Palasa cashew : తిరుమల లడ్డూ ప్రసాదానికి తాజాగా ‘పలాస’ జీడిపప్పునే ఎందుకు ఎంపిక చేశారు.. దాని ప్రత్యేకత ఏమిటి?

జీడిపప్పు రుచి వేరు. తెల్ల బంగారంగా దానిని పిలుస్తారు. ఆహార పదార్థాల్లో వినియోగిస్తే ఆ రుచి వేరు. ఏపీలో పలాస జీడిపప్పు కు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు ఏకంగా తిరుమల లడ్డు తయారీకి ఇదే పప్పును వినియోగిస్తుండడం విశేషం.

Written By: Dharma, Updated On : September 27, 2024 12:47 pm

Palasa cashew

Follow us on

Palasa cashew :  కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి.కలియుగ దైవంగా,ఆధ్యాత్మిక కేంద్రంగా తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రం విరాజిల్లుతోంది.నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. పునీతులవుతారు… ఇక్కడప్రసాదానికి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. అన్న ప్రసాదం నుంచి లడ్డు ప్రసాదం వరకు ప్రతిదీ మధురాతి మధురం. అటువంటి పవిత్ర ప్రసాదం తయారీలో భాగస్వామ్యం కావడం కూడా ఒక పుణ్యకార్యంగా భావిస్తారు భక్తులు. తిరుమలలో ప్రసాదం తయారీకి ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. అందులోనూ లడ్డు తయారీకి సంబంధించి నియమనిష్ఠలను అవలంబిస్తారు. లడ్డు తయారీకి ఉపయోగించే ప్రతి పదార్థం నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. లడ్డు తయారీలో భారీ స్థాయిలో జీడిపప్పును వినియోగిస్తారు. జీడిపప్పు లేని తిరుమల లడ్డూను ఊహించలేం. అటువంటిది స్వామి వారి లడ్డు ప్రసాదం తయారీలో వినియోగించే జీడిపప్పును.. పంపిణీ చేసే అదృష్టాన్ని దక్కించుకున్నారు పలాస వ్యాపారులు. ఇటీవల జరిగిన టెండర్లలో పలాస జీడిపప్పు కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది టీటీడీ. అన్ని రకాల ప్రమాణాలు దాటుకుని పలాస జీడిపప్పు లడ్డు తయారీలో వాడేందుకు అన్ని రకాల అర్హతలు సాధించింది.

* టెండర్ దక్కించుకున్న వ్యాపారి
టీటీడీ లడ్డు ప్రసాదానికి అవసరమయ్యే జీడిపప్పును సరఫరా చేసేందుకు.. పలాస కు చెందిన వ్యాపారి కోరాడ సంతోష్ టెండర్లు దక్కించుకున్నారు. కొద్ది రోజుల కిందట గ్లోబల్ విధానంలో టిటిడి టెండర్లను పిలిచింది. ఇందులో కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వందలాది మంది వ్యాపారులు పోటీపడ్డారు. చివరకు సంతోష్ కుమార్ టెండర్లు దక్కించుకున్నారు. రోజుకులడ్డు తయారీకి మూడు టన్నుల జీడిపప్పు అవసరం.ఈ మేరకు పలాస జీడి పరిశ్రమ నుంచి పప్పు సరఫరాకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 45 సంవత్సరాల తరువాత తిరుపతి లడ్డు తయారీకి పలాస జీడిపప్పును సరఫరా చేసి అవకాశం దక్కిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

* నాణ్యమైన జీడిపప్పు
తాజాగా తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు.గ్లోబల్ విధానంలో టెండర్లను ఆహ్వానించారు.ఇక్కడ జీడిపప్పు నాణ్యతను పరిశీలించారు.అన్ని రకాల నిబంధనల మేరకు ఇక్కడ జీడిపప్పు ఉండడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.పలాస కాశీబుగ్గ జంట పట్టణాలు జీడి పరిశ్రమలకు పెట్టింది పేరు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో జీడి అధికంగా సాగు అవుతుంది. దాదాపు 300 వరకు పరిశ్రమలు ఉన్నాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మంది కార్మికులు ఈ పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తుంటారు. అయితే వరుస విపత్తులతో జీడి సాగు తగ్గు ముఖం పట్టింది. జీడి ఉత్పత్తులు సైతం తగ్గాయి. ఇటువంటి పరిస్థితుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు తయారీకి.. పలాస జీడిపప్పునువినియోగించడానికి ముందుకు రావడం శుభ పరిణామంగా వ్యాపారులు చెబుతున్నారు.

* 10 టన్నుల సరఫరా
తాజాగా టీటీడీకి పలాస నుంచి జీడిపప్పు లారీని పంపించారు ఇక్కడ వ్యాపారులు. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెనాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష జండా ఊపి జీడిపప్పుతో వెళ్తున్న లారీని పంపించారు. తొలి రోజు పది టన్నుల జీడిపప్పు తిరుమల వెళ్లడం విశేషం. జీడి కార్మికులు వ్యాపారులు పెద్ద ఎత్తున పాల్గొని లారీని గోవింద నామస్మరణతో సాగనంపారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ తిరుమల లడ్డు ప్రసాదంలో పలాస జీడిపప్పును వినియోగించడం శుభపరిణామం అన్నారు. రాబోయే రోజుల్లో పలాస ఖ్యాతి ప్రపంచవ్యాప్తం కావాలని ఆకాంక్షించారు.