Nara Lokesh: లోకేష్ కు నో ఛాన్స్.. ఈసారికి ఎమ్మెల్యేగానే

మంగళగిరి నుంచి రెండోసారి పోటీ చేస్తున్నారు లోకేష్. గత ఎన్నికల్లో సిట్టింగ్ మంత్రిగా ఉంటూ ఓడిపోయారు. 5000 ఓట్లతో ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిచారు. అయితే ఓడిన మరుక్షణం నుంచి మంగళగిరి పై లోకేష్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.

Written By: Dharma, Updated On : May 23, 2024 3:11 pm

Nara Lokesh

Follow us on

Nara Lokesh: తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుది ప్రత్యేక స్థానం. ఎన్టీఆర్ నుంచి పార్టీని టేకోవర్ చేసుకునే సమయంలో.. అసలు చంద్రబాబు నిలబడగలరా? పార్టీని నడిపించగలరా? అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. కానీ సుదీర్ఘకాలం ప్రతిపక్ష నేతగా.. ఉమ్మడి ఏపీకి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన వ్యక్తిగా రికార్డులకు ఎక్కారు. అయితే ఆయన ఎదుగుదల వెనుక కీలక నిర్ణయాలు ఉన్నాయి. ఇప్పుడు లోకేష్ విషయంలో అదే ఫార్ములాను చంద్రబాబు అప్లై చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో కూటమికి ఛాన్స్ ఉన్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఈ తరుణంలో లోకేష్ పాత్ర ఏంటన్నది తెలియాల్సి ఉంది. ఆయనను క్యాబినెట్లో తీసుకుంటారా? లేకుంటే పార్టీ పగ్గాలు అప్పగిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.

మంగళగిరి నుంచి రెండోసారి పోటీ చేస్తున్నారు లోకేష్. గత ఎన్నికల్లో సిట్టింగ్ మంత్రిగా ఉంటూ ఓడిపోయారు. 5000 ఓట్లతో ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిచారు. అయితే ఓడిన మరుక్షణం నుంచి మంగళగిరి పై లోకేష్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. లోకేష్ అడుగులను గమనించిన వైసీపీ ఎప్పటికప్పుడు వ్యూహాలను మార్చింది . సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి మొండి చేయి చూపింది. టిడిపి నుంచి వచ్చిన గంజి చిరంజీవిని ఇన్చార్జిగా మార్చింది. ఆయన ప్రజల్లోకి వెళ్లే క్రమంలో.. ఆయనను సైతం పక్కకు తప్పించింది. తెరపైకి మురుగుడు లావణ్యను తెచ్చింది. ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. అయితే వైసీపీలో జరిగిన ఈ నిర్ణయాలతో ఆ పార్టీ డీలా పడింది. ఈ క్రమంలో లోకేష్ నియోజకవర్గంలో చొచ్చుకుపోయారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉండడంతో మంచి మెజారిటీతో గెలుస్తారని సంకేతాలు అందుతున్నాయి.

అయితే ఈసారి కూటమి అధికారంలోకి వస్తే లోకేష్ ను మంత్రివర్గంలో తీసుకునే ఛాన్స్ లేదని తెలుస్తోంది. టిడిపి ఆవిర్భావ సమయంలో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. 1983లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టిడిపి అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అటు తరువాత చంద్రబాబు టిడిపిలో చేరారు. చేరిన వెంటనే పార్టీ బాధ్యతలను మాత్రమే స్వీకరించారు. 1985 ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేయలేదు. పార్టీ బాధ్యతలను ఆయన చూసుకోగా.. ప్రభుత్వ పాలనకు సంబంధించి తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు చూసుకునేవారు. అదే 1995 సంక్షోభ సమయంలో అక్కరకు వచ్చింది. టిడిపిని ఎన్టీఆర్ నుంచి స్వాధీనం చేసుకునే క్రమంలో పార్టీ క్యాడర్ చంద్రబాబుకు సహకరించింది. నాడు పార్టీ శ్రేణులతో మమేకం కావడం వల్లే చంద్రబాబు సుదీర్ఘకాలం పార్టీని నడిపించగలిగారు. నిలబెట్టుకుంటూ వస్తున్నారు.

చంద్రబాబు తర్వాత టిడిపిలో ఎవరంటే.. మొన్నటి వరకు ఎవరి పేరు చెప్పలేని పరిస్థితి. కానీ గత ఎన్నికల్లో ఓటమి తర్వాత లోకేష్ లో ఒక రకమైన చేంజ్ కనిపించింది. సుదీర్ఘకాలం పాదయాత్ర చేసిన లోకేష్ పాస్ మార్కులు సాధించారు. పార్టీపై పట్టు సాధించగలిగారు. అందుకే తన తర్వాత పార్టీ పగ్గాలు అందుకోవాలని లోకేష్ కు మరికొంత సమయం అవసరమని చంద్రబాబు భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం కావడంతో.. ప్రభుత్వ అధినేతగా తాను ఉంటూ.. పార్టీని లోకేష్ కు అప్పగించేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సో కొద్ది రోజుల వరకు లోకేష్ ఎమ్మెల్యే గానే ఉంటారన్నమాట.