AP Politics: కూటమి అధికారంలోకి వస్తుందని మూడు పార్టీల నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. పెరిగిన ఓటింగ్, ప్రభుత్వ వ్యతిరేకత టిడిపి కూటమికి అధికారం తెచ్చిపెడుతుందని ఆశాభావంతో ఉన్నారు. ఈ తరుణంలో ఆ పార్టీ సోషల్ మీడియా అభిమానులు కొత్త చర్చకు తెర లేపారు. కొత్త మంత్రివర్గం ఇదే అంటూ అతి ఉత్సాహవంతులు జాబితాను ప్రకటిస్తున్నారు. రకరకాల ఈక్వేషన్ తో మంత్రులు వీరే అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించేస్తున్నారు. అయితే కీలకమైన హోం మంత్రి విషయంలో మాత్రం కన్ఫ్యూజ్ అవుతున్నారు. చాలా రకాల ఆప్షన్స్ ఇస్తున్నారు. ఓ ఆరుగురు హోం మంత్రి పదవికి అర్హులంటూ చెప్పుకొస్తున్నారు.అందులో ముందు వరుసలో ఉన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. రెండో అతిపెద్ద పార్టీగా జనసేనకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపడితే.. ఆ తరువాత స్థానంలో ఉండే హోం మంత్రి పదవి పవన్ కళ్యాణ్ కు అప్పగిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. డిప్యూటీ సీఎం పదవితో పాటు హోం మంత్రిగా పవన్ కు ఛాన్స్ ఇస్తే సముచిత స్థానం ఇచ్చినట్టు అవుతుందని.. కూటమి ధర్మం పాటించినట్టు అవుతుందని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి.
మరోవైపు హోం మంత్రి పదవిని రఘురామకృష్ణం రాజుకు అప్పగించాలన్న ప్రతిపాదన కూడా వస్తోంది. గత ఎన్నికల్లో వైసిపి ఎంపీగా గెలుపొందిన ఆయన.. ఆరు నెలలు తిరగకముందే పార్టీ నాయకత్వాన్ని వ్యతిరేకించారు. బద్ధ శత్రువుగా మారిపోయారు. ప్రత్యర్థి పార్టీలకు మించి అధికార వైసిపి పై ఆరోపణలు చేశారు. ప్రతిపక్షాలకు కొత్త అస్త్రాన్ని అందించారు. వైసిపి పై వ్యతిరేకత పెంచడంలో కీలక పాత్ర పోషించారు. అటువంటి వ్యక్తికి హోం మంత్రిగా ఛాన్స్ ఇస్తే.. వైసీపీకి ఇబ్బందికర పరిస్థితులు తేవచ్చు అన్నది ఒక రకమైన విశ్లేషణగా తెలుస్తోంది.
ఇక తెలుగుదేశం పార్టీ పరంగా హోం మంత్రి పదవికి టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడు కరెక్ట్ అయిన వ్యక్తిగా ప్రచారం జరుగుతోంది. గత ఐదు సంవత్సరాలుగా చంద్రబాబు తరువాత వైసిపి పై అటాచ్ చేయడంలో ఆయన ముందు వరుసలో ఉన్నారు. వైసీపీకి అడ్డంగా వెళ్లడంలో ఆయనది అందివేసిన చేయి. అందుకే వైసిపి ప్రభుత్వం నుంచి ఎన్నో రకాల కేసులను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే టిడిపి అధికారంలోకి వస్తే తాను హోంమంత్రి అవుతానని.. అందరి లెక్కలు తేల్చుతానని హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల ఎన్నికల ప్రచారంలో.. ఏకంగా లోకేష్ నే ఈ విషయంపై అడిగేశారు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు. అచ్చెనాయుడుకు హోం మంత్రి పదవి ఇస్తే గత ఐదు సంవత్సరాలుగా జరిగిన పరిణామాలకు బదులు చెప్పొచ్చని కోరారు. దీనికి లోకేష్ సానుకూలంగా కూడా స్పందించారు.
ఆఖరి నిమిషంలో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ పై పోటీకి దిగారు కళా వెంకట్రావు. ఆయన సైతం హోం మంత్రి పదవిని ఆశిస్తున్నారు. సరిగ్గా మూడు దశాబ్దాల క్రితం అదే మంత్రి పదవిని కళా నిర్వర్తించారు. రాజకీయాలనుంచి రిటైర్ కావాలని ఆలోచనతో ఉన్న ఆయన.. గౌరవప్రదమైన నిష్క్రమనను కోరుకుంటున్నారు. ఆయన సైతం హోం మంత్రి పదవిని ఆశిస్తున్నారు.
విశాఖకు చెందిన సీనియర్ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు సైతంహోం మంత్రి పదవిని ఆశిస్తున్నారు. చాలా సందర్భాల్లో తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారు. గత ఐదు సంవత్సరాలుగా దూకుడు ప్రదర్శించారు అయ్యన్నపాత్రుడు. కేసులు, దాడులకు ఎన్నడూ భయపడలేదు. అందుకే ఆయన సైతం హోం మంత్రి పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే కూటమి అధికారంలోకి వస్తే.. హోం మంత్రి పదవికి ఎక్కడ లేని డిమాండ్ కనిపిస్తుండడం విశేషం.