AP Politics: ప్రజాక్షేత్రం నుంచి తప్పుకున్న ఆ నలుగురు నేతలు

విజయనగరం జిల్లాలో పూసపాటి అశోక్ గజపతిరాజు దశాబ్దాలుగా పట్టు సాధిస్తూ వచ్చారు. విజయనగరం రాజ కుటుంబానికి చెందిన అశోక్ గజపతిరాజు 1978లో రాజకీయ అరంగేట్రం చేశారు. జనతా పార్టీ తరఫున పోటీ చేసి తొలి విజయం అందుకున్నారు.

Written By: Dharma, Updated On : April 8, 2024 12:16 pm

AP Politics

Follow us on

AP Politics: రాష్ట్ర రాజకీయాల్లో విజయనగరం జిల్లాది ప్రత్యేక స్థానం. ఈ జిల్లాకు చెందిన ఎంతో మంది నేతలు రాజకీయాల్లో రాణించారు. తమదైన ముద్ర చూపించారు. దశాబ్దాలుగా రాజకీయాలు చేశారు. కానీ ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలు యువతరానికి ప్రాధాన్యం ఇవ్వడంతో.. ఆ వృద్ధ నేతలు ప్రత్యక్ష రాజకీయాలకు ముగింపు పలికారు. స్వచ్ఛందంగా పక్కకు తప్పుకొని కొత్త నేతలకు అవకాశం ఇచ్చారు. పూసపాటి అశోక్ గజపతిరాజు, వైరిచర్ల కిషోర్ చంద్ర దేవ్, శత్రుచర్ల విజయరామరాజు, పతివాడ నారాయణస్వామి నాయుడులు ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. దీంతో దశాబ్దాల రాజకీయ చరిత్రకు తెరపడినట్లు అయ్యింది.

విజయనగరం జిల్లాలో పూసపాటి అశోక్ గజపతిరాజు దశాబ్దాలుగా పట్టు సాధిస్తూ వచ్చారు. విజయనగరం రాజ కుటుంబానికి చెందిన అశోక్ గజపతిరాజు 1978లో రాజకీయ అరంగేట్రం చేశారు. జనతా పార్టీ తరఫున పోటీ చేసి తొలి విజయం అందుకున్నారు. టిడిపి ఆవిర్భావంతో ఎన్టీఆర్ పిలుపుమేరకు ఆ పార్టీలో చేరారు. 1983 ఎన్నికల్లో గెలుపొంది ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రి పదవి చేపట్టారు. తరువాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కీలక పోర్టు పోలియోలను దక్కించుకున్నారు. 2014లో మాత్రం విజయనగరం పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొంది.. ఎన్డీఏ ప్రభుత్వంలో పౌర విమానయాన శాఖను దక్కించుకున్నారు. కానీ ఈ ఎన్నికల్లో వయోభారంతో తప్పుకున్నారు. కుమార్తె అదితి గజపతి రాజును రెండోసారి విజయనగరం అసెంబ్లీ స్థానానికి టిడిపి అభ్యర్థిగా నిలబెట్టారు. ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్లు కూడా అశోక్ ప్రకటించారు.

పాత తరం నేతల్లో రాజకీయాలకు వన్నెతెచ్చిన నాయకుల్లో వైరిచర్ల కిషోర్ చంద్ర సూర్యనారాయణ దేవ్ ఒకరు. 1977లో తొలిసారిగా పార్వతీపురం పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కిషోర్ ఎంపీగా గెలుపొందారు. ఐదుసార్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. సుదీర్ఘకాలం కేంద్ర మంత్రివర్గంలో కొనసాగారు. అయితే గత ఎన్నికల్లో అనూహ్యంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. అరకు పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటినుంచి యాక్టివ్ రాజకీయాలకు దూరమయ్యారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో.. టిడిపికి కిషోర్ రాజీనామా ప్రకటించారు. ఇకనుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనకూడదని నిర్ణయం తీసుకున్నారు.

దశాబ్దాల పాటు రాజకీయాల్లో శత్రుచర్ల విజయరామరాజు చెరగని ముద్ర వేసుకున్నారు. 1978లో తొలిసారిగా నాగూరు నియోజకవర్గం నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన శత్రుచర్ల ఎమ్మెల్యేగా గెలుపొందారు. అటు తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1978, 83, 85, 99 లో వరుసగా నాగూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు.2009లో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 1989, 91లో కాంగ్రెస్ ఎంపీగా, 1998లో టిడిపి ఎంపీగా పార్వతీపురం నుంచి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కానీ చంద్రబాబు 2017లో శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. గత కొద్ది రోజులుగా వయోభారంతో బాధపడుతున్న ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనడం లేదు.

రాజకీయ కురువృద్ధుడు పతివాడ నారాయణస్వామి నాయుడు ఈసారి ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డ్ సృష్టించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్టీఆర్ అభిమాని అయిన నారాయణ స్వామి నాయుడు ఆ పార్టీలో చేరారు. 1983 నుంచి 2004 వరకు వరుసగా ఆరుసార్లు భోగాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో భోగాపురం కనుమరుగయ్యింది. నెల్లిమర్ల నియోజకవర్గం గా రూపాంతరం చెందింది. 2009 ఎన్నికల్లో తొలిసారిగా నారాయణస్వామి నాయుడుకు ఓటమి ఎదురైంది. 2014లో మాత్రం మరోసారి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన గెలుపొందారు. 2019లో ఓడిపోయారు. వయోభారంతో బాధపడుతుండడంతో ప్రత్యక్ష ఎన్నికల నుంచి తప్పుకున్నారు. మొత్తానికైతే ఏపీ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్న విజయనగరం జిల్లాకు చెందిన నలుగురు నేతలు ప్రజాక్షేత్రం నుంచి తప్పుకోవడం లోటే.