Monkey Flexes: ఇటీవల సోషల్ మీడియా పరిధి పెరిగింది. అందరూ స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది దుర్వినియోగం కూడా చేస్తున్నారు. సోషల్ మీడియాలో నెగిటివిటీ విపరీతంగా పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజల మధ్య విభజనకు కారణం అవుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాను మంచికే వాడుదాం అంటూ ఏపీవ్యాప్తంగా భారీగా ఫ్లెక్సీలు, హోర్డింగులు వెలుస్తున్నాయి. చెడు వినొద్దు.. కనవద్దు.. మాట్లాడవద్దు అంటూ గాంధీజీ చెప్పిన సూక్తిని.. మూడు కోతులతో జతచేస్తూ.. పెట్టిన పోస్టులు ఇప్పుడు దాదాపు అన్ని నగరాల్లో వైరల్ అవుతున్నాయి. మూడు కోతులకు జతగా మరో కోతిని చేర్చి చెడు పోస్టులు వద్దని చెప్పే రీతిలో మెసేజ్ ఇచ్చారు. పోస్ట్ ను ఈవిల్ అంటూ నాలుగో కోతి బొమ్మతో సోషల్ మీడియా గురించి ప్రత్యేకంగా సందేశం ఇచ్చారు. మేక్ సోషల్ మీడియా ఏ పాజిటివ్ ఎక్స్పీరియన్స్ పేరుతో ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
* ఈ నగరాల్లో ఎక్కువగా
ప్రధానంగా విజయవాడ, గుంటూరు దారిలో తాడేపల్లి హైవే వద్ద ఈ భారీ హోర్డింగులు కనబడుతున్నాయి. అమరావతి రాజధాని ప్రాంతం, తిరుపతి, విశాఖ వంటి నగరాల్లో ఈ హోర్డింగులు ఏర్పాటు చేశారు. అయితే వీరిని ఎవరు ఏర్పాటు చేశారు? అంతస్థాయిలో ఖర్చుపెట్టి ఎందుకు చేశారు? ఏదైనా ప్రభుత్వ శాఖ జారీ చేసిందా? లేకుంటే ఇతరులు ఎవరైనా ఏర్పాటు చేశారా? అన్నది హాట్ టాపిక్ అవుతోంది.
* ప్రభుత్వమే ఏర్పాటు చేసిందా?
రాష్ట్ర ప్రభుత్వమే వీటిని ఏర్పాటు చేసినట్లు ప్రచారం నడుస్తోంది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా అరెస్టులు జరిగిన సంగతి తెలిసిందే. మరోసారి అటువంటి పరిస్థితి రాకుండా చూడాలని ప్రభుత్వమే వీటిని ఏర్పాటు చేసినట్లు ఎక్కువమంది భావిస్తున్నారు. అయితే స్వచ్ఛంద సంస్థల సైతం ఏర్పాటు చేసినట్లు అనుమానాలు ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం ప్రకటన చేసే వరకు క్లారిటీ వచ్చే అవకాశం లేదు.