AP Districts: ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా చతికిల బడింది. మూడు రాజధానుల అంశంతోపాటు కరోనా కారణంగా ఏపీలో భూముల ధరలు పూర్తిగా పడిపోయాయి. దీంతో ఇళ్ల స్థలాల కొనుగోళ్లు గణనీయంగా తగ్గాయి. రిజిస్ట్రేషన్ ఆదాయం కూడా పడిపోయింది. తాజాగా టీడీపీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, అమరావతి రాజధానిపై స్పష్టత ఇవ్వడంతో మళ్లీ ఏపీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకోవడం ప్రారంభించింది. మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా రియల్ ఎస్టేట్ రంగాన్ని బలోపేతం చేసేలా కీలక నిర్ణయాలు తీసుకుంది. పట్టణ ప్రణాళికలో సంస్కరణలపై ఇచ్చిన కమిటీ నివేదికను సీఎం ఆమోదించారు. కొత్త సంస్కరణల ప్రకారం.. 15 మీటర్ల ఎత్తు వరకూ భవన నిర్మాణాల ప్లాన్‌లకు మున్సిపల్ శాఖ అనుమతి అవసరం అవసరం లేదని తెలిపింది. అంతకన్నా ఎల్తైన భవనాలకు లైసెన్స్‌డ్ సర్వేయర్లు సంబంధిత ప్లాన్ ఆన్‌లైన్‌లో పెట్టి నగదు చెల్లిస్తే అనుమతి వస్తుంది. మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరిగే అవసరం లేకుండా చేసింది. గతంలో మాదిరిగా నెలలపాటు నిరీక్షించే అవసరం లేకుండా చేశారు. డిసెంబర్ 31 నుంచి సింగల్ విండో విధానం తీసుకొచ్చారు.
-మూడు జిల్లాలు కీలకం..
రాజధానిగా అమరావతి ఉంటుందని టీడీపీ సర్కార్ ప్రకటించింది. ఈ నిర్ణయం కూడా రియల్ వ్యాపారులకు కొత్త ఉత్సాహం ఇచ్చింది. దీంతో రాజధాని సమీపంలో ఉన్న గుంటూరు, విజయవాడతోపాటు, అమరావతిలో భూముల ధరలు పుంజుకున్నాయి. రియల్ వ్యాపారం కూడా ఊపందుకుంది. గడిచిన ఆరు నెలల్లోనే అమరావతి(49.10 శాతం), గుంటూరు(38.27 శాతం), విజయవాడ(31.95 శాతం) రియల్ వ్యాపారం పుంజుకుంది. ఇళ్ల స్థలాలకు ఈ మూడు జిల్లాల్లో డిమాండ్ పెరిగింది. ఈ విషయాన్ని రియల్ ఎస్టేట్ పోర్టల్ మ్యాజిక్ బ్రిక్స్ తాజా నివేదించింది. అమరావతి, గుంటూరు, విజయవాడలో 2024లో దక్షిణ భారత దేశంలో కొత్త రెసిడెన్షియల్ ఫేవరెట్‌గా రూపుదిద్దుకుంటున్నాయి.
-ధరల ప్రభావం..
తాజా నివేదిక ప్రకారం 2 కోట్ల మంది వినియోదారులు ప్రాధాన్యత ఆధారంగా మూడు జిల్లాల్లోనే భూముల కొనుగోలుకు ఆసక్తి కనబర్చారు. అయితే అధిక ధరలు కూడా కొనుగోళ్లపై ప్రభావం చూపాయి. గుంటూరు(–22.57 శాతం), అమరావతి(–6.7శాతం), విజయవాడ(–18.46 శాతం) నివాసాల లిస్టింగ్ తగ్గాయని నివేదిక వెల్లడించింది. ప్రభుత్వ చర్యలతో భూముల ధరలు ఒకేసారి భారీగా పెరగడమే ఇందుకు కారణమని వెల్లడించింది. ధరలు కాస్త తక్కువగా ఉండి ఉంటే.. క్రయ విక్రయాలు మరింత పెరిగేవని తెలిపింది.