Homeఆంధ్రప్రదేశ్‌ఏపీలో ఇదో అత్యద్భుత సీన్

ఏపీలో ఇదో అత్యద్భుత సీన్

Heavyrainfall in Rayalaseema

నైరుతి రుతుపవనాలు, అల్పపీడన ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు స్టేట్లలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారు జామునుంచి అన్ని జిల్లాల్లో వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో రాయలసీమ కరువు తీరేలా వాన పడింది. సీమలోని నాలుగు జిల్లాలు తడిచి ముద్దయ్యాయి. దేశంలోనే అత్యంత తక్కువగా వర్షపాతం నమోదయ్యే రెండే జిల్లాగా గుర్తింపు పొందిన అనంతపురంలో విస్తారంగా వర్షాలు పడ్డాయి.

ఫలితంగా ఎండిపోయిన వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో కుండపోత వర్షం కురిసింది. అనంతపురం జిల్లా కదిరి సమీపంలోని మద్దిలేర వాగుకు వరద ప్రవాహం పోటెత్తింది. వరదనీటితో పొంగిపొర్లుతోందా నది. దశాబ్దాలుగా నీటి ప్రవాహం జాడ కూడా తెలియని నది అది. మద్దిలేరు వాగు ఒకటుందనే విషయాన్ని కదిరి ప్రాంత వాసులు దాదాపు మరిచిపోయారు. తాజాగా కురిసిన భారీ వర్షాలకు అలాంటి నది ఉప్పొంగింది.

కదిరి-గోరంట్ల మార్గాన్ని వాన ముంచెత్తింది. ఫలితంగా ఈ మార్గంలో రాకపోకలు స్తంభించిపోయాయి. పలు చోట్ల రోడ్డు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. అత్యధికంగా కదిరిలో 263 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గాండ్లపెంట, యర్రదొడ్డి, నల్లమాడ, ఓబులదేవర చెరువుల్లో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసింది. అనంతపురం, గోరంట్ల, తనేకల్ లల్లో భారీ వర్షాలు కురిశాయి. అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ జిల్లాల్లో వర్షపాతం నమోదైంది.

టెక్కలి, మచిలీపట్నం, రాజమండ్రి, భీమవరం, పోలవరం, కాకినాడ, తణుకు, యానాం, రంపచోడవరం, సామర్లకోటల్లో వర్షం కురిసింది. అనకాపల్లి, యలమంచిలి, నర్సీపట్నం, చోడవరం, పెందుర్తి, ఆనందపురం, పద్మనాభం, గాజువాక, పరవాడల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. చిత్తూరు జిల్లా రామకుప్పం, పూతలపట్టు, కడప జిల్లా మైదుకూరు జమ్మలమడుగు, ప్రొద్దుటూరుల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఇదే పరిస్థితి ఇంకో రెండు, మూడు రోజుల పాటు ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular