AP Police : కనిపించే మూడు సింహాలు న్యాయానికి, ధర్మానికి, చట్టానికి ప్రతీకలైతే.. ఆ కనిపించని నాలుగో సింహమేరా పోలీస్..సాయికుమార్ హీరోగా నటించిన పోలీస్ స్టోరీలో పవర్ ఫుల్ డైలాగు ఇది. కానీ ప్రస్తుతం ఏపీలో నాలుగో సింహం కనిపించడం లేదు. అసలు తాను సింహమనే సంగతి మరిచిపోయినట్టుంది పాపం. రాజకీయ ప్రమేయంతో సింహాం నీరసించిపోయింది. హై ప్రొఫైల్ కేసులో పోలీసులు చెబుతున్న మాటలకు కనీస విలువ లేదు. కేసుల ఛేదనలో వారు చెబుతున్న మాటలు నమ్మశక్యంగా లేవు. నేరస్థులతో కుమ్మక్కు అవుతున్నట్టు.. అదే నేరస్థులకు నేరాలు చేయాలని పురమాయిస్తున్నట్టు వారి చర్యలు ఉన్నాయి.
విశాఖలో ఎంపీ కుటుంబసభ్యుల కిడ్నాప్ డబ్బుకోసమేనట. నగదు కోసమే వారు రెండు రోజుల పాటు కిడ్నాప్ చేశారుట. ముందుగా కుమారుడు, ఆపై భార్య, పేరుమోసిన ఆడిటర్ ను అపహరించారుట. ఇలా చెప్పేందుకు పోలీసులకు ఏమాత్రం బిడియం లేకున్నా.. నమ్మేందుకు మాత్రం ప్రజలు చెవిలో పువ్వులు పెట్టుకోలేదు. ఆయన అధికార పార్టీ ఎంపీ. పైగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన విశాఖ పార్లమెంట్ స్థానానికి సభ్యుడు. పైగా పేరు మోసిన బిల్డర్.
భూ లావాదేవీల నుంచి వివాదాలు ఆయన వెనుక నడుస్తుంటాయి. కేవలం గంజాయి, మద్యం తాగే డేగ గ్యాంగ్ ఏకంగా ఓ ఎంపీ కుమారుడు, భార్యనే కిడ్నాప్ చేసిందంటే నమ్మాలట. పైగా సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు ఆడిటర్ జీవీని సైతం ట్రాప్ చేయడం.. నగదు కోసమేనని చెప్పడం దేనికి సంకేతమో పోలీసులకే తెలియాలి. విశాఖ నగర పోలీస్ కమిషనర్ విక్రం వర్మ నుంచి కింది స్థాయి పోలీసు అధికారులు వరకూ నగదు వ్యవహారమే కారణమని చెబుతుండం ఏమంత నమ్మశక్యంగా లేదు. ఇందులో ఏదో దాస్తున్నట్టు స్పష్టంగా అవగతమవుతోంది.
టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమైన వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఇంటిపై కొందరు ఆగంతకులు దాడికి దిగిన సంగతి తెలిసిందే. పక్కా రాజకీయ వ్యూహంతో జరిగింది ఈ దాడి. కానీ పోలీసులు మాత్రం లైట్ తీసుకుంటున్నారు. తమ క్రేజ్ ను పెంచేందుకే కొందరు ఇలా దాడికి దిగారని.. ఏమంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదని తేల్చేస్తున్నారు. ఇందులో ఏ కోణం లేదని.. రాజకీయ ప్రేరేపిత చర్యే కాదని చెబుతున్నారు. మా పార్టీ కార్యకర్తలు బీపీలు వచ్చిన కారణంగా దాడులు జరుగుతున్నాయని చెప్పిన పాలకులు ఉన్న రాష్ట్రంలో ఈ తీరిన కాకుంటే.. మరి ఏ తీరున రాజకీయ విధ్వంసాలుంటాయో తెలియంది కాదు. కానీ పోలీసులు తమ సెల్ప్ రెస్పాక్ట్ ను కాపాడుకోవాల్సింది పోయి దిగజార్చుకోవడం మాత్రం జుగుప్సాకరంగా ఉంది.