Shakeel Son Arrested
Shakeel Son Arrested: నాలుగు నెలల క్రితం సంచలనం సృష్టించిన ర్యాష్ డ్రైవింగ్ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ర్యాష్ డ్రైవింగ్ చేసి దుబాయ్ పారిపోయిన రహీల్ నాలుగు నెలలు అక్కడే ఉన్నాడు. సోమవారం హైదరాబాద్‌కు తిరిగి రావడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఎయిర్‌పోర్ట్‌లోనే అరెస్ట్ చేశారు. ప్రజాభవన్ దగ్గర బారికేడ్‌ను ఢీకొట్టిన కేసులో రహీల్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.
ఇప్పటికే లుకౌట్ నోటీసులు..
రహీల్‌పై పోలీసులు ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో అతడిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. ఇక 2023 డిసెంబర్ 24న పంజాగుట్ట హిట్ అండ్ రన్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం రహీల్ అమిర్ దుబాయ్ పారిపోయాడు. దీని తర్వాత అనేక పరిణామాలు జరిగాయి. రహీల్‌ను దేశం దాటించేందుకు పోలీసులు, అధికారులు సాయం అందించినట్లు తేలింది. దీంతో ఈ ఘటనతో సంబంధం ఉన్న పంజాగుట్ట, బోధన్ సీఐలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
ఆ రోజు ఏం జరిగింది?
గత డిసెంబర్ 24న యాక్సిడెంట్ తర్వాత సోహైల్‌ను పంజాగుట్ట ఠాణాకు కానిస్టేబుళ్లు తరలించారు. అంతలోనే మాజీ ఎమ్మెల్యే షకీల్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కానీ ఠాణాలో ఏం మంత్రాంగం జరిగిందో తెలియదు కానీ సోహైల్ బదులు షకీల్ ఇంట్లో పని మనిషిని కేసులో చేర్చారు పోలీసులు. సీన్ కట్‌చేస్తే ఎమ్మెల్యే కుమారుడు దుబాయ్ పారిపోయాడు. ఈ వ్యవహారంలో సీఐ, నైట్ డ్యూటీ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్ల పాత్ర ఉన్నట్లు తేల్చిన అధికారులు వారిని అరెస్టు చేశారు.
లుకౌట్ నోటీసులు కొట్టేయాలని కోర్టుకు..
ఇదిలా ఉంటే షకీల్ కొడుకు రహీల్ హైకోర్టును ఆశ్రయించాడు. తనపై ఉన్న లుకౌట్ నోటీసులు కొట్టివేయాలని పిటిషన్ వేశాడు. ప్రమాదం తర్వాత దుబాయ్ పారిపోయిన రహీల్ నాలుగు నెలలు అక్కడే ఉన్నాడు. ఈ కేసులో రహీల్ తండ్రి షకీల్‌ను సైతం నిందితుడిగా చేర్చిన పోలీసులు ఆయనపై కూడా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దీంతో సీన్‌లోకి వచ్చిన రహీల్ తనపై ఉన్న లుకౌట్ నోటీసులు కొట్టివేయాలని పిటిషన్ వేశాడు. పోలీసులకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపాడు.
ఏప్రిల్ 22 వరకు రిమాండ్
ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకన్న పోలీసులు రహీల్‌ను కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి అతనికి ఏప్రిల్ 22 వరకు రిమాండ్ విధించారు. దీంతో అతడిని చర్లపల్లి జైలుకు తరలించారు.