రేగితే శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంది. ఇంకో వైపు ధార్మిక సంఘాలు, స్వామీజీలు సైతంజగన్ రాకను వ్యతిరేకిస్తున్నారు. వారు సైతం భారీగా తరలిరావాలని పిలుపు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఒకేసారి అనుకూల వ్యతిరేక వర్గాలు తారసపడితే వివాదాలు ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
* ప్రభుత్వం అలెర్ట్
అయితే ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే సీఎం చంద్రబాబు సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ మాత్రం అతి చేసినా మక్కెలు ఇరగదీస్తామని హెచ్చరించారు. దీంతో ఈరోజు, రేపు తిరుమలలో ఏం జరుగుతోందన్న చర్చ బలంగా నడుస్తోంది. ఈరోజు సాయంత్రానికి జగన్ తిరుమల చేరుకోనున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమల వెళ్లనున్నారు. అక్కడ అతిథి గృహంలో బస చేసి.. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే ఇప్పటికే నిఘా వర్గాల హెచ్చరిక నేపథ్యంలో.. చంద్రబాబు సర్కార్ అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒక వ్యూహం రూపొందించుకున్నట్లు సమాచారం. దీంతోఈ 36 గంటల వ్యవధిలో తిరుమలలో ఏం జరుగుతుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.