Chandrababu : చంద్రబాబులోని ఆ గొప్పతనం ఇదే

చంద్రబాబును వ్యతిరేకించే పార్టీలు, వ్యక్తులు తరువాత ఆయన చెంతకే చేరడం ఒక నిత్యకృత్యమే. ఆయనలో మాస్ కంటే క్లాస్ ఇమేజే అధికం. అందువల్లే ఆయనను విభేదించి తిట్టిన వారు సైతం ఆయన చెంతకు చేరగలుగుతున్నారన్న విశ్లేషణలు ఉన్నాయి. 

Written By: Dharma, Updated On : June 16, 2023 6:36 pm
Follow us on

Chandrababu : చంద్రబాబు.. ఈ పేరు చెబితేనే రాజకీయ అపర చాణుక్యుడిగా పిలిచిన వారు అధికం.  సమయానుకూల నిర్ణయాలు, ప్రత్యర్థులను పావులుగా వినియోగించుకోవడంలో చాకచక్యం అతని సొంతం. దేశంలో సీనియర్ రాజకీయవేత్తల్లో ఒకరిగా తనను తాను చెప్పుకుంటుంటారు. అంతకుమించి పొలిటికల్ టైమింగ్ లో ఆయనను మించిన సీనియర్ లేరనే చెప్పుకోవాలి. శరద్ పవార్, ములాయం సింగ్ యాదవ్ వంటి వారు నిజానికి వయసు, అనుభవం రీత్యా చంద్రబాబుకంటే సీనియర్లు. కానీ ఎత్తుగడలు, ఎదురీతలు, పరిస్థితులను మలచుకోవడంలో మాత్రం చంద్రబాబే సిద్ధహస్తుడు. తనను విభేదించిన వారిని సైతం తన దగ్గర చేర్చుకోగల నేర్పరి. ఈ విషయంలో చంద్రబాబు గొప్పతనాన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే.

2009లో ప్రజారాజ్యం ఆవిర్భవించిన తరువాత పార్టీకి గడ్డుకాలం ఎదురైంది. దేవేందర్ గౌడ్, కిమిడి కళా వెంకటరావు, తమ్మినేని సీతారాం, గంటా శ్రీనివాసరావు..ఇలా చెప్పుకుంటూ పోతే సీనియర్లు అంతా పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోయారు. వెళుతూ వెళుతూ అధినేతపై నిందలు మోపి వెళ్లారు. తీవ్ర విమర్శలు చేశారు. కానీ అదే నేతలు కొన్నాళ్లకే చంద్రబాబు పంచన చేరారు. గతంలో ఏమీ జరగనట్టు చంద్రబాబు కూడా వారిని సాదరంగా ఆహ్వానించారు. మునుపటి ప్రాధాన్యతను ఇచ్చి ప్రోత్సాహం అందించారు. పార్టీలో యాక్టివ్ రోల్ ను కల్పించారు.

కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పురుడుబోసుకున్న పార్టీ తెలుగుదేశం. అటువంటి టీడీపీ చెంతకే కాంగ్రెస్ పార్టీని రప్పించుకున్న నేర్పరి చంద్రబాబు. 2018 ఎన్నికల్లో తెలంగాణలో, 2019 ఎన్నికల్లో ఏపీలో అదే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. రాహుల్ గాంధీనిని ప్రధానిగా చేసేందుకు దేశంలో ఊరువాడా తిరిగి ప్రచారం చేశారు. దురదృష్టం కొద్ది ఆ ప్రయత్నం వర్కవుట్ కాలేదు. కాంగ్రెస్ ను గట్టెక్కించలేకపోయారు. తాను ఏపీలో ఘో ఓటమిని మూటగట్టుకున్నారు.

బీజేపీకి నమ్మదగిన మిత్రుడిగా ఉన్న చంద్రబాబు చాలా సందర్భాల్లో ఆ పార్టీని వ్యతిరేకించారు. 2004 వరకూ ఆ పార్టీతో స్నేహం కొనసాగించారు. కానీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడంతో బీజేపీని విభేదించారు. 2009 ఎన్నికల్లో బీజేపీని మతతత్వ పార్టీగా వర్ణించారు. భవిష్యత్ లో ఆ పార్టీతో కలిసి నడిచేది లేదంటూ ప్రతినబూనారు. కానీ 2014 ఎన్నికల్లో అదే బీజేపీతో చెలిమి చేశారు. ఎన్డీఏ సర్కారులో భాగస్థులయ్యారు. 2019 ఎన్నికలు వచ్చేసరికి బీజేపీకి వ్యతిరేకంగా పావులు కదిపారు. మోదీని గద్దె దించేందుకు గట్టిగా ప్రయత్నించారు. ఇప్పుడు ఎన్నికలు సమీపించేసరికి అదే బీజేపీకి దగ్గరయ్యేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారు.

వామపక్షాల గురించి చెప్పనక్కర్లేదు. చంద్రబాబును వ్యతిరేకిస్తుంటాయి. కానీ ఆయన పంచన చేరుతుంటాయి. ఒకటి, రెండు స్థానాలు తమకిస్తే చాలు అన్నట్టు ఆఫర్ చేస్తుంటాయి. వామపక్షాల అగ్ర నాయకత్వం సైతం చంద్రబాబుకు ఎప్పుడూ అనుకూలంగా ఉంటాయి. జనసేనాని పవన్ సైతం చంద్రబాబు విషయంలో అనుకూలమే. 2014 ఎన్నికల్లో బాహటంగా మద్దతు పలికారు. 2019 ఎన్నికల్లో విభేదించారు. ఇప్పుడు మరోసారి పొత్తు పెట్టుకుంటున్నారు. చంద్రబాబును వ్యతిరేకించే పార్టీలు, వ్యక్తులు తరువాత ఆయన చెంతకే చేరడం ఒక నిత్యకృత్యమే. ఆయనలో మాస్ కంటే క్లాస్ ఇమేజే అధికం. అందువల్లే ఆయనను విభేదించి తిట్టిన వారు సైతం ఆయన చెంతకు చేరగలుగుతున్నారన్న విశ్లేషణలు ఉన్నాయి.